‘సర్వే’తో కొత్త ఇబ్బందులు..
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఆస్తి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రజల ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఫలితంగా ఉన్న సమస్యలు పక్కన పెడితే ఇంట్లో కొత్త పంచాయితీలు మొదలవుతున్నాయి. ఆన్‌లైన్ నమోదు ప్రక్రియలో ఉన్న అనేక విషయాలపై కార్యదర్శులకు అవగాహన లేకపోవడంతో కొత్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లా నుంచి ముంబై, హైదరాబాద్ తదితర నగరాలకు పనుల కోసం చాలా మంది వలస వెళ్లారు. వారి ఆస్తులకు సంబంధించిన వివరాలు, వారి ఫొటోలు […]
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఆస్తి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రజల ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఫలితంగా ఉన్న సమస్యలు పక్కన పెడితే ఇంట్లో కొత్త పంచాయితీలు మొదలవుతున్నాయి. ఆన్‌లైన్ నమోదు ప్రక్రియలో ఉన్న అనేక విషయాలపై కార్యదర్శులకు అవగాహన లేకపోవడంతో కొత్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లా నుంచి ముంబై, హైదరాబాద్ తదితర నగరాలకు పనుల కోసం చాలా మంది వలస వెళ్లారు. వారి ఆస్తులకు సంబంధించిన వివరాలు, వారి ఫొటోలు సేకరించడంలో కార్యదర్శులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి.
ప్రభుత్వం చేపట్టిన సర్వే అనేక వివాదాలకు తావిస్తున్నది. ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చేపట్టిన ఈ సర్వే వల్ల కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. కుటుంబాల్లో పంచాయితీలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇంటి యజమాని వివరాలు నమోదు చేసే క్రమంలో అనేక సందేహాలు ఎదురవుతున్నాయి. ఆన్‌లైన్ నమోదు ప్రక్రియలోని అనేక అంశాలపై పంచాయతీ కార్యదర్శులకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో వివరాలు ఎలా సేకరించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అసలు ఈ సర్వే ప్రక్రియ ఎలా ముందుకెళ్తున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యజమాని ఫొటోతో సమస్యలు
ఆన్‌లైన్ నమోదులో ఇంటి యజమానుల వివరాలతో నమోదు చేస్తున్న క్రమంలో వారి ఫొటో కచ్చితంగా నమోదు చేయాలనే నిబంధన ఉండటంతో కార్యదర్శులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా గ్రామాల్లో కొంత మంది వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లారు. వారు స్థానికంగా లేకపోవడంతో వారికి సంబంధించిన వివరాలు, ఫొటో వివరాలు సేకరించడం ఎలా అని కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. యజమానిని కచ్చితంగా ఫొటో తీసి సైట్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులు చెబుతుండటంతో… అందుబాటులో లేని వారి వివరాలను ఎలా నమోదు చేయాలనే విషయంపై స్పష్టత కరువైంది. సమీపంలో ఉన్నవారి పరిస్థితి ఎలా ఉన్నా ముంబాయి, పుణే, గుజరాత్ వంటి సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారు ఇప్పటికిప్పుడు తిరిగిరాలేని పరిస్థితి.
కోర్టులో పెండింగ్..
చాలా గ్రామాల్లో పలువురి ఆస్తులపై కేసులు కోర్డులో పెండింగ్‌లో ఉన్నాయి. కానీ ప్రస్తుతం వాటి వివరాలను ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేయాలో కార్యదర్శలకు అర్థం కావడం లేదు. ఒక వేళ వివరాలు నమోదు చేస్తే భవిష్యత్తులో వచ్చే సమస్యలకు పంచాయతీ కార్యదర్శులను బాధ్యులుగా చేసే ప్రమాదముంది. ఇప్పటికే అనేక విషయాల్లో జిల్లా కలెక్టర్ల నుంచి దిగువ స్థాయి వరకు ఉన్న రెవెన్యూ సిబ్బంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఏయే ఇండ్లపై వివాదాలు కొనసాగుతున్నాయి. ఏ భూమిపై కేసులు నడుస్తున్నాయనే విషయంలో పంచాయతీ కార్యదర్శుల వద్ద ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని వివాదాలు సైతం తెరమీదకు వచ్చే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు అంటున్నారు.
రైతు బంధు వచ్చేనా?
