కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు మంత్రి కేటీఆర్ లేఖ

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ గురువారం లేఖ రాశారు. కేంద్రానికి 2014నుంచి ఐటీఐఆర్‌పై స్పష్టమైన విధానం లేదని, ఇప్పటికైనా ఐటీఐఆర్‌ను పునరుద్ధరించడం లేదా అంతకు మించి మేలైన కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 2008లో కేంద్రం ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుందని, ఇందుకు 2010లో హైదరాబాద్, బెంగళూరు నగరాలను ఎంపిక చేశారన్నారు. 49వేల ఎకరాలతో పాటు మూడు క్లస్టర్లను హైదరాబాద్‌లో […]

Update: 2021-01-07 09:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ గురువారం లేఖ రాశారు. కేంద్రానికి 2014నుంచి ఐటీఐఆర్‌పై స్పష్టమైన విధానం లేదని, ఇప్పటికైనా ఐటీఐఆర్‌ను పునరుద్ధరించడం లేదా అంతకు మించి మేలైన కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 2008లో కేంద్రం ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుందని, ఇందుకు 2010లో హైదరాబాద్, బెంగళూరు నగరాలను ఎంపిక చేశారన్నారు. 49వేల ఎకరాలతో పాటు మూడు క్లస్టర్లను హైదరాబాద్‌లో గుర్తించినట్లు చెప్పారు. తద్వారా అనేక నూతన ఐటీ కంపెనీలను నగరానికి రప్పించేందుకు, పెట్టుబడులకు ప్రోత్సాహకంగా పలు కార్యక్రమాలకు కేంద్రం అంగీకరించిందన్నారు. సుమారు రూ.3,275 కోట్లతో వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, ఇందుకు సంబంధించి రెండు దశల్లో ఈ నిధులను ఖర్చు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు.

ఇందులో భాగంగా మొదటి దశ కార్యక్రమానికి రూ.165 కోట్లతో 2018నాటికి పూర్తి చేయాల్సి ఉందని, మిగిలిన రెండోదశకు వివిధ దశలుగా 20సంవత్సరాల్లో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. ఐతే ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభం కాలేదన్నారు. 2014లో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీఐఆర్ ప్రాజెక్టు నమూనాని సమీక్షించి, మరింత మేలైన పథకాన్ని తీసుకొస్తామన్నారు. 2017లో ఇందుకు సంబంధించి ఐటీఐఆర్ భాగస్వాములతో విస్తృత స్థాయి చర్చలు జరిపినా, ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన కేంద్రం నుంచి రాలేదని మంత్రి కేటీఆర్ రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాయడంతో పాటు విజ్ఞప్తులు కూడా అందించారని, గత ఆరేళ్లలో కేంద్రం నుంచి ఇంత కీలకమైన కార్యక్రమంపై ఎలాంటి స్పందన లేదన్నారు. కేంద్రం చెబుతున్న మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల స్ఫూర్తితో ఐటీఐఆర్ ప్రారంభిస్తే బాగుంటుందని, రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని లేఖలో వివరించారు.

Tags:    

Similar News