స్త్రీల విషాద లైంగిక గాథల ‘స్టోమా’

Stoma Book Review

Update: 2024-07-29 06:16 GMT

తులసి బొడ్డుకు కుడి పక్కన రంధ్రం నుంచి పచ్చని స్టోమా బ్యాగ్ వేలాడుతోంది. ఆ సంచి నిండా చేరిన మలాన్ని కమ్మోట్ లో పిండేసి, ఫ్లష్ చేసేసింది. ఉబ్బెత్తు అంచులతో లోపల ఎర్రని మాంసంలా పేగులు కనిపిస్తూ, ఆరంధ్రం భయపెడుతోంది. తడవకు అయిదారు కుట్లతో అయిదుగురు పిల్లల్ని కని ముప్ఫై ఏళ్ళు దాటాక ‘‘లూజ్ అయిపోయావు, మొగుడుకోసం రెండు కుట్లు వేయించుకోలేవా?’’ అంటూ కృష్ణారావు రోజూ నరకాన్ని చూపిస్తున్నాడు. బలవంతంగా డాక్టరమ్మ వద్దకు తీసుకెళితే, వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని హడావిడిగా కుట్లేయటంతో ఆపరేషన్ ఫెయిలైంది. మూత్రానికెళితే యోని నుంచి మలం వచ్చేస్తోంది. గ్లోబల్ ఆస్పత్రిలో పెద్దాపరేషన్ చేసి స్టోమాబ్యాగ్ అమర్చారు. ఇక బతికినంత కాలం దాన్ని మోయాల్సిందే. వాసనంటూ అందరూ అసహ్యించుకుంటూ ఒకగదిలో పడేశారు. ‘‘సెక్స్‌కు ముందు సంచీ ఖాళీ చేసి ఏడువు’’ అంటాడు. ఒక వైపు స్టోమా నొప్పి, మరొక వైపు చిట్లిపోతున్న వెజైనా నొప్పి. ఆ రాత్రి తనస్టోమా బ్యాగ్‌ను నిద్రపోతున్న అతని ముఖాన పిండేసి, అతని ముఖానే విసిరి కొట్టేసి, అరచేత్తో రంధ్రాన్ని మూసేసుకుని వెళ్లిపోతుంది. గీతాంజలి రాసిన ‘స్టోమా’ స్త్రీల విషాధ లైంగిక గాథల్లో కదిలించే కథ ‘స్టోమా’.

పెద్దబాల ‘శిక్ష’

ఆదిత్య, అలేఖ్యలకు పెళ్లై ఏడాదైనా, రాత్రి అతన్ని దగ్గరకు రానివ్వదు. ‘‘నిన్ను బాధపెట్టిన, అవమానపరిచిన సంఘటనలన్నీ నోట్ బుక్‌లో రాయి.’’ అని సైకో థెరపిస్ట్ డాక్టర్ సోఫియా సలహాతో రాస్తుంది. ‘‘నాన్న, నన్ను అమ్మని వీధి చావిళ్లలో కూర్చోనిచ్చేవాడు కాదు. నాన్న ఊరికి వెళ్లి తిరిగి వచ్చేటప్పటికీ, అరుగు మీద అమ్మా నేను ఆంటీలతో ముచ్చట్లతో ఉన్నాం. నాన్న వచ్చీరాగానే ‘లోనికి తగలడండి’ అన్నాడు. అమ్మకి, నాకు అట్లకాడ కాల్చి వాతలు పెట్టాడు. పది పన్నెండేళ్ల వయసులో అన్నయ్య నా కాళ్ల మీద వాడి కాళ్లేసి పడుకున్నాడని ఒంటిపైన దెబ్బలు పేలిపోయాయి. రమాకాంత్ నాతో పాఠం చెప్పించుకున్నాడని నాన్న వాడి చేత వాడి చెప్పుతో నా చెంప మీద కొట్టించాడు. ‘మగాళ్లతో మాట్లాడను’ అంటూ 2000 సార్లు నాతో రాయించాడు. ‘మీ తాతయ్య కూడా మీ నాన్న లాగే నానమ్మను అవమానించాడు. అది తట్టుకోలేక ఆమె వేరే అతనితో వెళ్లిపోయింది. ‘ఒంటి మీద వెంట్రుకలున్న ఆడదానికి కామం ఎక్కువ’ అని పెద్దబాలశిక్షలో రాసిందట.’ అంటూ సుమనత్తయ్య చెప్పింది. అమ్మకే కాదు, నాక్కూడా కాళ్ల మీద వెంట్రుకలున్నాయి, డిగ్రీ పూర్తయ్యే లోగా మరొక సమస్య. అబ్బాయిల దగ్గరకు వెళ్లి నగ్నంగా వాళ్లతో శృంగారంలో పాల్గొంటున్నట్టనిపించేది.’’ అని అలేఖ్య రాసి చూపించింది. ‘‘నీకున్నది జబ్బు కాదు. మీ నాన్న నీతో వ్యవహరించిన తీరు వల్ల వచ్చిన అసహజ లైంగిక ప్రవర్తన.’’ అంది డాక్టర్ సోఫియా. కౌన్సిలింగ్ మొదలు పెట్టడంతో అలేఖ్యకు సాంత్వన చేకూరుతోంది. పుచ్చిపోయిన మూఢనమ్మకాల పెద్దబాలశిక్ష ఎందరికిలా శిక్ష విధించిందో చెప్పే అద్భుతమైన మానసిక విశ్లేషణ ‘పెద్దబాలశిక్ష’ కథ.

