పట్నం.. పల్లెబాట.. సొంతూళ్లకు కూలీల క్యూ

కరోనా సెకండ్​ వేవ్​.. బతుకులను ఆగం చేస్తున్నది. వివిధ రాష్ట్రాల నుంచి పనులు చేసుకొనేందుకు హైదరాబాద్​కు వచ్చిన కూలీలు మళ్లీ సొంతూళ్ల బాటపడుతున్నారు. మే మొదటి వారంలో లాక్​ డౌన్​ వస్తందనే ప్రచారం వారిని వెంటాడుతున్నది. గత ఏడాది మాదిరిగా రైళ్లు, బస్సులు బందైతే తమ పరిస్థితి ఏమిటి అని అంచనా వేసుకుంటూ మూటా ముల్లే సర్దుకుంటున్నారు. ‘బతికుంటే బలుసాకైనా తినొచ్చు’ అన్నట్టుగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద బారులు తీరుతున్నారు. తిరుగు వలసల్లో ఎక్కువగా ఒడిషా, […]

Update: 2021-04-16 22:07 GMT

కరోనా సెకండ్​ వేవ్​.. బతుకులను ఆగం చేస్తున్నది. వివిధ రాష్ట్రాల నుంచి పనులు చేసుకొనేందుకు హైదరాబాద్​కు వచ్చిన కూలీలు మళ్లీ సొంతూళ్ల బాటపడుతున్నారు. మే మొదటి వారంలో లాక్​ డౌన్​ వస్తందనే ప్రచారం వారిని వెంటాడుతున్నది. గత ఏడాది మాదిరిగా రైళ్లు, బస్సులు బందైతే తమ పరిస్థితి ఏమిటి అని అంచనా వేసుకుంటూ మూటా ముల్లే సర్దుకుంటున్నారు. ‘బతికుంటే బలుసాకైనా తినొచ్చు’ అన్నట్టుగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద బారులు తీరుతున్నారు. తిరుగు వలసల్లో ఎక్కువగా ఒడిషా, పశ్చిమ బెంగాల్​తోపాటు ఈశాన్య రాష్ట్రాలవారే ఉంటుండటం గమనార్హం. గత ఏడాది లాక్​డౌన్​ సందర్భంగా ఇక్కడి నుంచి వెళ్లిన వారిలో సగం మంది తిరిగి రాలేదు. వచ్చిన వారూ వెళుతుండటం గమనార్హం.

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి సరికొత్త సంక్షోభానికి కారణమవుతున్నది. రియల్ ఎస్టేట్, ఉత్పత్తి, సేవా రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు మళ్ళీ సొంతూళ్ల బాట పడుతున్నారు. కేసుల సంఖ్య వేలల్లో పెరుగుతుండడంతో గతేడాది తరహాలోనే లాక్‌డౌన్ వస్తుందేమోననే అనుమానమే ఇందుకు కారణం. ఇప్పటికే అసంఘటిత రంగంలోని కూలీలు, కార్మికులు సొంతూళ్ళకు వెళ్లడం ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వారం రోజుల నుంచి వేల సంఖ్యలో సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే వీకెండ్ లాక్‌డౌన్, కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ, ఆంక్షలు లాంటివి అమలవుతుండడంతో త్వరలో హైదరాబాద్‌లోనూ తప్పదనే అనుమానంతో ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు.

మే నెల మొదటి వారం నుంచి..

మే నెల మొదటి వారం నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ వస్తుందనే వార్తలు వారి అనుమానాలను మరింత పెంచాయి. గతేడాది లాక్‌డౌన్ సందర్భంగా పడిన ఇబ్బందులు ఈసారి ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో ముందస్తుగానే ఊరి బాట పట్టారు. రైళ్ళనూ నిలిపివేస్తారనే అనుమానం వారిని వేధిస్తోంది. ఈవిషయమై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా మూడు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ, రైళ్ళు ఆపేస్తారేమోననే వార్తలు వస్తున్నాయని, కానీ అందులో నిజం లేదని, ప్రతి రోజూ సికింద్రాబాద్ నుంచి 180 రైలు సర్వీసులు ఇతర రాష్ట్రాలకు, ప్రధాన నగరాలకు నడుస్తున్నాయని, ఏ రైళ్ళనూ ఆపలేదన్నారు. అయినా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్న కార్మికుల్లో అనుమానాలు సడలలేదు.

‘లాక్‌డౌన్ వస్తుందంట గదా.. ఇక్కడ ఉండలేం..

