ఎన్‌కౌంటర్ వీడియోలు విడుదల చేసిన మావోలు
దిశ, కరీంనగర్: దండకారణ్య అటవీ ప్రాంతంలో క్రాంతీ కారీ జనతన్ సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వం నడుపుతున్న మావోయిస్టులు తమ యుద్ధం గురించి ఇప్పటివరకూ ప్రకటనలు మాత్రమే చేసేవారు. ఇప్పుడు లైవ్ వీడియోలు తీసి ఎడిట్ చేసి మీడియాకు పంపించే ప్రక్రియ ప్రారంభించారు. దండకారణ్యంలోని సుక్మా జిల్లా మినాపా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పీపుల్స్ లిబరేషేన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) బలగాలపై దాడులకు పాల్పడిన ప్రత్యక్ష్య వీడియోను విడుదల చేశారు. అయితే ఈ వీడియో […]
దిశ, కరీంనగర్: దండకారణ్య అటవీ ప్రాంతంలో క్రాంతీ కారీ జనతన్ సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వం నడుపుతున్న మావోయిస్టులు తమ యుద్ధం గురించి ఇప్పటివరకూ ప్రకటనలు మాత్రమే చేసేవారు. ఇప్పుడు లైవ్ వీడియోలు తీసి ఎడిట్ చేసి మీడియాకు పంపించే ప్రక్రియ ప్రారంభించారు. దండకారణ్యంలోని సుక్మా జిల్లా మినాపా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పీపుల్స్ లిబరేషేన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) బలగాలపై దాడులకు పాల్పడిన ప్రత్యక్ష్య వీడియోను విడుదల చేశారు. అయితే ఈ వీడియో మొత్తం కూడా ఎడిట్ చేసి ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్‌ను మరిపించారు. వాయిస్ ఓవర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో కలిపి 12 నిమిషాలకు పైగా నిడివిగల వీడియోను మావోయిస్టులు విడుదల చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో జనతన్ సర్కార్‌లో సాయుధ మావోయిస్టులు సంచరించే వీడియోలతో పాటు… వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను కూడా జత చేసి ఎడిట్ చేశారు. అభుజామడ్ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మావోయిస్టులు తమ సైన్యం గొప్పతనాన్ని కూడా వివరించారు.
మే 21 నాటి ఘటనలో సఫలం
మే 21న సుక్మా జిల్లా మినాపా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 17 మంది బలగాలను మట్టుబెట్టి పీఎల్జీఏ సక్సెస్ అయిందని చెప్పుకొచ్చారు. 14 వరకు ఆయుధాలు, వాకీ టాకీలు, తూటాలు స్వాధీనం చేసుకున్నామని వాటిని ప్రదర్శించారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలు నివసించే ప్రాంతాలపై బలగాలను మోహరించాయిని ఆరోపించారు. బలగాలకు ధీటుగానే మావోయిస్టు పార్టీ తీర్చిదిద్దుతున్న మిలటరీని బలోపేతం చేశామని ప్రకటించారు. ఎన్‌కౌంటర్ తరువాత క్రాంతీకారీ జనతన్ సర్కార్‌లో శత్రువును దెబ్బతీశామని సంబురాలు కూడా నిర్వహించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ ప్రహార్‌లో భాగంగా ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి మావో సర్కార్ అన్నింటా సిద్ధం అయిందని ప్రకటించారు. తెలంగాణ గ్రే హౌండ్స్ బలగాలతో కలిసి దండకారణ్య అటవీ ప్రాంతంలోని ఆదివాసీలపై దాడులకు పాల్పడుతున్నారని వీటన్నింటిని తిప్పి కొట్టేందుకు మావో బెటాలియన్స్ శక్తివంతం అయ్యాయని కూడా వివరించారు. మినాపా ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీకి చెందిన సుక్రు, రాజేశ్, సుక్కు అనే ముగ్గురు మావోయిస్టులు కూడా చనిపోయారని తెలిపారు. వీరికి నివాళులు కూడా అర్పించారు.