వెలుగును చూపే ఆకాశం ‘ఫలక్’

‘‘నాకూ అమ్ముండేది. మా అమ్మ తప్పిపోయింది.’’ అంది ఏడేళ్ల చిన్ని. ‘‘మాయమ్మ నాకు పెరుగన్నం పెట్టేది తెలుసా’’ మరొక పాప. ‘‘నాకు మా అమ్మ పప్పన్నం నెయ్యేసి తినిపించేది’’ ఇంకో పాప. ‘‘నాకు అమ్మే తప్ప నాన్న లేడు’’ మరొక చిన్నారి. ‘‘ఏమో మా అమ్మను జైల్లో వేశారంట. మా అమ్మకు చచ్చిపోయే జరం వస్తుందంట.’’ ఇంకో పసిగొంతు. ‘‘చిట్టెమ్మ నాక్కూడా వాతలు పెట్టింది చూడు గలీజ్ పనులు చెయ్యనందుకు’’ అంటోంది గాయత్రి. ‘‘రాత్రి బట్టలేసుకుంటే కొడతారు. ఆంటీల దగ్గరకు అంకుల్స్ వస్తారు కదా. వాళ్ల గదిలోనే ఉండి వాళ్లు బట్టలిప్పుతుంటే కూర్చుని చూడమంటారు. చూడకపోతే వాతలు పెడతారు’’ అంటోంది ఫలక్. సెక్స్ రాకెట్ బట్టబయలై ఆ వ్యభిచార గృహంలో దొరికిన పిల్లలంతా. చిల్డ్రన్ హోంలోకి చంద్రిక వెళ్లగానే ఫలక్ పరిగెత్తుకుంటూ వచ్చి ‘‘నువ్వేనా మా అమ్మవి. నన్ను తీసుకెళ్లు’’ అంది. ఫలక్‌ను దత్తత తీసుకున్నారు చంద్రిక, ప్రభాకర్. ఫలక్‌ను తీసుళుతుంటే చెట్టు కింద కూర్చున్న పిల్లలందరినీ చూపిస్తూ ‘‘వాళ్లకీ అమ్మలు కావాలి’’ అంది. ‘‘పేరుతో తురక పిల్ల అని తెలుస్తోంది. పేరైనా మార్చరా..పెద్ద అప్రాచ్యపు పనిచేశావు కానీ’’ అంది ప్రభాకర్ తల్లి. ‘‘ఫలక్ అర్థం తెలుసా? నక్షత్రాలు వెదజల్లుతూ చీకటిలో వెలుగును చూపే ఆకాశం’’ అన్నాడు ప్రభాకర్. ‘మానాన్నెందుకు మంచోడంటే’ కన్నీళ్లు తెప్పించే కథ.

