వడ్లు కొంటారా లేదా.. సుత్తి లేకుండా సూటిగా చెప్పండి
దిశ, ఆర్మూర్: ‘వడ్లు కొంటారా? లేదా?.. సుత్తి లేకుండా సూటిగా చెప్పండి. గల్లీలో సిల్లీ రాజకీయాలు వద్దు. ఇక్కడ పాదయాత్ర చేయడం కాదు. ఢిల్లీపై దండయాత్ర చేయండి. తెలంగాణలో పండించిన వడ్లను కొనుగోలు చేసేలా కేంద్రాన్ని ఒప్పించండి’ అని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. నందిపేట్ మండలం మారంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు. పంటల దిగుబడిలో తెలంగాణ రైతులు […]
దిశ, ఆర్మూర్: ‘వడ్లు కొంటారా? లేదా?.. సుత్తి లేకుండా సూటిగా చెప్పండి. గల్లీలో సిల్లీ రాజకీయాలు వద్దు. ఇక్కడ పాదయాత్ర చేయడం కాదు. ఢిల్లీపై దండయాత్ర చేయండి. తెలంగాణలో పండించిన వడ్లను కొనుగోలు చేసేలా కేంద్రాన్ని ఒప్పించండి’ అని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. నందిపేట్ మండలం మారంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు. పంటల దిగుబడిలో తెలంగాణ రైతులు పంజాబ్‌నే మించిపోయారన్నారు. ఈ సీజన్‌లో దాదాపు 62 లక్షల ఎకరాల్లో ఒక కోటి రెండు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండాయన్నారు. కేవలం 59 లక్షల 70 వేల మెట్రిక్ టన్నల ధాన్యమే కొంటామని, మిగిలిన పంటను కొనబోమని కేంద్ర ప్రభుత్వం కొర్రీ పెట్టిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌లో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటున్నట్లే తెలంగాణ రాష్ట్రంలోనూ కొనేలా ఒప్పించే బాధ్యత రాష్ట్ర బీజేపీ నాయకులదేనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎంపీ అర్వింద్ ధర్నాలో పాల్గొనాలి
పసుపు రైతులను నిలువునా మోసం చేసినందుకు ధర్మపురి అర్వింద్ ఎంపీ పదవికి రాజీనామా చేసి శుక్రవారం ఆర్మూరులో జరిగే రైతు ధర్నాలో పాల్గొనాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం వరిధాన్యం కొనాలన్న డిమాండ్‌తో శుక్రవారం ఆర్మూర్‌లో 5 వేల మందితో ధర్నా చేస్తామని జీవన్ రెడ్డి తెలిపారు. ధర్నాతో కేంద్రం కళ్లు తెరిపిద్దామని, రైతులంతా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మారంపల్లి, డొంకేశ్వర్ గ్రామాల్లో పలువురు రైతులను పరామర్శించారు. అనంతరం పలువురికి ప్రభుత్వం ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.