భగీరథ.. సాగదీత!

దిశ, ఆదిలాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన మానసపుత్రికగా చెప్పుకుంటున్న మిషన్ భగీరథ పథకం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. కాగితాల్లో మాత్రం 90 శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నా వాస్తవానికి 50 శాతం కూడా పూర్తి కాలేదని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి సమావేశంలో మిషన్ భగీరథ పూర్తి చేయాలని కఠినమైన ఆదేశాలు ఇస్తున్నప్పటికీ అమలు మాత్రం ఆమడదూరంలో ఉంటున్నాయి. మిషన్ భగీరథపై ఉమ్మడి జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికార యంత్రాంగంపై ఏ స్థాయిలో ఫైర్ […]

Update: 2020-03-09 01:49 GMT

దిశ, ఆదిలాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన మానసపుత్రికగా చెప్పుకుంటున్న మిషన్ భగీరథ పథకం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. కాగితాల్లో మాత్రం 90 శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నా వాస్తవానికి 50 శాతం కూడా పూర్తి కాలేదని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి సమావేశంలో మిషన్ భగీరథ పూర్తి చేయాలని కఠినమైన ఆదేశాలు ఇస్తున్నప్పటికీ అమలు మాత్రం ఆమడదూరంలో ఉంటున్నాయి. మిషన్ భగీరథపై ఉమ్మడి జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికార యంత్రాంగంపై ఏ స్థాయిలో ఫైర్ అవుతున్నా పనుల సాగదీత మాత్రం అలాగే ఉంది.

నిర్మల్ జిల్లాలో మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అధికారులేమో పనులు 90 శాతం పూర్తి చేసినట్లు చెబుతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 710 గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా శుద్ధజలాన్ని పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు మెజారిటీ గ్రామాల్లో పనులు పూర్తికాలేదు. కొత్తగా నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. కేవలం పైప్‌లైన్ మాత్రమే పూర్తి చేసిన అధికారులు వాటి నుంచి ప్రజలకు నీటిని అందించేందుకు నల్లాలను అమర్చాల్సి ఉంది. వేసిన పైప్‌లైన్లకు సైతం లీకేజీ సమస్య పెద్ద ఎత్తున ఉంది. పలుచోట్ల పైప్‌లైన్ లీకేజీ అయ్యి నీరంతా వృథాగా పోతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. పై నుంచి పనులు పూర్తి చేయాలనే ఒత్తిడి నేపథ్యంలో పలుచోట్ల పనులు పూర్తి కానప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకుని కాంట్రాక్టర్లు ఆయా గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు పూర్తిచేసినట్లు గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు తీసుకుని, పనులు పూర్తి చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని సారంగాపూర్ మండలంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. జిల్లాలో మిషన్ భగీరథ పనులపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సైతం అధికారులపై ఓ సందర్భంలో ఆగ్రహం వ్యక్తం చేశారంటే పనుల్లో నిర్లక్ష్యం, జాప్యం జరుగుతుందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. జిల్లావ్యాప్తంగా 710 గ్రామాల్లో మిషన్ భగీరథ ఇంట్రా ద్వారా నీరు అందించాల్సి ఉండగా 543 గ్రామాలకు పనులు పూర్తిచేసి నీటిని అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగతాచోట్ల 80 శాతానికిపైగా పనులు పూర్తిచేసినట్లు చెబుతున్న అధికారులు మార్చి నెలాఖరు వరకు మిగతా పనులను పూర్తిచేసి 100 శాతం గ్రామాలకు నీటిని సరఫరా చేస్తామని చెబుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల పరిధిలో 1,226 ఆవాసాలున్నాయి. ఇందులో మండల కేంద్రాలు తప్ప అన్ని గ్రామల్లో పనులు పూర్తిదశలో ఉన్నాయి. 1,858 కి.మీ. పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయి. 1,50,646 నల్లా కనెక్షన్లకుగాను దాదాపు 1.50 లక్షలు పూర్తయ్యయి. 941 ట్యాంకులకుగాను 600 ట్యాంకుల నిర్మాణం పూర్తయ్యింది. మార్చి 15 నాటికి పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నా పనుల్లో వేగం లేదు.

ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి

కుమ్రం భీమ్(అడ) ప్రాజెక్టు నుంచి ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు మిషన్ భగీరథ కింద మొత్తం 1,819 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ప్రధాన పైప్‌లైన్ నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో ఆసిఫాబాద్ జిల్లాలో 1,101 ఆవాసాలకుగాను 1096 గ్రామాలకు పైప్‌లైన్ వేశారు. మొత్తం ప్రాజెక్టులో 97 శాతం మిషన్ భగీరథ పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. మిగతా 3 శాతం పనులు అటవీ సంబంధిత క్లియరెన్స్‌, రైల్వే‌లైన్ కారణంగా పెండింగ్‌‌లో ఉన్నాయని, త్వరలోనే అది కూడా పూర్తి చేస్తామని చెబుతున్నారు. అయితే, జిల్లాలో ఇంట్రా పైప్‌లైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం 871 ఓవర్ హెడ్ ట్యాంకులకు 740 ట్యాంకుల నిర్మాణం పూర్తికాగా, 340 గ్రామాలకు మాత్రమే ఇంట్రా పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. 400 ట్యాంకుల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.

మంచిర్యాల జిల్లాలో ఇప్పటివరకు 48 వేల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ఇంకా లక్షన్నరకు పైగా నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ జిల్లాలో 60 శాతం పనులు పూర్తయ్యాయి. శ్రీపాద ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుల ద్వారా భగీరథ నీళ్లు ఇచ్చే పనులు సాగుతున్నాయి. అయితే, జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో నిర్మించాల్సిన ట్యాంకులు పూర్తయ్యేందుకు మూడు నుంచి నాలుగు నెలలు పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

మార్చిలోగా పూర్తి చేస్తాం -ఎస్ఈ వెంకటేశ్వర్లు

మార్చిలోగా భగీరథ పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. కొన్ని పనులు నత్తనడకన సాగుతున్న మాట వాస్తవమేనన్నారు. అయితే, అధికార యంత్రాంగాన్ని పనుల పూర్తిచేయడానికి సన్నద్ధం చేస్తున్నామన్నారు.

Tags: Adilabad, Mission Bhagiratha, scheme works, go on slowly

Tags:    

Similar News