అలా చేసిన మంత్రి తలసాని.. పట్టించుకోని డీజీపీ
దిశ, తెలంగాణ బ్యూరో : మాస్కు పెట్టుకోకుంటే వెయ్యి రూపాయల ఫైన్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఇంటి గడప దాటి బైటకు వచ్చిన ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాల్సిందేనని, లేకుంటే స్పాట్ ఫైన్ విధిస్తున్నామని, ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తున్నామని స్వయంగా డీజీపీ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. లక్షలాది మందిపై కేసులు నమోదు చేసి కోట్లాది రూపాయల ఫైన్ లు వసూలు చేశారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో : మాస్కు పెట్టుకోకుంటే వెయ్యి రూపాయల ఫైన్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఇంటి గడప దాటి బైటకు వచ్చిన ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాల్సిందేనని, లేకుంటే స్పాట్ ఫైన్ విధిస్తున్నామని, ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తున్నామని స్వయంగా డీజీపీ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. లక్షలాది మందిపై కేసులు నమోదు చేసి కోట్లాది రూపాయల ఫైన్ లు వసూలు చేశారు. కానీ మంత్రి తలసాని మాత్రం మాస్కు పెట్టుకోకుండా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. పక్కనే ఉన్న డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ఈ విషయాన్ని చూసీ చూడనట్లు ఉండిపోయారు.
చట్టాన్ని తు.చ. తప్పకుండా అమలుచేయాలని, లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేస్తున్నామని చెప్తున్న నగర పోలీసు కమిషనర్… నగరంలోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం అతిథిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాస్కు పెట్టుకోకుండా ఉన్నా చోద్యం చూస్తూ ఉండిపోయారు. స్పాట్ ఫైన్ వసూలు చేయలేదు. కేసు నమోదు చేయలేదు. ప్రజలకు వర్తించే చట్టాలు, లాక్‌డౌన్ నిబంధనలకు మంత్రికి వర్తించవా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. మంత్రికి నిబంధనలు వర్తించవా డీజీపీ గారూ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.