సెటిల్మెంట్ల నరసింహారెడ్డి..!
దిశ, క్రైమ్ బ్యూరో: సివిల్ వివాదాలే సారుకు పెట్టుబడి.. పరిష్కారం చూపుతూ పిండుకోవడం ఆయనకు మహా సరదా.. మధ్యవర్తులను తప్పిస్తూ డైరెక్ట్ సెటిల్మెంట్ చేసుకోనే వన్‌మ్యాన్ షో అతడి నైజం.. చేసేది శాంతిభద్రతలను పరిరక్షించే ఉద్యోగమే అయినా, తేరగా తినడమే అతగాడి పని.. పలువురు ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని కలరింగ్ ఇస్తూ అందినకాడికి వెనకేసుకుని దాదాపు రూ.70 కోట్ల సంపాదనతో ఓ ‘అక్రమ’ రికార్డునే నెలకొల్పాడు.. ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు చిట్టా […]
దిశ, క్రైమ్ బ్యూరో: సివిల్ వివాదాలే సారుకు పెట్టుబడి.. పరిష్కారం చూపుతూ పిండుకోవడం ఆయనకు మహా సరదా.. మధ్యవర్తులను తప్పిస్తూ డైరెక్ట్ సెటిల్మెంట్ చేసుకోనే వన్‌మ్యాన్ షో అతడి నైజం.. చేసేది శాంతిభద్రతలను పరిరక్షించే ఉద్యోగమే అయినా, తేరగా తినడమే అతగాడి పని.. పలువురు ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని కలరింగ్ ఇస్తూ అందినకాడికి వెనకేసుకుని దాదాపు రూ.70 కోట్ల సంపాదనతో ఓ ‘అక్రమ’ రికార్డునే నెలకొల్పాడు.. ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు చిట్టా విప్పడంతో సారు అసలు వ్యవహారం బట్టబయలైంది.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి నివాసంపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో 25 చోట్ల దాడులు చేపట్టారు. హైదరాబాద్‌లోని నరసింహారెడ్డి నివాసంతో పాటు వరంగల్, కరీంనగర్, నల్గొండ, అనంతపురం జిల్లాల్లోని బంధువుల ఇళ్లలో కూడా అధికారులు రాత్రి దాకా సోదాలు చేపట్టారు. పోలీసు శాఖలో ఐజీగా విరమణ పొందిన చంద్రశేఖర్ రెడ్డికి అల్లుడు కావడంతో పాటు మరో ఉన్నతాధికారి గాడ్ ఫాదర్లుగా ఉన్నారంటూ చెప్పుకుంటూ నగర శివారు ప్రాంతాలైన మియాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి భూ వివాదాల్లో తలదూర్చేవాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే భారీగా అక్రమాస్తులను కూడబెట్టినట్టుగా గుర్తించిన ఏసీబీ బుధవారం ఏక కాలంలో హైదరాబాద్ లోని మహీంద్రాహిల్స్, సికింద్రాబాద్, ఉప్పల్, డీడీ కాలనీ, అంబర్‌పేట, వరంగల్ జిల్లాలో 3 చోట్ల ( లింగాల ఘనపురం మండలం వడ్ఢిచెర్ల, బచ్చన్నపేట, రఘునాథపల్లి మండలాల్లో), కరీంనగర్ జిల్లాలో 2 చోట్ల, నల్గొండ జిల్లాలో 2 ప్రాంతాల్లో, అనంతపురం జిల్లాలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి నగరంలో ఉప్పల్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో సీఐగా, చిక్కడపల్లి, మల్కాజిగిరి ప్రాంతాల్లో ఏసీపీగా విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సెటిల్మెంట్లకు పాల్పడి భారీగా అక్రమాస్తులను కూడబెట్టినట్టుగా తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో 55 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో 1960 చదరపు గజాలు కలిగిన 4 ప్లాట్లు, 2 ఇంటి స్థలాలు, హఫీజ్‌పేటలోని జీ ప్లస్ త్రీ కమర్షియల్ బిల్డింగ్, 2 ఇళ్లు, రూ.15 లక్షల నగదు, 2 బ్యాంకు లాకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులతో పాటు సికింద్రాబాద్ నివాసంలో పెద్ద ఎత్తున్న బంగారం, వెండి ఆభరణాలను అధికారులు ఇప్పటి వరకు గుర్తించారు. బుధవారం రాత్రి వరకు లెక్కించిన ప్రకారం ఆస్తుల విలువ అధికారికంగా రూ.7.5 కోట్లుగా, మార్కెట్ వాల్యూ ప్రకారం రూ.70 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా సోదాలు జరుగుతున్నందునా మరిన్ని అక్రమాస్తులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఓ అధికారి పేర్కొన్నారు.