40 శాతం సబ్సిడీ.. సోలార్ విద్యుత్‌పై మంత్రి జగదీష్ రెడ్డి కీలక ప్రకటన

దిశ, తెలంగాణ బ్యూరో: రూఫ్ టాప్ సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు గృహవినియోగదారులకు 40 శాతం సబ్సిడీ అందిస్తామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన ఏడోరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రూఫ్ టాప్ సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు ఎలాంటి ప్రణాళికలు చేశారోనన్న కొప్పుల మహేశ్వర్ రెడ్డి ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. 2023 నాటికి ఎన్టీపీసీ ద్వారా 2092 మెగావాట్లు ఉత్పత్తి చేసి ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నామని, దీనికి సంబంధించిన ఒప్పందం […]

Update: 2021-10-08 07:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రూఫ్ టాప్ సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు గృహవినియోగదారులకు 40 శాతం సబ్సిడీ అందిస్తామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన ఏడోరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రూఫ్ టాప్ సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు ఎలాంటి ప్రణాళికలు చేశారోనన్న కొప్పుల మహేశ్వర్ రెడ్డి ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. 2023 నాటికి ఎన్టీపీసీ ద్వారా 2092 మెగావాట్లు ఉత్పత్తి చేసి ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నామని, దీనికి సంబంధించిన ఒప్పందం కూడా పూర్తయిందన్నారు. ఇక రూఫ్ టాప్ ద్వారా 2061 మెగావాట్లు ఉత్పత్తి చేయాలని ప్రణాళిక పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

గృహ వినియోగదారులకు 3 కిలోవాట్లలోపు వినియోగించుకున్నవారికి 40 శాతం సబ్సిడీగా అందించి ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 3 నుంచి 10 కిలోవాట్లు వినియోగించుకునేవారికి 20 శాతం సబ్సిడీ అందిస్తామన్నారు. రూఫ్ టాప్ సోలార్ విద్యుత్‌ను 1 కిలోవాట్ నుంచి 1 మెగావాట్ వరకు పెట్టుకునే అవకాశం ఉందన్నారు. 10 కిలోవాట్లకు పైగా విద్యుత్ వినియోగించేవారికి ఎలాంటి సబ్సిడీ ఉండదన్నారు. వినియోగదారులకు అవసరమున్నంత లోడ్ వరకు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రూఫ్ టాప్ సోలార్‌ను ప్రోత్సహించాలని నిర్ణయించామని, అలాగే హాస్టళ్లు, గురుకులాల్లో రూఫ్ టాస్ సోలార్ ఏర్పాటు చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. రూఫ్ టాప్ ద్వారా గ్రిడ్ కు సౌర విద్యుత్ ను పంపిణీ చేస్తూ సదరు వినియోగదారుడు ఏ కారణం చేతనైనా విద్యుత్ ను వినియోగించుకోని పక్షంలో ఆరు నెలలకు ఒక మారు లెక్క కట్టి ఒప్పందం ప్రకారం చెల్లింపులు చేస్తామన్నారు.

పవన విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణలో సానుకూల వాతావరణం లేదని మంత్రి తెలిపారు. అనుకోకుండా ఒక్కసారే గాలి ఎక్కువగా వచ్చినా, ఒకేసారి తగ్గిపోయినా గ్రిడ్ దెబ్బతినే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పవన విద్యుత్‌ను అనుసరిస్తున్న రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకే సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నాటికి 3913 మెగావాట్ల సౌర విద్యుత్, 128 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు చెప్పారు.

2022-23 నాటికి 6,246 మెగావాట్ల సౌర విద్యుత్ఉ త్పత్తి చేయాలని ప్రణాళికలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. టీఎస్ఈఆర్ సీ నోటిఫై చేసిన విధంగా సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పురపాలక ఘన వ్యర్థాల ఆధారిత విద్యుత్ శక్తి ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. సంప్రదాయేతర ఇంధన వనరులను కాపాడేందుకు వినియోగదారులకు అవగహన కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మంజూరైన పురపాలక ఇంధన వ్యర్థ ప్రాజెక్టుల ద్వారా 76 మెగావాట్లు, ప్రారంభించిన ప్రాజెక్టుల ద్వారా 38.4 మెగావాట్లు ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు.

Tags:    

Similar News