‘మహా’ అగాధంలో కూటమి సర్కారు.. దాడి చేస్తున్న బీజేపీ
ముంబయి: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ నెలకు రూ. 100 కోట్ల వసూళ్ల వ్యవహారం ఆ రాష్ట్ర సర్కారును ఇబ్బందుల్లోకి నెట్టింది. తాజా ఘటనలు ప్రభుత్వానికి కళంకం తీసుకొచ్చాయని భావిస్తున్న మూడు పార్టీల నేతలు అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామాకు పట్టుబడుతున్నారు. ఇదే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా అనిల్‌తో మాట్లాడి, ఆయన రాజీనామా కోరినట్టు వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంతో మహా వికాస్ అగాఢీ ప్రభుత్వంపై కేంద్ర […]
ముంబయి: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ నెలకు రూ. 100 కోట్ల వసూళ్ల వ్యవహారం ఆ రాష్ట్ర సర్కారును ఇబ్బందుల్లోకి నెట్టింది. తాజా ఘటనలు ప్రభుత్వానికి కళంకం తీసుకొచ్చాయని భావిస్తున్న మూడు పార్టీల నేతలు అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామాకు పట్టుబడుతున్నారు. ఇదే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా అనిల్‌తో మాట్లాడి, ఆయన రాజీనామా కోరినట్టు వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంతో మహా వికాస్ అగాఢీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నాయకులు ముప్పేట దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ రంగంలోకి దిగారు. అనిల్ విషయంపై చర్చించడానికి ఢిల్లీకి రావాలంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి జయంత్ పాటిల్‌లను ఆదేశించారు. వీరితో పాటు కూటమి పార్టీ నేతలతో కూడా ఆయన సమావేశం నిర్వహఇంచనున్నారు.
అనిల్ దేశ్‌ముఖ్‌పై ఆరోపణల నేపథ్యంలో పవార్ ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ.. అనిల్‌పై ముంబయి పోలీసు ఉన్నతాధికారి చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని అన్నారు. ఈ ఘటనపై మాజీ ఐపీఎస్ అధికారి జులియో రిబరియోతో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీని వెనుక రాజకీయ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. అయితే అనిల్ దేశ్‌ముఖ్ నుంచి రాజీనామా కోరడం కేవలం ఒక ఆప్షన్ మాత్రమేననీ.. తుది నిర్ణయం మాత్రం సీఎం ఉద్దవ్ చేతుల్లోనే ఉంటుందని ఎన్సీపీ చీఫ్ తెలిపారు. పరంబీర్ సింగ్ తనను కలిశాడని.. తనను ట్రాన్స్ ఫర్ చేయడం అన్యాయమని ఆయన తనతో అన్నారని పవార్ చెప్పుకొచ్చారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా హోంమంత్రిపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరగాలన్నారు.
కాగా.. మహారాష్ట్రలో సంకీర్ణ కూటమిని ఇరుకున పెట్టేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్న బీజేపీ.. హోంమంత్రి ఘటనపై అధికార కూటమిపై విమర్శల వర్షం కురిపించింది. స్వయంగా కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, అనురాగ్ సింగ్ ఠాకూర్‌లు మహారాష్ట్ర ప్రభుత్వం పాలించే నైతిక హక్కు కోల్పోయిందని విమర్శలు చేశారు. సీఎం ఉద్దవ్ థాక్రే వెంటనే రాజీనామా చేయాలని వాళ్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. అనిల్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. శరద్ పవార్ వాస్తవాలకు దూరంగా మాట్లాడుతున్నారని, ఈ ఘటనపై ఉద్దవ్ థాక్రే విచారణకు ఆదేశించాల్సి ఉన్నా ఇంకా ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఇదే విషయమై ఆదివారం బీజేపీ కార్యకర్తలు రాష్ట్రమంతటా ఆందోళనలు చేపట్టారు.
ఇదిలాఉండగా.. శనివారం విడుదలైన లేఖ తాను రాసిందేనని పరంబీర్ సింగ్ అన్నారు. దానిపై ఆయన సంతకం లేకపోవడంతో ఇది పరంబీర్ సింగ్ రాసిందేనా..? లేక మరేవరైనా చేసుంటారా..? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన ఓ ఆంగ్ల ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఆ లేఖ తనదేననీ, త్వరలోనే తన సంతకంతో ఉన్న మరో లేఖను సీఎంకు పంపిస్తానని ఆయన స్పష్టం చేశారు. కాగా.. ఈ కేసును జులియో రిబరియోతో విచారణ చేయించాలని సూచించిన పవార్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తాను ఇలాంటి కేసులను డీల్ చేయనని రిబరియో అన్నారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి దారి తీస్తుందో అని, రాజకీయ నాయకులే దీనిని పరిష్కరించుకోవాలని సూచించారు.