మొబైల్ చోడో.. మైదాన్ మే ఖేలో!
దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు సాయంత్రం బడి గంట మోగగానే పిల్లలంతా వీధుల్లో చేరిపోయి అరమరికలు లేకుండా అంతా కలిసి ఆడుకునేవారు. సంధ్యవేళల్లో అరుగులపై చేరి కథలు చెప్పుకుంటూ హోంవర్కులు చేసుకునేవారు. ఇలాంటి ఎన్నో మధుర జ్ఞాపకాల్ని పంచిన అలనాటి ఆటల్లోని గొప్పతనం నేటి తరానికి తెలియడం లేదు. నాడు ఆటపాటల్లో మునిగితేలిన బాల్యం.. నేడు స్మార్ట్ తెరల్లో బందీ అయిపోతోంది. ఫిజికల్ ఫిట్‌నెస్‌ను పెంచి, ఆరోగ్యాన్ని పంచిన అప్పటి ఆటలు ప్రజెంట్ జనరేషన్‌కు అందించకపోవడం వల్లే […]
దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు సాయంత్రం బడి గంట మోగగానే పిల్లలంతా వీధుల్లో చేరిపోయి అరమరికలు లేకుండా అంతా కలిసి ఆడుకునేవారు. సంధ్యవేళల్లో అరుగులపై చేరి కథలు చెప్పుకుంటూ హోంవర్కులు చేసుకునేవారు. ఇలాంటి ఎన్నో మధుర జ్ఞాపకాల్ని పంచిన అలనాటి ఆటల్లోని గొప్పతనం నేటి తరానికి తెలియడం లేదు. నాడు ఆటపాటల్లో మునిగితేలిన బాల్యం.. నేడు స్మార్ట్ తెరల్లో బందీ అయిపోతోంది. ఫిజికల్ ఫిట్‌నెస్‌ను పెంచి, ఆరోగ్యాన్ని పంచిన అప్పటి ఆటలు ప్రజెంట్ జనరేషన్‌కు అందించకపోవడం వల్లే సెల్‌ఫోన్‌కు అడిక్ట్ అవుతున్నారన్నది నిర్వివాద అంశం. ఇప్పుడు పల్లె నుంచి పట్నం దాకా ఏ మైదానంలోకి తొంగి చూసినా.. క్రికెట్ తప్ప మరో గేమ్ ఆడేవాళ్లు కనిపిస్తే ఒట్టు. ఈ నేపథ్యంలో సంప్రదాయ ఆటలకు జీవం పోసేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ యూనివర్సిటీ శ్రీకారం చుట్టింది. మరి ఆ ఆటల విశేషాలేంటో చూద్దాం..
నేటి తరం పిల్లలకు.. ఇల్లు, పాఠశాలే లోకం కాగా, సెల్‌ఫోన్ మరో ప్రపంచంగా మారింది. అందుకే వారిని పలకరిస్తే పబ్‌జీ గేమ్‌లో తిరుగులేదని, లూడో ఆటలో కింగ్ అని లేదా టెంపుల్ రన్ టాపర్ తానేనని సంబర పడిపోతారు. పిల్లలంతా కలిసి కలివిడిగా ఉండాల్సిన బాల్యం ఒంటరిగా, ఏకాంతంగా బుల్లితెరల్లోనో, స్మార్ట్ దునియాలోనో ఉండిపోతోంది. అందుకోసమే మీరట్(ఉత్తర్‌ప్రదేశ్)లోని చౌదరీ చరణ్ సింగ్ యూనివర్సిటీ(సీసీఎస్‌యూ)లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులో రెగ్యులర్‌గా నేర్పించే వాలీబాల్, రెజ్లింగ్, స్వి్మింగ్, క్రికెట్, బాస్కెట్‌బాల్‌తో పాటు, కర్రాబిళ్ల, గోలీలాట, తొక్కుడు బిళ్ల ఆటలను కూడా చేర్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ- 2020లో భాగంగానే ‘ది ట్రెడిషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఈ ఆటలను ప్రవేశపెడుతున్నారని యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ విధంగానైనా మన సంప్రదాయ ఆటలకు ఓ గుర్తింపు లభిస్తుందని వర్సిటీ ప్రొఫెసర్ కేకే పాండే ఆశాభావం వ్యక్తం చేశారు.
సంప్రదాయ ఆటలు :
కర్రాబిళ్ల / గిల్లి దండ
క్రికెట్ ఆటను పోలీనట్టు్ండే ఆటే కర్రా బిళ్ల. కొన్ని ప్రాంతాల్లో సిర్ర గోనె, గూటి బిళ్ల, బిళ్లం గోడు అంటారు. బ్యాట్‌తో బాల్‌ను కొట్టినట్లు, ఈ ఆటలో కర్రతో బిళ్లను కొడతారు. అయితే ఈ ఆట కోసం మొదట పొడవుగా ఓ గుంతను తవ్వుతారు. అందులో బిళ్లను ఉంచి కర్రతో దాన్ని చిమ్ముతారు. ఆ సమయంలో గాల్లోకి చిమ్మిన బిళ్లని క్యాచ్ పడితే ఆ చిమ్మిన వ్యక్తి అవుట్. క్యాచ్ పట్టకపోతే అది పడ్డ చోటు నుంచి ఆ గుంత వైపు దాన్ని విసురుతారు. ఆ గుంత చేరువలో పడితే చిమ్మిన వ్యక్తి అవుట్. అలా కాకుండా ఉండేందుకు అతను కర్రతో దాన్ని అడ్డుకుంటాడు. అవుట్ కాకుంటే ఆ వ్యక్తి దాన్ని కర్రతో దూరంగా కొడతాడు. ఆ దూరాన్ని కర్ర, బిళ్ల, కాంట, సూది, బియ్యపు గింజలతో అవతలి వ్యక్తి కొలవాలి. గుంత నుంచి ఎవరిది ఎక్కువ దూరం పడితే వాళ్ళు గెలిచినట్టు.
గోలీలాట :
గోలీలతో నాలుగైదు ఆటలు ఆడొచ్చు. కొన్నిచోట్ల గోలీలను వృత్తంలో పెట్టి దూరం నుంచి కొడతారు. మరికొన్ని చోట్ల జానా, బెత్తలు ఆడతారు. ఆటలో పద్ధతులు ఎన్ని ఉన్నా గోలీల ఆటకు మాత్రం గ్రామాల్లో విశేష ప్రాధాన్యం ఉంది. పల్లెల్లోనే కాదు విదేశాల్లోనూ గోలీలాటకు భలే క్రేజ్ ఉంది. వరల్డ్ మార్బుల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వివిధ దేశాల్లో మార్బుల గేమ్ కూడా నిర్వహిస్తారు. ఇంత విశేష ఆదరణ ఉన్న ఈ ఆట నేటి చిన్నారులకు దూరమౌతోంది.
కోతి కొమ్మచ్చి
ఈ ఆటలో ముందుగా చప్పట్లు వేసి ఒకరిని దొంగగా ఎన్నుకుంటారు. ఒక చెట్టు కింద వృత్తం గీస్తారు. మిగతా వారంతా చెట్లు ఎక్కి కూర్చుంటారు. కానీ ఎవరో ఒకరు ఒక కర్రను వృత్తాకారంలో నిల్చుని అక్కడి నుంచి విసురుతారు. అలా విసిరిన కర్రను దొంగ తీసుకొచ్చి వృత్తా్కారంలో ఉంచేలోపు ఆ విసిరిన వ్యక్తి చెట్టు ఎక్కేస్తాడు. దొంగ చెట్టు పైనున్న వారిలో ఎవరో ఒకరిని తాకడానికి ప్రయత్నిస్తాడు. వారు అతనికి దొరకకుండా చెట్లెక్కి దాగి ఉంటారు. దొంగ వారిలో ఎవరిని తాకుతాడో ఆ వ్యక్తే దొంగ అవుతాడు. ఒక వేళ దొంగ ఒకరిని తాకే ప్రయత్నంలో ఉండగా ఎవరో ఒకరు చెట్టు పైనుంచి దూకి వృత్తాకారంలో ఉన్న కర్రను తొక్కినట్లయితే మరలా అతనే దొంగగా ఉంటాడు.
తొక్కుడు బిళ్ల
తొక్కుడు బిళ్ళను ఎవరికి వారుగా, ఇద్దరు చొప్పన ఒక జట్టుగా ఆడతారు. ఈ ఆటను ఎక్కువగా ఆడపిల్లలే ఆడతారు. చెరోవైపు ఐదేసి గడులుంటాయి. ఆటకు మార్బుల్స్, లేదా రాతి బిళ్లలు ఉపయోగిస్తారు. రాతి బిళ్ళను మొదటి గడిలో వేసి ఆటను ప్రారంభిస్తారు. గడి దాటుకుని మిగిలిన గడులలో ఒంటికాలిపై కుంటుకుంటూ వెళతారు. మొత్తం గడులను పూర్తిచేసిన తరువాత బిళ్ళను చేతులపైనా, తలపైనా, కాళ్ళపైనా, నుదుటిపైనా పెట్టుకుని గడులలో ఒంటికాలిపై కుంటుకుంటూ దాటుతారు. ఇవన్నీ దిగ్విజయంగా పూర్తిచేసిన వాళ్లు ఈ ఆటలో విజేతలుగా నిలుస్తారు.
