37 ఏళ్లుగా హంసతో స్నేహం.. ఎలా కుదిరింది?

దిశ, ఫీచర్స్ : ఎవరితోనైనా స్నేహం చేయాలంటే ముందు వారి స్వభావం, ప్రవర్తనపై ఓ నిర్ధారణకు వచ్చిన తర్వాతే ముందుకెళ్లాలని పెద్దలు చెబుతుంటారు. ఇందుకు పంచతంత్రంలోని ‘హంస’ కథను ఉదహరిస్తుంటారు. మృదు స్వభావంతో పాటు పరోపకారి అయిన హంస.. దుష్ట స్వభావం గల కాకితో స్నేహం చేయడం వల్లే తన ప్రాణాలు కోల్పోతుంది. ఆ కథలో హంస సరైన మిత్రుడిని ఎంచుకోవడంలో తప్పు చేస్తే, టర్కీలోని ఓ హంస మాత్రం మనసున్న మనిషితో మైత్రి బంధం ఏర్పరుచుకుని, […]

Update: 2021-02-15 06:32 GMT

దిశ, ఫీచర్స్ : ఎవరితోనైనా స్నేహం చేయాలంటే ముందు వారి స్వభావం, ప్రవర్తనపై ఓ నిర్ధారణకు వచ్చిన తర్వాతే ముందుకెళ్లాలని పెద్దలు చెబుతుంటారు. ఇందుకు పంచతంత్రంలోని ‘హంస’ కథను ఉదహరిస్తుంటారు. మృదు స్వభావంతో పాటు పరోపకారి అయిన హంస.. దుష్ట స్వభావం గల కాకితో స్నేహం చేయడం వల్లే తన ప్రాణాలు కోల్పోతుంది. ఆ కథలో హంస సరైన మిత్రుడిని ఎంచుకోవడంలో తప్పు చేస్తే, టర్కీలోని ఓ హంస మాత్రం మనసున్న మనిషితో మైత్రి బంధం ఏర్పరుచుకుని, తమ స్నేహానికి సాటిలేదని చాటి చెబుతోంది. నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ స్నేహం.. మిలియన్ల మంది హృదయాలను గెలుచుకుంది. మరి ఆ బెస్టీస్ ఫ్రెండ్‌షిప్ ఎలా మొదలైందో తెలుసుకుందాం.

టర్కీకి చెందిన రిటైర్డ్ పోస్ట్‌మ్యాన్ రిసెప్ మిర్జాన్.. 1984లో తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా, దారి పక్కన పొలంలో రెక్క విరిగి గాయాలతో కొట్టుమిట్టాడుతున్న హంసను చూశాడు. హంసలను ఎక్కువగా తినే టర్కీవాసులు కంటపడితే దాని ప్రాణాలకు ప్రమాదమని భావించిన మిర్జాన్.. ఎలాగైనా ఆ హంసను బతికించాలని నిర్ణయించుకున్నాడు. తనతో పాటే ఇంటికి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేశాడు. కొద్దిరోజులకు కోలుకున్న హంస.. ఎగిరిపోయే ప్రయత్నం చేయకపోకుండా మిర్జాన్‌కు చెందిన పొలంలో తిరుగుతూ అక్కడే ఉన్న ఇతర జంతువులతో స్నేహం చేసింది. మిర్జాన్ ఆ హంసను ముద్దుగా ‘గారిప్’ అని పిలుచుకుంటున్నాడు. అలా 37 సంవత్సరాల క్రితం మొదలైన ‘గారిప్ – మిర్జాన్‌ల మైత్రి బంధం ఇప్పటికీ ఆనందంగా కొనసాగుతూనే ఉంది. ఇక మిర్జాన్ భార్య కొన్నేళ్ల క్రితమే మరణించగా, అప్పటి నుంచి జంతువులతో మరింత ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అతడికి పిల్లలు లేనందున ‘గారిప్‌’నే తన బిడ్డగా భావిస్తున్నాడు.

‘నేను పిలవగానే గారిప్ పరుగెత్తుకు వస్తుంది. నా దగ్గరికి వచ్చిన క్షణం నుంచి ఇప్పటివరకు అది నన్నెప్పుడూ విడిచిపెట్టలేదు. ఈ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తినా గారిప్ ఎటూ వెళ్లలేదు. నా పొలంలోనే తనకో కూప్(షెడ్) ఉంది. అయినా పగటివేళ నా పనుల్లో సాయం చేస్తుంది. సాయంత్రం నేను వాకింగ్ చేస్తుంటే నాతో పాటే వస్తుంది. చాలా ఉత్సాహంగా, చలాకీగా ఉండేది. ప్రస్తుతం గారిప్‌కు వయసైపోయింది. దురదృష్టవశాత్తూ అది చనిపోతే, గుర్తుగా ఈ పొలంలోనే ఓ సమాధి కట్టిస్తాను. కానీ గారిప్‌తో మరింత కాలం కలిసి జీవించాలని ఆశిస్తున్నా’ అని మిర్జాన్ తమ మైత్రి గురించి చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News