ధరణిలో ఎన్నో సమస్యలు.. పరిష్కారమెప్పుడు?
భూముల క్రయవిక్రయాలు సజావుగా సాగేందుకు పారదర్శక విధానమంటూ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ అనేక చిక్కులు తెచ్చిపెడుతున్నది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన ఓ రైతు భూమి బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి అనే ప్రాజెక్టుకు ఇచ్చేసినట్టుగా ఉన్నది. ఆ సర్వే నంబర్ లో 60 ఎకరాల భూమి ఉండగా.. వాస్తవానికి సేకరించింది 10 ఎకరాలు మాత్రమే. అధికారులు వివరాలేవీ పరిశీలించకుండా ధరణి పోర్టల్ సర్వే నంబర్ మొత్తాన్ని ప్రాజెక్టు కోసం […]
భూముల క్రయవిక్రయాలు సజావుగా సాగేందుకు పారదర్శక విధానమంటూ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ అనేక చిక్కులు తెచ్చిపెడుతున్నది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన ఓ రైతు భూమి బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి అనే ప్రాజెక్టుకు ఇచ్చేసినట్టుగా ఉన్నది. ఆ సర్వే నంబర్ లో 60 ఎకరాల భూమి ఉండగా.. వాస్తవానికి సేకరించింది 10 ఎకరాలు మాత్రమే. అధికారులు వివరాలేవీ పరిశీలించకుండా ధరణి పోర్టల్ సర్వే నంబర్ మొత్తాన్ని ప్రాజెక్టు కోసం సేకరించినట్టు, పరిహారం కూడా చెల్లించినట్టు రికార్డు చేశారు. మిగతా యాభై ఎకరాల రైతులు లబోదిబోమంటున్నారు. భూమిని అమ్మి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లగా ఈ విషయం బయటపడింది. ఆ భూమిని కొనుగోలు చేసిన వాళ్లు.. అమ్మిన వాళ్లు డిసెంబర్ లో సీఎస్ దరఖాస్తు చేసుకున్నారు. ఫైలు ఇంత వరకూ కదల్లేదు.
దిశ, తెలంగాణ బ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకరు ఎకరం భూమిని కొనుగోలు చేశారు. పట్టాదారుడికి మొత్తం డబ్బులు చెల్లించాడు. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్‌చేసుకున్నారు. సంతకాలు చేశారు. ఆ తర్వాత ‘ఎర్రర్’ అని వచ్చింది. జాయింట్ సబ్‌రిజిస్ట్రార్/తహసీల్దార్‌కు అర్థం కాలేదు. వారం రోజుల్లో చేసేస్తామన్నారు. వారం తర్వాత ఇరువర్గాలు మళ్లీ తహసీల్దార్ ఆఫీసుకు వచ్చారు. అదే సమస్య తలెత్తింది. ధరణి పోర్టల్పూర్తిగా పరిశీలిస్తే ఆ భూమి రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో పెట్టారని తెలిసింది. పట్టాదారు పాసు పుస్తకంలో మాత్రం అన్నీ కరెక్టుగా ఉన్నాయి. పోర్టల్డేటా మాత్రం ఆ భూమిని రిజిస్ట్రేషన్చేయొద్దని చూపిస్తోంది. ఆ భూమి బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి అనే ప్రాజెక్టుకు ఇచ్చేసినట్టుగా ఉన్నది. కొన్న వ్యక్తి, హక్కుదారుడు లబోదిబోమన్నారు. తమ భూమి ప్రాజెక్టు కింద పోలేదని రైతు ఎంత మొత్తుకున్నా జాయింట్ రిజిస్ట్రార్ వినలేదు. తానేం చేయలేనంటూ చేతులెత్తేశారు. సదరు సర్వే నంబరులో 60 ఎకరాలు ఉండగానే వేరే పట్టాదారుల నుంచి 10 ఎకరాలు మాత్రం సేకరించారు. వారికి నష్టపరిహారం అందించారు. మిగతా 50 ఎకరాలు రైతుల స్వాధీనంలోనే ఉంది. వారే వ్యవసాయం చేసుకుంటున్నారు. దీన్ని సరి చేసేందుకు తహసీల్దార్ కు ఎలాంటి అధికారమూ లేదు. ధరణి పోర్టల్‌లో కొత్త ఆప్షన్ సృష్టించాలి. అప్పటి దాకా సమస్యకు పరిష్కారం దొరకదు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్గుర్తించారు. కానీ 30 ఏండ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన ఐఏఎస్అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఐదు నెలల నుంచి ఈ సమస్యకు పరిష్కారం చూపకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. సదరు సర్వే నంబరు హక్కుదారుల్లో ఓ రైతు చనిపోయాడు. ఇప్పుడా రైతు ఉంటే తప్ప సాంకేతికంగా రికార్డులు సరి చేయడం సాధ్యం కాదని పోర్టల్ సారాంశం. తమ సమస్యకు పరిష్కారం చూపాలని నెలల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని కొందరు బాధితులు ‘దిశ’కు వివరించారు.