హైదరాబాద్ నగరంలో సర్వీసు సెక్టార్‌లో పనిచేసే వేలాది మంది కార్మికులు కూడా సొంతూళ్ళకు వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉన్నారు. యాజమాన్యాలపై ఇప్పడిప్పుడే ఒత్తిడి మొదలైంది. హోటళ్ళు, హాస్టళ్ళు, లాడ్జీలు, రెస్టారెంట్లు, బార్లు.. లాంటి సర్వీసు సెక్టార్‌లో పనిచేసే కొద్దిమంది కార్మికులు ఇప్పటికే వెళ్ళిపోయారు. ‘లాక్‌డౌన్ వస్తుందంట గదా.. ఇక్కడ ఉండలేం.. సొంతూళ్లలో ఏదో ఒక పని చేసుకుని బతుకుతాం..’ అని యాజమాన్యాన్ని రిక్వెస్టు చేస్తున్నారు. ఎక్కువగా ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కార్మికులే ఈ రంగంలో ఎక్కువగా పనిచేస్తున్నారు. ఉత్పత్తి పరిశ్రమల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తున్నది. మహారాష్ట్ర నుంచి వచ్చే పాలిమర్స్, స్టీల్, ఇతర రసాయనాల సరుకు రవాణా బాగా తగ్గిపోవడంతో ప్రొడక్షన్ తగ్గింది. పనిచేస్తున్న కార్మికులకు చేతి నిండా పని కల్పించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ముడి పదార్ధాలు సకాలంలో, సరైన మోతాదులో రాకపోవడానికి మహారాష్ట్రలో కరోనా తీవ్రతే కారణమనే అభిప్రాయానికి వచ్చిన స్కిల్డ్ కార్మికులు మళ్ళీ లాక్‌డౌన్ తరహా ఇబ్బందులు వస్తుండొచ్చనే అనుమానంతో ఉన్నారు.

ఇక రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ, ప్లోరింగ్, కార్పెంటరీ తదితర స్కిల్డ్ పనులు చేసే కార్మికులు ఎక్కువగా బీహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందినవారు. గతేడాది లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఇళ్ళకు వెళ్ళిపోయినవారు పూర్తిస్థాయిలో తిరిగి రాలేదు. తిరిగొచ్చినవారిలో కూడా చాలా మంది మళ్లీ వెళ్ళిపోవాలనే ఆలోచనతో ఉన్నారు. పరిస్థితులు కోలుకునేంతవరకు సొంతూళ్ళలో ఉండడానికే ఇష్టపడుతున్నారు.

వారం రోజుల తర్వాత ఇబ్బందే

“హోటల్‌తో పాటు గెస్ట్ హౌజ్, హాస్టళ్లు నడుపుతున్నాను. ఎక్కువగా ఒడిషా, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల వారే పనిచేస్తున్నారు. గతేడాది లాక్‌డౌన్ సమయంలో వెళ్లిపోయిన సగం మంది కూడా తిరిగి రాలేదు. హాస్టళ్ళు, గెస్ట్ హౌజ్ మూతపడే ఉన్నాయి. కేవలం హోటల్​ మాత్రమే నడుస్తున్నది. గతేడాది ఏప్రిల్‌‌లో వెళ్లిపోయిన తర్వాత తొమ్మిది నెలల తర్వాత డిసెంబరు చివరి వారంలో వచ్చారు. నాలుగు నెలలు కూడా కాకముందే మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. మళ్ళీ లాక్‌డౌన్ వస్తుందేమోనని అనుమానపడుతున్నారు. వెళ్ళిపోతామంటున్నారు. కన్విన్స్ చేస్తున్నాం. కానీ మే మొదటి వారంలో లాక్‌డౌన్ ఉంటుందనే అనుకుంటున్నారు. ఈసారి నిలబెట్టుకోవడం కష్టంగానే ఉంది”.
– కుమార్, హోటల్ యజమాని

వెళ్ళిపోతామంటున్నారు

‘‘మహారాష్ట్రలో కరోనా కారణంగా అనేక పరిశ్రమలు తయారుచేసే పాలిమర్స్ లాంటి ముడి పదార్ధాల ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో అనుకున్న స్థాయిలో మేం ఉత్పత్తి చేయలేకపోతున్నాం. ఈ పరిస్థితి కార్మికులుగా వారికి కూడా తెలుసు కాబట్టి కర్ఫ్యూ, లాక్‌డౌన్ లాంటివి తప్పవేమో అని అనుకుంటున్నారు. వెళ్ళిపోతామని ఒత్తిడి తెస్తున్నారు. వ్యాపారం దెబ్బతిన్నది. వారిని ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వలేం. జీఎస్టీ, ఈఎస్ఐ లాంటి చెల్లింపులు భారంగా మారాయి. ఈ నెల చివరికల్లా ఒక్కరొక్కరుగా సొంతూళ్లకు వెళ్ళిపోయే అవకాశాలున్నాయి. ఒకసారి వెళ్ళిన తర్వాత తిరిగి ఎప్పుడొస్తారో చెప్పలేం”.
– సుధీర్ రెడ్డి, తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు

స్కిల్డ్ లేబర్ లేకుంటే కష్టమే

”గతేడాది లాక్‌డౌన్ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగం కోలుకుంటోంది. సెకండ్ వేవ్ మొదలైంది. కేసులు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ వస్తుందేమోననే అనుమానాలు అందరికీ ఉన్నాయి. ప్లంబింగ్, కార్పెంటరీ, ఫ్లోరింగ్, టైలింగ్, సీలింగ్, ఎలక్ట్రికల్ తదితర పనులన్నీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులే చేస్తున్నారు. ఇప్పుడు వారు వెళ్లిపోతే పనులన్నీ పెండింగ్‌లో పడతాయి. ఇంకా వలసలు మొదలుకాలేదు. కానీ వారం తర్వాత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి”.
– జి.రాంరెడ్డి, క్రెడాయ్ జాతీయ ఉపాధ్యక్షుడు

Tags:    

Similar News