ఇంకా ఇవే కాక దాగుడు మూతలు, దొంగ పోలీస్, బోంగరాలాట, వీరి వీరి గుమ్మడిపండు, లగోరి (ఏడు పెంకులాట, లికోచ్, పల్లీలాట), గుజ్జన గూళ్లు, వామన గుంటలు, ఒప్పుల కుప్ప, బొమ్మల పెళ్లి ఇలా ఎన్నో ఆటలు కాలగర్భంలో కలిసిపోయాయి. తెలుగుదనపు మట్టి పరిమళాలను అందించిన అలనాటి సరదా ఆటలన్నీ కాలక్రమేణ అంతరించిపోతున్నాయి.
మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టపడి ఆడుకున్న ఆటలు ప్రస్తుతం ఉనికిని కోల్పోయాయి. తిరిగి వాటిని సమాజంలోకి తీసుకురావలన్నదే మా ప్రయత్నం. ఈ కొత్త కోర్సు నేర్చుకునే ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్లు భవిష్యత్తులో పాఠశాలల్లో పీఈటీలుగా చేరినప్పుడు పిల్లలతో ఈ ఆటలను ఆడించే అవకాశం ఉంటుంది. ఈ ఆటలు కేవలం వినోదాన్నే కాదు.. శారీరక దృఢత్వాన్ని ఇస్తాయి. విద్యార్థుల్లో ఏకగ్రతను పెంచుతాయి. ఈ ఆటలు పిల్లల కండరాలను బలోపేతం చేయడమే కాకుండా, ఏకాగ్రత పెంచడానికి సహాయపడుతుంది. పిల్లలను స్క్వాట్స్(మోకాళ్ళపై వంగి, మడమలతో దగ్గరగా కూర్చోనే పొజిషన్) చేసేటప్పుడు గోలీలు(మార్బుల్స్) కూడా దృష్టిని పెంచుతాయి. సీసీఎస్‌యూలో ఈ ఆటల పరిచయంతో అవి మళ్లీ జీవం పోసుకుంటాయి. ప్రాక్టికల్‌గా పిల్లల్లోనూ మానసిక, శారీరక బలాన్ని పెంచుతాయని ఆశిస్తున్నాను.- కేకే పాండే, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్.
గెలుపోటములు సాధారణం..
ఈతరం చిన్నారులంతా మైదానం వైపు చూడటం లేదు. ఆటలతో కాలక్షేపం చేయడం లేదు. అరుగులపై కాదు, కనీసం ఇళ్లు దాటి కూడా బయటకు రావడం లేదు. ఈ గేమ్స్ శారీరక ఉల్లాసంతో పాటు, కలిసికట్టుగా ఉండటం వల్ల కలిగే లాభాన్ని నేర్పిస్తాయి. గెలుపు, ఓటములు సాధారణమనే పాఠాన్ని బోధిస్తాయి. మానసికంగానూ మనిషిని బలవంతుడిని చేస్తాయి.. స్మార్ట్ తెరల చాటు నుంచి బాల్యాన్ని మైదానం వైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తే.. పిల్లల్లో ఎంతో మార్పు వస్తుంది. ఒంటరితనం దరిచేరదు. అందరితో ఇట్టే కలిసిపోతారు. ఓడిపోయినా దాన్ని తేలికగా తీసుకుంటారు. – పి. రాజేష్, ఉపాధ్యాయుడు, జగిత్యాల
క్రికెట్ ఎక్కువగా ఆడతా..
నాకు గోళీలాట, గిల్లి దండ ఆటలు మాత్రమే తెలుసు. అవి కూడా నేను చిన్నప్పుడు ఊరిలో ఉండగా ఆడినవి. ఆ తర్వాత నా చదువుంతా హస్టల్‌లోనే సాగింది. పై చదువులకు హైదరాబాద్ వెళ్లాను. ఇప్పుడు ఎక్కువగా క్రికెట్ ఆడతాను. వీడియోగేమ్స్, మొబైల్ గేమ్స్ ఆడటాన్ని ఇష్టపడతాను
– జి. అరుణ్, డిగ్రీ విద్యార్థి, కథలాపూర్
గోళీలాట కూడా తెలియదు..
నా చిన్నప్పుడు తొక్కుడు బిళ్ల ఆడలేదు. గోళీలాట కూడా తెలియదు. కానీ అష్టాచెమ్మ, పచ్చీస్ ఇష్టంగా ఆడతాను. మా ఇంట్లో బాబాయిలు, అమ్మమ్మ, తాతయ్యలు అందరూ ఇప్పటికీ ఆ ఆటలు ఆడతారు. అందుకే సెలవుల్లో ఇంటికి వచ్చినపుడు అవే ఆటలు ఆడతాను. ఓడిపోయిన వాళ్లు గెలిచిన జట్టుకు బిర్యానీ తినిపించాలనో, ఐస్‌క్రీం కొనిపెట్టాలనో పందెం కూడా కాస్తుంటాం. – అక్షిత, బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్, కోరుట్ల