ఇప్పుడేం చేయాలి?
’భూమిని కొన్నాను. రైతుకు మొత్తం సొమ్ము ఇచ్చేశాను. రిజిస్ట్రేషన్‌కోసం స్లాట్బుక్చేసుకున్నాను. ఆ తర్వాతే సదరు భూమి ప్రాజెక్టు పేరిట రాశారని తెలిసింది. రిజిస్ట్రేషన్ కావడం లేదు.. ఇప్పుడు తానేం చేయాలి‘ కొనుగోలుదారుడు ఉప్పల్‌కు చెందిన పల్లా ముత్యంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అదేదో ముందుగానే ఈ విషయం తెలిస్తే కొనకపోయేవాడినన్నారు. పైగా రైతుకు ప్రభుత్వం ఇచ్చిన కొత్త పట్టాదారు పాసు పుస్తకం ఉందని గుర్తు చేశారు. ప్రాజెక్టుకు తీసుకున్న భూమి కొంతైతే మొత్తం సర్వే నంబరును ప్రాజెక్టు భూమిగా నమోదు చేయడం అన్యాయమంటున్నారు. తనలా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఇప్పుడు తీసుకున్న సొమ్ము రైతు తిరిగిచ్చే అవకాశం కూడా లేదు. ఇలా ప్రాజెక్టుల కింద కొనుగోలు చేసిన అనేక మంది, హక్కుదారులైన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణహిత–చేవెళ్ల, డిండి లిఫ్టు ఇరిగేషన్ప్రాజెక్టు.. ఇలా అన్ని ప్రాజెక్టుల కింద సేకరించిన భూముల వివరాలను అసమగ్రంగా నమోదు చేశారన్న ఆరోపణలున్నాయి. అసెంబ్లీలో ఈ సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు ఉన్నతాధికారులెవరూ ఈ సమస్యాత్మక భూములపై దృష్టి పెట్టడం లేదని బాధితులు మండిపడుతున్నారు.
సీఎస్‌కు మొర
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలో సర్వే నం.67/ఇఇ/1లో 3.15 ఎకరాలు ఉంది. ఈ మేరకు లంగర్‌హౌజ్ మహేశ్‌కు పట్టాదారు పాసు పుస్తకం టి30050270349(ఖాతా నం.60152) ఉంది. దీనిలో ఎకరం భూమిని పల్లా ముత్యంరెడ్డి కొనుగోలు చేశారు. గతేడాది డిసెంబరు 15 స్లాట్బుక్చేసుకున్నారు. ఫోటోలు తీసుకున్నారు. సాక్షులతో సహా అందరి సంతకాలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇది ఇరిగేషన్ప్రాజెక్టు కింద పోయిన భూమి అంటూ పెండింగులో ఉంచారు. తమ భూమి పోలేదని, న్యాయం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు డిసెంబరు 26న అర్జీ పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ అధికారి స్పందించలేదని బాధితుడు పల్లా ముత్యంరెడ్డి వాపోయారు. అలాగే నాగిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నం.61, 62, 65, 66, 67 లో కేవలం 10 ఎకరాలు మాత్రమే సేకరించారు. కానీ మొత్తం 60 ఎకరాలను ధరణి పోర్టల్‌లో నిషేధించారు. సేకరించిన భూమి కూడా ఐదుగురు రైతుల నుంచి మాత్రమే. దానికి వారికి నష్టపరిహారం కింద సుమారు రూ.78 లక్షలు చెల్లించారు. మిగతా భూమిని సేకరించలేదని, ఆధారాలను పొందుపరుస్తూ సదరు పట్టాదారులు తమకు న్యాయం చేయండంటూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌కు డిసెంబరు నెలలోనే దరఖాస్తు పెట్టుకున్నారు. దానికి కూడా ఇప్పటి వరకు మోక్షం లభించలేదు.