Kavitha: బట్టలు విప్పి మరి దళితులను అరెస్టు చేస్తారా? కామారెడ్డి ఘటనపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో దళితుల అరెస్టు ఘటనపై కవిత సీరియస్ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో అమలవుతున్నది అంబేద్కర్ రాజ్యాంగమా? లేక అనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాజ్యాంగమా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ప్రశ్నించారు. కామారెడ్డి (Kamareddy) జిల్లా లింగంపేట మండలంలో (Lingampeta mandal) అంబేద్కర్ జయంతి (Ambedkar Jayanthi) సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో దళితులపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందిచిన కవిత.. అంబేద్కర్ జయంతి రోజున దళితులపై ఇంతటి కర్కశత్వమా అని నిలదీశారు. దళితుల బట్టలు విప్పి అరెస్టు చేసేంత ధైర్యం పోలీసులకు ఎవరిచ్చారు? ఎవరి అండదండలు చూసుకొని పోలీసులు విర్రవీగుతున్నారని ఫైర్ అయ్యారు. దళితులను అవమానించడమే ప్రజా పాలనా అని ప్రశ్నించారు. బట్టలు విప్పి మరి దళితులను అరెస్టు చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని బాధ్యులైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఇది శాంతిభద్రతల సమస్య కాదని కేవలం లక్ష్యంగా చేసుకున్న అణచివేత అన్నారు.