‘యూ బిచ్... మాస్క్ పెట్టవే’

రంగారావుకు ఆడపిచ్చి. అతనితో కాపురం చేయలేక శాంత ముగ్గురాడపిల్లల్ని తీసుకుని హైదరాబాదు వచ్చేసి, బిస్కెట్ ఫ్యాక్టరీలో చేస్తూ, కర్రీ పాయింట్ పెట్టుకుంది. చివరి కూతురి పెళ్లి కోసం రంగారావును తన ఇంట్లోకి రానిచ్చింది. ‘‘ఇదేం పతివ్రతా..పచ్చి కులట. ఎంత మందితో పోకపోతే సిటీ కొచ్చి ముగ్గురాడ పిల్లల్ని చదివిస్తుందిదీ? షీ ఈజ్ ఏ బిచ్, దీనికిస్తావా నా ఆస్తి’’ అన్నాడు తల్లితో. ‘బజారు ముం..లం..’ తప్ప పేరు పెట్టి పిలవడు. సగం దేహం చచ్చుపడినా, ఆక్సిజన్ లేనిదే ఊపిరాడకపోయినా, శ్వాస కోసం పూర్తిగా శాంత మీద ఆధారపడినా రంగారావు భార్యపైన పెత్తనం చెలాయిస్తున్నాడు. ‘‘యూ బిచ్ మాస్క్ పెట్టవే’’ అని అరుస్తున్నాడు. ఊపిరి పొయ్యమని బూతులతో గద్దిస్తున్నాడు. మాస్క్‌ను రంగారావు ముక్కు దగ్గరకు తీసుకెళ్లి చటుక్కున వెనక్కి లాగేసుకుంది. అంతే.. ఊపిరాడక గిజగిజలాడుతూ.... రంగారావు వంటి శాడిస్టులకు తగిన పరిష్కారం చూపించిన కథ ‘ఆక్సిజన్’.

కర్ర పరిష్కారం

‘‘ఎవరిని మరిగావే ముండా రా..దగ్గరికి రమ్మన్నానా’’ రామనాథం దగ్గరకు వెళితే బూతుపురాణం. తుపుక్కున ఊస్తాడు. లేపడానికి వచ్చిన కళావతిపైన కర్రతో చావకొడతాడు. చెయ్యి అందిస్తే కూచుంటాడు. కుడిచేత్తో పిడిగుద్దులు గుద్దుతాడు. పనిచేస్తున్న ఒక్కకాలితో తంతాడు. పక్కలోకి రానందుకు తన్నులు, బూతులు. అందరితో అక్రమ సంబంధాలు అంటగట్టేశాడు. ఒంటినిండా సుఖరోగాల పుండ్లు. ‘‘అమ్మో ఓర్నాయనోయ్’’ అంటూ రామనాథం కళ్లు తెరిచాడు. ఎదురుగా కళావతి ఎర్రబడ్డ కళ్లతో, చేతిలో ఊత కర్రతో కొడుతూనే ఉంది. రామనాథం అరుస్తూనే ఉన్నాడు. డాక్టరమ్మ చెప్పిన సలహాను పాటించడంతో కళావతికి భయం పోయింది. ‘కర్ర’ కూడా ‘ఆక్సిజన్’లా పరిష్కారం చూపించిన కథ. ఇలా పద్నాలుగు భిన్నమైన కథలు. ‘హస్బెండ్ స్టిచ్’ కొనసాగింపే ‘స్టోమా’ కూడా మారిటల్ సైకో థెరఫిస్టుగా గీతాంజలి వద్దకు వచ్చిన రోగుల జీవితానుభవాలే.

పుస్తకం : స్టోమా

రచన : గీతాంజలి(డాక్టర్ భారతి)

పేజీలు : 160

వెల : 150

ప్రతులకు :

గీతాంజలి - 8897 791964


సమీక్షకులు

రాఘవ

94932 26180

Tags:    

Similar News

అమరత్వంపై