టీటీడీలో పూజలు సక్రమంగా చేయండి: సుప్రీం కోర్టు
దిశ, ఏపీ బ్యూరో: తిరుమల శ్రీవారికి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. పూజలను సక్రమంగా నిర్వహించకపోతే వెంకటేశ్వరస్వామి ఉపేక్షించరని హెచ్చరించారు. స్వామివారి మహిమలు అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. తాను కూడా […]
దిశ, ఏపీ బ్యూరో: తిరుమల శ్రీవారికి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. పూజలను సక్రమంగా నిర్వహించకపోతే వెంకటేశ్వరస్వామి ఉపేక్షించరని హెచ్చరించారు. స్వామివారి మహిమలు అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. తాను కూడా శ్రీవారి భక్తుడినేనని స్పష్టం చేశారు. టీటీడీపై పిటిషనర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం వారంలోగా పూర్తి వివరాలు ఇవ్వాలని టీటీడీ తరపు న్యాయవాదిని సీజేఐ ఆదేశించారు.
అలాగే టీటీడీలో జరిగే నిత్య పూజల విషయంలో ఏవైనా సమస్యలు తలెత్తాయా.. ఎందుకు చేయలేకపోయారో పూర్తి వివరాలతో సుప్రీంకోర్టుకు సమర్పించాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. ఇరువాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపోతే ఈ అంశంపై పిటిషనర్ ఇంతకుముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే టీటీడీలో జరిగే పూజల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో పిటిషనర్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే.