సరోజ ఎవరండీ, మేడం పిలుస్తున్నారంటూ డాక్టర్ గారి గదిలోంచి బయటకి వచ్చిన నర్సు పిలిచింది. నేనేనండి అంటూ ఓ యువతి చేతిలో ఒక ఫైల్‌తో డాక్టర్ గదిలోకి అడుగు పెట్టింది. అది ఒక ప్రసూతి ఆసుపత్రి. డాక్టర్ శ్వేతకి గైనకాలజిస్ట్‌గా చాలా మంచి పేరుంది. వచ్చిన పేషెంట్లకు గౌరవంగా ట్రీట్మెంట్ ఇస్తుంది. పైగా నార్మల్ డెలివరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. నమస్తే మేడం అంటూ నమస్కారం చేసింది సరోజ. చెప్పండి అంటూ డాక్టర్ గారు తలపైకి ఎత్తి చూశారు. నా పేరు సరోజ మా ఆయన చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు మళ్లీ ఇప్పుడు నేను అంటూ చేతుల్లోని ఫైలు డాక్టర్ గారు చేతిలో పెట్టింది. నాకు ఇంకా ఈ పిల్లల్ని పెంచే స్తోమత లేదు. మా ఆయన సంపాదనతో మా ఇల్లు గడవడం కష్టం అయిపోతోంది. మగ పిల్లాడు అయితే అప్పో సొప్పో చేసి పెంచుకుందామని అనుకున్నాము. మళ్లీ ఈసారి కూడా ఆడపిల్ల పుడుతుంది అని స్కానింగ్‌లో వచ్చింది. అందుకని మీరు ఎలాగైనా నాకు అబార్షన్ చేయాలి అంటూ పర్సులోంచి ఓ నోట్ల కట్ట తీసి టేబుల్ మీద పెట్టింది.
దానికి డాక్టర్, అమ్మా మీరు చాలా బలహీనంగా ఉన్నారు. రక్తం చాలా తక్కువగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే, ఆడపిల్ల పుడుతుంది అనే కారణంగా అబార్షన్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. అది నీ ప్రాణాలకి ప్రమాదం. మీరు మరొకసారి ఆలోచించండి. ఒక్కసారి ఫోటో చూడండి అంటూ స్కానింగ్ ఫోటో నా చేతిలో పెట్టింది. అందులో రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నట్టుగా లీలగా ఒక బొమ్మ కనబడుతోంది. నన్ను చంపొద్దు మహాప్రభో! అన్నట్టూ చూస్తొంది అది చూసి చాలా సేపు ఏడుస్తూ ఉండిపోయింది. దీంతో డాక్టర్, 'ఒక స్త్రీకి సంతానం కలగడం అనేది ఒక అదృష్టం, ఒక వరం. అది అనుభవిస్తే కానీ ఎంత గొప్పదో మనం చెప్పలేం. పిల్లలు పుట్టించడానికి ప్రత్యేకమైన ఆసుపత్రులు వెలిసాయి. టెస్ట్ ట్యూబ్ బేబీలు సంగతి రోజు వింటూనే ఉన్నాం. మరి, సహజంగానే పుడుతున్న పిల్లల్ని మధ్యలోనే ఇలా చంపేయడం ఎంతవరకు సమంజసమ'ని ప్రశ్నించింది. కానీ, సరోజ కుదరదు మేడం అంటూ తన పరిస్థితిని వివరించి చెప్పింది. 'సరే, నీకు ఉచితంగా వైద్యం చేస్తాను. అయితే నువ్వు పుట్టబోయే బిడ్డని ఒకరికి దత్తత ఇవ్వాలి. వాళ్లు చాలా రోజుల నుంచి నా దగ్గరికి పిల్లల కోసం తిరుగుతున్నారు. వాళ్లు చాలా ధనవంతులు. బిడ్డకి లోటు రాకుండా చూసుకుంటారు. పైగా వాళ్ళు మాకు దగ్గర బంధువులు కూడా. ఆవిడకి ఉన్న లోపం కారణంగా ఎప్పటికీ పిల్లలు పుట్టరు. వాళ్లకి ఎవరో ఒకరు సంతానం కావాలి. దత్తత కూడా రిజిస్టర్ చేసుకుంటారు. ఒకవేళ పిల్ల పుట్టిన తర్వాత నువ్వు మనసు మార్చుకుంటే వాళ్లకి ఏమీ అభ్యంతరం లేదు. ఆ విషయం కూడా వాళ్ళు డాక్యుమెంట్ పరంగా రాసిస్తారు. నువ్వు మీ భర్త తోటి ఆలోచించి నిర్ణయం రేపు చెప్పు' అని చెప్పి డాక్టర్ గారు ఫైలు చేతికి ఇచ్చేశారు.
