ప్యాకేజ్ కొట్టు.. ఓట్లు పట్టు..!

దిశ ప్రతినిధి, మేడ్చల్ : కాలనీలు, బస్తీల్లో ఏ సమస్యలున్నా పరిష్కరిస్తామని బల్దియా ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఇచ్చే హామీలు ఎవరూ పట్టించుకోవడం లేదు. గెలిచాక ముఖం చూపించని నాయకులు ఎందరో.. అట్లాంటి వాళ్లను నమ్మేదెలా..? అని బస్తీలు, కాలనీ సంఘాలు ఏదో ఒక రూపంలో ముందే లబ్ది పొందాలని సరికొత్త విధానానికి తెరతీస్తున్నాయి. ఓట్లు కావాలంటే మేం చెప్పింది చేయాలి. మాకు కావాల్సింది ఇయ్యాలి. మా సంఘం ఓట్లు గిన్ని ఉన్నయ్.. ఎంతిస్తవ్.. ఏం చేస్తవ్.. […]

Update: 2020-11-28 20:57 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్ : కాలనీలు, బస్తీల్లో ఏ సమస్యలున్నా పరిష్కరిస్తామని బల్దియా ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఇచ్చే హామీలు ఎవరూ పట్టించుకోవడం లేదు. గెలిచాక ముఖం చూపించని నాయకులు ఎందరో.. అట్లాంటి వాళ్లను నమ్మేదెలా..? అని బస్తీలు, కాలనీ సంఘాలు ఏదో ఒక రూపంలో ముందే లబ్ది పొందాలని సరికొత్త విధానానికి తెరతీస్తున్నాయి. ఓట్లు కావాలంటే మేం చెప్పింది చేయాలి. మాకు కావాల్సింది ఇయ్యాలి. మా సంఘం ఓట్లు గిన్ని ఉన్నయ్.. ఎంతిస్తవ్.. ఏం చేస్తవ్.. అంటూ అభ్యర్థులను డిమాండ్ చేస్తున్నాయి. ప్యాకేజీ తేల్చేయ్ ప్యాకప్ చేస్తామంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. బస్తీల నాయకులనే నమ్ముకున్న అభ్యర్థులు సైతం ఏ పుట్టలో ఏ పాముందో తెలియక ఇచ్చేస్తే పోలా అని ఎదైనా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.

గల్లీ లీడర్లదే హవా..

గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. వేలాది కాలనీలు, బస్తీలు ఉన్నాయి. ఈ కాలనీలు, బస్తీల్లో గల్లీకో లీడర్ ఉన్నారు. జీహచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో అంతా బస్తీ, గల్లీ లీడర్లదే హవా కొనసాగుతోంది. మా కాలనీలో గిన్నీఓట్లున్నాయి. ఓటుకు ఇంత ఇచ్చేయండి.. ఆ ఓట్లన్నీ మీకే వేస్తాం.. అంటూ అభ్యర్థులకు గాలం వేస్తున్నారు. ఇప్పటికే బస్తీలు, కాలనీలను గుప్పిట్లో పెట్టుకున్న వీరు, ఈ తరహాలో డిమాండ్లు వినిపిస్తున్నారు. మహిళా, కార్మిక, యువజన సంఘాలు అన్నింటిని మ్యానేజ్ చేస్తాం, ఒక్కోదానికి సెపరేట్ ప్యాకేజీ సమర్పించుకోవడానికి సిద్దంగా ఉండు సుమీ అంటూ డిమాండ్ లు వినిపిస్తున్నాయి. ఓట్లన్నీంటికి మాదీ భరోసా అంటూ నేతల ముందు మాటలు కోటలు దాటుతున్నాయి. ఇక తప్పని పరిస్థితులు ఎదురవడంతో ఓట్ల కోసం నాయకులు ఎంత డబ్బు పెట్టడానికైనా వెనుకాడడం లేదు. దీంతో రంగ ప్రవేశం చేసిన బస్తీ లీడర్లంతా మూకుమ్మడి ప్యాకేజీ ఆఫర్ ను ఎగేరేసుకుపోతున్నారు. కమ్యూనిటీ సంఘాలు, అపార్ట్ మెంట్ అసోసియేషన్లు ఇదే ధోరణి అనుసరిస్తున్నాయి.

క్యాడర్ లేకనే సమస్య..

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు క్యాడర్ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆశీంచిన స్థాయిలో కార్యకర్తలు లేకపోవడంతో ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. క్యాడర్ ను పెంచి పోషించడంపై నాయకులు దృష్టి పెట్టకపోవడంతో బస్తీ లీడర్లుగా చలమాణి అవుతున్న వారు అంతా తామై నడిపిస్తున్నారు. మహా పోరులో తలపడుతున్న బీజేపీ, కాంగ్రెస్, టీడీపీతోపాటు పలు పార్టీలకు చెందిన కొందరు అభ్యర్థులకు వేళ్లమీద లెక్కించే కార్యకర్తలు ఉండడంతో వారు గడ్డు కాలన్నీ ఎదుర్కొంటున్నారు. బీజేపీకి మంచి ఊపు ఉన్నా.. కొన్ని డివిజన్లలో అభ్యర్థులకు కార్యకర్తల బలం లేకపోవడంతో అంతా డబ్బు రాజకీయాన్ని నడిపించాలని భావిస్తున్నట్లు వారి అనుచర గణమే కోడై కూస్తుంది.

Tags:    

Similar News