కేంద్రానికి మంత్రి తలసాని రివర్స్ పంచ్ !

దిశ, హైదరాబాద్: కరోనా కట్టడికి ఓ వైపు లాక్‌డౌన్ అమలవుతుండగానే.. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్ళేలా ఆంక్షలను సడలిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడాన్ని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్పుబట్టారు. వలస కార్మికులను తరలించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. రాష్ట్రాలపైన ఆ బాధ్యతను రుద్దడం సహేతుకం కాదన్నారు. వలస కూలీలను ఆయా ప్రాంతాలకు పంపించే బాధ్యత రాష్ట్రాలదే అని ఆ సర్క్యులర్‌లో పేర్కొనడం సరైంది కాదని సూచించారు. బీహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఒడిషా, […]

Update: 2020-04-30 07:52 GMT

దిశ, హైదరాబాద్: కరోనా కట్టడికి ఓ వైపు లాక్‌డౌన్ అమలవుతుండగానే.. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్ళేలా ఆంక్షలను సడలిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడాన్ని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్పుబట్టారు. వలస కార్మికులను తరలించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. రాష్ట్రాలపైన ఆ బాధ్యతను రుద్దడం సహేతుకం కాదన్నారు. వలస కూలీలను ఆయా ప్రాంతాలకు పంపించే బాధ్యత రాష్ట్రాలదే అని ఆ సర్క్యులర్‌లో పేర్కొనడం సరైంది కాదని సూచించారు. బీహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఒడిషా, పశ్చిమబెంగాల్, రాజస్థాన్ లాంటి పలు రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు తెలంగాణలో దాదాపు 15 లక్షల మంది ఉన్నారని, వీరిని ఆయా రాష్ట్రాలకు పంపడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సికింద్రాబాద్ బన్సీలాల్ పేట కమాన్ నుంచి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ వరకు రూ.1.20 కోట్లతో నిర్మిస్తున్న 800 మీటర్ల వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో పై వ్యాఖ్యలు చేశారు.

వలస కార్మికులు ఇక్కడి నుంచి ఆయా రాష్ట్రాలకు బస్సుల్లో వెళ్ళాలంటే కనీసం 3 నుంచి 5 రోజుల సమయం పడుతుందన్నారు. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరాన్ని పాటిస్తూ తరలించాలంటే వందలాది బస్సులు అవసరమవుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసి తరలించే బాధ్యత తీసుకోవాలన్నారు. రైళ్ళ ద్వారా ఆయా రాష్ట్రాలకు చేరుకున్న కార్మికులను.. అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బస్సుల ద్వారా కూలీలను వారి స్వగ్రామాలకు తీసుకెళ్ళే బాధ్యత తీసుకుంటాయన్నారు.

అయితే, తలసాని వ్యాఖ్యల వెనక ఎవరి హస్తం ఉందనే చర్చలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ పెద్దలు చెప్పకుండా తలసాని ఈ కామెంట్లు చేయరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని వలస కార్మికులు వారివారి స్వస్థలాలకు వెళ్తే.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, పరిశ్రమలు ఇబ్బందిపడతాయని, అందువల్ల ఆయా రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి పంపకూడదన్న ఉద్దేశంతోనే తలసానితో ఈ వ్యాఖ్యలు చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Tags : Talasani, Central Govt, Migrant labour, lockdown

Tags:    

Similar News