ఆటోలో ఇంటికి బయలు దేరిన సరోజ ఆలోచనలో పడింది. భర్తకి ఈ విషయం ఎలా చెప్పాలి. ఆయన ఏ రకంగా తీసుకుంటాడో. అబార్షన్ చేయించుకోవడానికి ఒప్పుకున్నాడు కానీ దత్తత అంటే ఏమంటాడో అనీ ఆలోచించుకుంటూ ఉంది. భర్త రాగానే, డాక్టర్ చెప్పిన విషయం అంత విపులంగా చెప్పింది. రామారావు మౌనంగా ఆలోచనలో పడిపోయాడు. అబార్షన్ అంటే ఒక ప్రాణిని హత్య చేయడమే. మరి దత్తత ఇవ్వడం అంటే మనకి ఆ పాప తోటి ఏ సంబంధం ఉండదు. మనం కడుపున పుట్టిన పిల్లలకి మనం తల్లిదండ్రులం కాము. మరోవైపున భార్య సరోజ కూడా చాలా బలహీనంగా ఉంది. పురుడొచ్చే వరకు మంచి పోషకాహారం మందులు ఇప్పించే పరిస్థితి లేదు. అందుకేనేమో దేవుడు ఇలా మార్గం చూపించాడు అనుకుంటూ నిద్రలోకి ఉపక్రమించాడు. మర్నాడు ఉదయమే రామారావు హాస్పిటల్‌కి వెళ్ళి సరోజని జాయిన్ చేయించాడు. డాక్టర్ గారే ప్రత్యేకత చూపిస్తుంటే మిగతా హాస్పిటల్ సిబ్బంది కూడా టైంకి అన్ని అందిస్తున్నారు. ఇలా నాలుగు నెలలు గడిచిపోయాయి. పురిటి సమయం దగ్గర పడుతోంది. సరోజలో టెన్షన్ మొదలైంది. ఈలోగా పిల్లని దత్తత చేసుకునే వాళ్లు వచ్చి అగ్రిమెంట్ మీద భార్యాభర్తలు ఇద్దరు చేత సంతకం చేయించుకుని రామారావుకి సరోజకి అది చదివి వినిపించి వెళ్లిపోయారు. ముందుగానే డాక్టర్ గారు చెప్పిన ప్రకారం పురుడు వచ్చిన తర్వాత సరోజ రామారావు దంపతులకు దత్తత ఇవ్వడం ఇష్టం లేకపోతే ఆ అగ్రిమెంట్ చెల్లదు అని రాసి సంతకాలు పెట్టి ఇచ్చారు దంపతులిద్దరూ..
ఇంతలో సరోజకి నొప్పులు వచ్చాయి. దీంతో సరోజని లేబర్ రూమ్‌లోకి తీసుకువెళ్లారు. పెద్ద పెద్ద కళ్ళు నల్లటి జుట్టు పొడుగాటి కాళ్లు చేతులు మంచి తెల్లటి రంగుతో ఆడపిల్ల పుట్టింది. రామారావు వచ్చేసరికి సరోజిని బెడ్ మీద, చంటిపిల్ల ఉయ్యాలోను నిద్రపోతున్నారు. పిల్లని చూడగానే రామారావు మనసంతా ఎటో పోయింది. పిల్ల దిష్టి తగిలేలా ఉంది. ఈ పిల్లను వదిలేసి మనం ఉండగలమా? అని ఆలోచించుంటూ రామారావు మనసంతా కకావికలం అయిపోయింది. ఇంతలో సరోజ కళ్ళు తెరిచింది. ఎలా ఉంది ఒంట్లో అని ప్రశ్నించాడు. బాగానే ఉంది, పిల్లని చూసారా అని ప్రశ్నించింది సరోజ భర్తని. దానికేం చందమామలా ఉందని చెప్పాడు. నార్మల్ డెలివరీ కావడంతో ఐదో రోజు డిశ్చార్జ్ చేసేసారు. రామారావు తల్లి, పిల్ల తో సహా డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పి వస్తుండగా, మీరు వచ్చే నెలలో రెడీగా ఉండండి. వాళ్ళు దత్తత ముహూర్తం పెట్టించుకుని కబురు చేస్తారు అని చెప్పారామె. రామారావు సరే అంటూ బయటికి వచ్చేసి తల్లినీ పిల్లని తీసుకుని ఆటోలో ఇంటికి వచ్చేసాడు.