వ్యవసాయ పొల్లాలో నిర్మించుకున్న ఇండ్లను సైతం ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వల్ల ఈ భూములు అన్నీ వ్యవసాయేతర భూముల కింద మారిపోనున్నాయి. ఈ క్రమంలో ఒక్కో గ్రామంలో ఒక్కో మాదిరిగా పంచాయతీ కార్యదర్శులు ఇండ్ల కొలతలను తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అధికారులు కేవలం ఇండ్ల నిర్మాణం చేపట్టిన ప్రాంతానే కొలతలు తీసుకుంటుండగా మరికొన్ని చోట్ల ఇంటితో పాటు ఇండ్ల ముందు ఉన్న ఖాళీ ప్రదేశాలను సైతం కొలుస్తున్నారు. దీంతో తమకు రైతు బంధు డబ్బులు వస్తాయో? రావో? అని రైతుల్లో ఆందోళన మొదలైంది. సర్వే నెంబర్లు లేకుండా పంచాయతీ కార్యదర్శులు ఇండ్ల వివరాలను నమోదు చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కుటుంబాల మధ్య గొడవలు
ప్రభుత్వం చేపట్టిన సర్వే కారణంగా అనేక గ్రామాల్లో సుదీర్ఘకాలంగా కలిసి ఉన్న కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంట్లో ఎవరో ఒక్కరి యజమానిగా నమోదు చేయడం వల్ల భవిష్యత్తులో తమ పిల్లలకు అన్యాయం జరుగుతుందనే భావన చాలా కుటుంబాల్లో నెలకుంది. దీంతో ఆస్తుల పంపకాల విషయంలో గొడవలు మొదలయ్యాయి. యజమాని పేరుపై కొత్తగా బుక్ రావడంతో తమకు ఆస్తులు ఎక్కడ దూరమవుతాయోనని చాలా మందిలో అనుమానాలు కలుగుతున్నాయి.
పొజిషన్ సమస్యలు..
అనేక ప్రాంతాల్లో ప్లాటు, భూములు ఒకరి పేరుపై ఉంటే.. అక్కడ నివాసముండేది మరొకరు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్‌లైన్ ప్రక్రియలో భాగంగా ఈ స్థలం, ఇండ్లు ఎవ్వరి పేరు మీద నమోదు చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థలం తమదే అయినందున తమ పేరును నమోదు చేయాలని కొందరు అంటుంటే.. తాము పొజిషన్‌లో ఉన్నందున తమ పేరును నమోదు చేయాలని మరికొందరు వాదిస్తున్నారు. ముఖ్యంగా తాతల కాలం నుంచి వ స్తున్న పురాతన ఇండ్ల విషయంలో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అందరినీ యజమానులుగా నమోదు చేయాలని.. ఒకరి పేరుపై నమోదు చేస్తే ము న్ముందు ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.
రెవెన్యూ సహకారం లేకుండానే..
వ్యవసాయ భూముల్లో నిర్మించుకున్న ఇండ్ల విషయంలో వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. సర్వే నెంబర్ల పై పంచాయతీ కార్యదర్శులకు పెద్దగా అవగాహన లేకపోవడంతో స్థానికంగా ఉన్న వారు అనేక విషయాలను దాచి పెట్టి తప్పుడు సమాచారం ఇచ్చే ప్రమదముంది. దీంతో హక్కు దారులు అభ్యంతరాలు తెలిపి అవకాశముంది. వీరికి రెవెన్యూ సిబ్బంది సహకారం అందిస్తే సమస్యలకు కొంత మేర పరిష్కారం దొరికే చాన్స్ ఉంది.
సర్వేలో భాగంగా ప్రభుత్వం తయారు చేసిన ప్రొఫోర్మలో అనేక అంశాలను జోడించింది. ఇంటి యజమాని, కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, విద్యుత్ మీటర్ నెంబర్లు, ఇలా వివిధ వివరాలను నమోదు చేయాల్సి వుంది. ఒక వైపు సమయాభావం ఉండడంతో పాటు ఇన్ని అంశాలతో కూడిన వివరాలను సేకరించడంలో ఏమాత్రం పొరపాటు జరిగినా దాని వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. ఫ్రొఫార్మలో ఉన్న ప్రశ్నలకు గ్రామస్తులను నుంచి సరైన వివరాల రాకపోవడంతో కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఒక్కో కార్యదర్శి రోజుకు 70 ఇండ్లను సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాని ఇన్ని అంశాలతో కూడిన వివరాలను సేకరించడంలో చాలావరకు సమయం వృథా అవుతుందని దీని కారణంగా అనుకున్న టార్గెట్‌ను సమయంలో పూర్తి చేయడం కష్టమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.