మిల్లర్ల ‘మాయా’జాలం.. మత్తులో నేతలు
దిశ ప్రతినిధి, వరంగల్ : కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని ఢంకా బజాయించి చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో జరుగుతున్న అక్రమాలను మాత్రం పట్టించుకోవడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో యధేచ్చగా, అధికారికంగా దోపిడీ జరుగుతున్నా నేతలు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే తంతు నడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు.. కళ్లు, చెవులు అన్ని మూసేసుకుని రైతులను అతిదారుణంగా ముంచేస్తున్నారు. మిల్లర్లలో […]
దిశ ప్రతినిధి, వరంగల్ : కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని ఢంకా బజాయించి చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో జరుగుతున్న అక్రమాలను మాత్రం పట్టించుకోవడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో యధేచ్చగా, అధికారికంగా దోపిడీ జరుగుతున్నా నేతలు పట్టించుకోవడం లేదు.
ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే తంతు నడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు.. కళ్లు, చెవులు అన్ని మూసేసుకుని రైతులను అతిదారుణంగా ముంచేస్తున్నారు. మిల్లర్లలో అత్యధికులు అధికార పార్టీకి ఫండింగ్ నేతల కావడంతోనే క్షేత్రస్థాయిలో నేతలు కిమ్మని ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర దక్కుతుందని ఆశపడి వస్తున్న ధాన్యం రైతులు దగా పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహాకులు, మిల్లర్ల లీలలతో నిండా మునుగుతున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహాకులు, మిల్లర్లు కుమ్మక్కై తరుగు పేరిట క్వింటాల్‌కు 5 నుంచి 7 క్వింటాళ్ల ధాన్యం లెక్కల్లోకి ఎక్కించడం లేదు. సగటున ఒక క్వింటాల్ ధాన్యానికి ఏడున్నర కిలోల చొప్పున తరుగు తీసి రైతులకు నష్టం కలిగిస్తున్నారు. రైతుకు దక్కాల్సిన లాభం, కష్టార్జితం మిల్లర్లు జేబులో వేసుకుంటున్నారు.
ఇవీ మార్గదర్శకాలు..
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సివిల్ సప్లై శాఖ క్లియర్ గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. ధాన్యం సేకరణకు సంబంధించి కొన్ని నాణ్యతా ప్రమాణాలను స్పష్టంగా పేర్కొంది. ధాన్యం తేమ శాతం గరిష్టంగా 17కి మించకూడదని, చెత్త తాలూకు 1 శాతం, మట్టిపెళ్లలు, రాళ్లు ఉంటే 1 శాతం, చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగు తిన్న ధాన్యం ఉంటే 5 శాతం, పూర్తిగా తయారుకాని ముడుచుకుపోయిన ధాన్యానికి 3 శాతం వరకు మినహాయింపులు ఇచ్చింది. వీటికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తరుగు తీయాల్సి ఉంటుంది. అయితే వాస్తవంలో మాత్రం కొనుగోలుదారులు, మిల్లర్లు.. సివిల్ సప్లై శాఖ పేర్కొన్న తరుగుకు అదనంగా బస్తాకు 5 కిలోల నుంచి 7 కిలోల వరకు తరుగు కడుతుండటం గమనార్హం. ఒక్కో బస్తాలో 40.400 కిలోలకు మించి తూకం వేయవద్దు. కానీ కొనుగోలు కేంద్రాల్లో 43.400 అంటే ఒక్కో బస్తాకు 3 కిలోల అదనపు ధాన్యం తూకం వేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఒక్కో క్వింటాకు వచ్చే సరికి రైతు 7 కిలోలు దోపిడీకి గురవుతున్నాడు.
అధికార పార్టీకి కోతల్లేవ్..!
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మడానికి వచ్చిన అమాయక రైతులను ముంచేస్తున్న కొనుగోలు కేంద్రాల నిర్వహాకులు, మిల్లర్లు అదే గ్రామాల్లోని అధికార పార్టీకి చెందిన బడా లీడర్లు, ప్రజాప్రతినిధుల ధాన్యానికి మాత్రం ఎలాంటి పరిశీలనులు, కోతలు లేకుండానే ఏ-గ్రేడ్ ధర చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితి దాదాపు అన్ని కొనుగోలు కేంద్రాల్లోనూ జరుగుతుండటం గమనార్హం.
బస్తాకు రెండున్నర కిలోలు తీశారు
ఉమ్మనవేన రాజేష్.. ఏలేటి రామయ్య పల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
కోత అనంతరం వరి ధాన్యాన్ని చిట్యాల కొనుగోలు కేంద్రానికి తరలించాను. అక్కడ ఆరబోసి ప్యాడీ క్లీనర్లో పట్టాను. 50 బస్తాల ధాన్యమైంది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తూకం వేస్తుండగా ఒక బస్తాకు రెండున్నర కిలోల తరుగును తీశారు. ఇదేంటని ప్రశ్నిస్తే నీ ధాన్యంలో తేమ శాతం, తాలు ఎక్కువగా ఉందని చెప్పారు. సార్ మీ ముందే కదా అంత శుభ్రం చేసి ఇస్తున్నది అన్నా పట్టించుకోలేదు. నచ్చితే అమ్ముకో లేకుంటే వెనక్కి తీసుకుపోమ్మని చెప్పడంతో.. దిక్కులేక అమ్ముకోవాల్సి వచ్చింది. కొనుగోలు కేంద్రానికి వస్తే మద్దతు ధర దక్కి న్యాయం జరుగుతుందనుకుంటే అన్యాయమే జరిగింది.
20 రోజుల నుంచి పడిగాపులు..
బాణోత్ లక్ష్మణ్.. బీచ్యనాయక్ తండా, మహబూబాబాద్ జిల్లా
కేసముద్రం మండలంలోని ధన్నసరి క్రాస్ రోడ్డు వద్ద దన్నసరి సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. నేను 70 బస్తాల వండ్లు తీసుకుని 20 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి వచ్చాను. బస్తాలు ఇచ్చారు. లారీలు రాకపోవడంతో ఇక్కడే పడిగాపులు పడుతున్నాం. ధాన్యం బస్తాలకు మొలకలు వచ్చాయి. అధికారులు స్పందించి లారీల కొరత లేకుండా చూడాలి.
ప్రభుత్వం చెప్పేదొకటి.. అక్కడ జరిగేదొకటి..
చెన్నూర్ సోమ నర్సయ్య, తీగారం.
రైతు ప్రభుత్వమని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. కానీ కొనుగోలు కేంద్రాల్లో మాత్రం దోపిడీ జరుగుతోంది. అయినా నేతలు గానీ.. ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టినోళ్లు బాగుపడరు. తరుగు పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రభుత్వం ఇకనైనా అడ్డుకోవాలి.
8 క్వింటాళ్ల తరుగు..
వి.ప్రవీణ్.. సబ్ స్టేషన్ తండా, కేసముద్రం మండలం
మాది కేసముద్రం మండలం సబ్ స్టేషన్ తండా గ్రామం. 3 ఎకరాల్లో సన్నా రకం ధాన్యం సాగు చేశాను. నాకు 200 బస్తాల సన్న ధాన్యం పంట దిగుబడి వచ్చింది. 40 కేజీల బస్తాలకు 4 కేజీల తరుగు తిస్తున్నారు. సుమారు 8 క్వింటాళ్లు తరుగు పేరిట తీశారు. సుమారు 15 వేల రూపాయల నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులను దోపిడీ చేస్తున్నారు. రైతుల పక్షాన మాట్లాడే వారు లేరు.