రోజులు గడుస్తున్నాయి. చంటి పిల్లతోటి సమయం తెలియడం లేదు. పిల్ల కూడా ఒళ్ళు చేసి నుదుటిన అగరబొట్టు, బుగ్గన చుక్కతో పిల్ల మెరిసిపోతోంది. సరోజ ఆరోగ్యం రోజురోజుకూ మెరుగుపడుతోంది. కానీ సరోజ దిగులుగా ఉంటోంది. ఎప్పుడూ ఏదో కోల్పోయిన దానిలాగా ఆలోచిస్తూ ఉంటోంది. ఒకరోజు మధ్యాహ్నం రామారావు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు. ఆమెను తీసుకొని ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ పిల్లని తల్లిని పరీక్షించారు డాక్టర్. మేడం మమ్మల్ని క్షమించాలి మేము పిల్లని దత్తత ఇవ్వడం లేదు. అసలు ఆడపిల్లను గొంతు పిసికి చంపమని మీకు చెప్పినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. దత్తత తీసుకోబోయే వారి ఇంటికెళ్లి ఈ విషయం మేమే స్వయంగా చెప్తాం. క్షమాపణ కోరుకుంటాం అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఇన్నాళ్లు మీరు మా సరోజిని ఉచితంగా వైద్యం చేశారు. అందుకు ఫీజు ఈ మూడు లక్షలు తీసుకోండి అంటూ బ్యాగ్ లోంచి నోట్ల కట్ట తీసి ఇచ్చి డాక్టర్ గారిని వేడుకున్నాడు. డాక్టర్ ఆశ్చర్యపడ్డారు. కేవలం ఒక చిన్న మాటతో. తన వృత్తి పరంగా చేసిన సహాయంతో ఒక ఆడపిల్ల ఈ లోకంలోకి వచ్చింది. ఒక జీవితం నిలబడింది. చాలు అనుకుంటూ తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. దత్తత తీసుకోబోయే వారికి కూడా ఈ విషయం అంతా చెప్పి మరోచోట ప్రయత్నిద్దాం లెండి అంటూ నచ్చచెప్పారు. రామారావు భార్యని, పిల్లని తీసుకుని ఆటో ఎక్కాడు.
దారిలో సరోజ 'అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు. ఏమైనా అప్పు చేశారా నిజం చెప్పండి' అంటూ రామారావును నిలదీసింది. నేను ఎక్కడా అప్పు చేయలేదు. మన ఇల్లు అమ్మేద్దాం అనుకున్నా. అదే విషయం అత్తయ్యతో చెప్పాను. తన ఒంటి మీద ఉన్న బంగారం యిచ్చింది. 'దీన్ని అమ్మేసి హాస్పిటల్ ఫీజు కట్టు నాయనా ఎప్పటికైనా ఇది నీ పిల్లలకు ఇచ్చేదే. ఆ పసి ప్రాణం నిలబడిందంటే ఆ డాక్టర్ గారి మాట వల్లే. నాకు కూడా వయసు అయిపోయింది. నేను కూడా నా ఆస్తి ఒక మంచి పనికి ఇచ్చాను అని తృప్తితో చనిపోతాను' అని చెప్పింది. సరోజ కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి.
ఆడదానికి ఆడది శత్రువు అంటారు. కానీ ఒకరు కాదు ఇద్దరు స్త్రీలు చేసిన సహాయంతో ఒక ప్రాణం నిలబడింది. దేవుడు ఎక్కడో ఉండడు. మనుషుల్లోనే ఉంటాడు అంటూ రామారావు పిల్లకి నామకరణ మహోత్సవం ఏర్పాటు చేసుకుని డాక్టర్ పేరు, సరోజ సవతి తల్లి పేరు కలిపి వచ్చేలా శ్వేత ప్రసూన అని పేరు పెట్టాడు. ముగ్గురు ఆడపిల్లలను చూసి నాకు ముగ్గురు మహాలక్ష్మిలు అంటూ ఆనందంగా కాలం గడపసాగాడు.
మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ
94917 92279