ఈటలకేమైంది?.. సక్కగున్నడా?
మంత్రి ఈటల రాజేందర్ పరస్పర వైరుధ్యమున్న మాటలు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారారు. జమ్మికుంటలో అందరూ మనోళ్లే.. నావి విశాల భావాలు అన్న ఈటల హుజురాబాద్ లో మనవాళ్లను మనసులో పెట్టుకోవాలే అంటూ సంకుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన వ్యవహారశైలిపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఫిబ్రవరి 1న మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత జమ్మికుంటలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల వరకే ఓట్ల రాజకీయాలైనా, […]
మంత్రి ఈటల రాజేందర్ పరస్పర వైరుధ్యమున్న మాటలు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారారు. జమ్మికుంటలో అందరూ మనోళ్లే.. నావి విశాల భావాలు అన్న ఈటల హుజురాబాద్ లో మనవాళ్లను మనసులో పెట్టుకోవాలే అంటూ సంకుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన వ్యవహారశైలిపై అనుమానాలు రేకెత్తిస్తోంది.
ఫిబ్రవరి 1న మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత జమ్మికుంటలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల వరకే ఓట్ల రాజకీయాలైనా, వైషమ్యాలైనా.. ఆ తరువాత ప్రతి ఒక్కరిని మనవారిలా భావించాలి.. నాకు ఓటెయ్యలేదు, ఇంటికి వెలితే కుర్చోబెట్టలేదు చాయ్ ఇయ్యలేదు అంటూ సంకుచిత భావంతో వ్యవహరించకూడదు. సారేంటి.. తిట్టినోడికే పనులు చేస్తున్నాడు అంటూ విమర్శిస్తారు.. అది అలా అన్నవారి విజ్ఞతకే వదిలిపెడుతున్నాను.. అది నా సంస్కారం. తిట్టేవాళ్లను తిట్టి, కొట్టి, మోసం చేసేవాడ్ని అలాగే చూసే సంస్కారం తనది కాదని స్పష్టం చేశారు. దీంతో కరీంనగర్ లో ఆయన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. ఈటల గ్రేట్ అంటూ లోలోపల అభినందించారు.
ఇది జరిగిన నాలుగు రోజులకే ఆయన మాట మార్చారు. ఫిబ్రవరి 4న హుజూరాబాద్ పాలకవర్గ బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేనో విజ్ఞప్తి చేస్తున్నా.. ధర్మాన్ని మాత్రం తప్పకండి. న్యాయమేదో, అన్యాయమేదో, మనవాడెవడో, కానివాడెవడో తప్పకుండా గుర్తుంచుకోవాలి. మనవారిని మనం ఆదరించాలి. మనవాళ్లకు మనం సాయం చెయ్యాలి. మనల్ని ఆదుకునే వాళ్లను, మన వెంట ఉండేవారిని కాపాడుకోవాలి. అంతేకానీ ఏదో ఊరికే వచ్చి కాళ్లమీదపడి మొక్కగానే వాడు మనవాడనుకోకూడదు. అలా చేస్తే ఆగమైపోతాం అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఈటల వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
జమ్మికుంట సభలో అందరినీ మనవాళ్లన్న ఈటల హుజురాబాద్ సభలో మనవాళ్లకు మాత్రమే అంటూ విభజించడం.. ఆయన వ్యాఖ్యల్లో బ్యాలెన్స్ తప్పుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రెండో సారి కేబినెట్ లో అవకాశం ఉండదని ఊహానాలు వెల్లువెత్తగానే ఓ సభలో గులాబీ జెండా ఓనర్లమంటూ ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలోనే ఆయనకు మంత్రి పదవి దక్కినట్టు జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వివాదాలకు దూరంగా ఉంటారన్న పేరున్న ఈటల ఈ మధ్య కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న విధానం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చను లేవనెత్తుతోంది. ఆయన పలు సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలు అధిష్టానాన్ని హెచ్చరించేలా ఉండడం పార్టీ వర్గాల్లో ఆందోళన రేపుతోంది.