విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్ పట్టాకోసం జరిగే పరిశోధనలు, సిద్ధాంత వ్యాస సమర్పణతో ముగుస్తాయి. అవి ముద్రణకు నోచుకోని గ్రంథంగా మిగిలిపోతాయి. అట్ల గాని సిద్ధాంత వ్యాసాలు అనేకం. రాకపోవడానికి కారణాలు కూడా అనేకం. పరిశోధనా గ్రంథాలు చదువరులకు చేరడం కష్టం. అలా చేరని గ్రంధాల విశిష్టతను, సమర్థతను ప్రామాణికతను, విషయ ప్రాధాన్యతను పదిమందికీ అందించాలనే ఆలోచన డాక్టర్ అట్టెం దత్తయ్యలో పురుడు పోసుకుంది. ఫలితంగా 'సారాంశం పరిశోధన గ్రంథాలు - పరిచయ వ్యాసాలు' రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. ఈ రూపం సంతరించుకోవడానిక ఆర్థిక సహకారం అందించినవారు ధ్రువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దుండె లక్ష్మణ్ (అమెరికా), అధ్యక్షులు దుండె మల్లేశ్.
అనుకున్నదే తడవుగా చేయడానికి ఇది ఒకరిద్దరు చేసే పని కాదు. పదుగురితో కూడిన పని. చేయడానికి కావలసినది సమన్వయ సమర్థత. దక్షుడు దత్తయ్య. దానికి సాక్ష్యంగా 110 వ్యాసాలతో కూడిన 1200 పేజీలు. ముద్రణకు నోచుకున్న సిద్ధాంత గ్రంథాల పరిచయంలో ఏకరూపత కోసం పది అంశాలను వ్యాసకర్తలకు అందించాడు. ఈ వ్యాసాలు మూలగ్రంథాల రుచిని చవిచూసాయి. అది ప్రణాళికా విశిష్టత. వ్యాసకర్తల సమర్థత. ఈ వ్యాసాలు సిద్ధాంత వ్యాస నడకను చూపెట్టాయి. విశ్వవిద్యాలయాల బయట జరిగిన పరిశోధన, సాహిత్య చరిత్ర రచన, ప్రక్రియ ప్రయోగాలు సిద్ధాంత వ్యాస రచనపై ప్రభావం చూపాయి. ఆ మేరకు అవి విశ్వవిద్యాలయ పరిశోధనల వల్ల పరిపూర్ణత పొందాయి. ప్రక్రియాపరంగా సాగిన పరిశోధనలు, ఆయా రంగాల్లో మొదటి సిద్ధాంత వ్యాసాలుగా గణతికెక్కాయి.
సకల వాదాల సమగ్ర 'సారాంశం'
మొదటగా తమ కళ్ల ఎదుట కనబడుతున్న సృజన సాహిత్యం పరిశోధకులను ఆకర్షించింది. పరిశోధకులు తమ అభిరుచి మేరకు ప్రక్రియాపరమైన సాహిత్యాన్ని పరిశోధించారు. వచన, శతక వాజ్ఞ్మయము, గేయ, వ్యాకరణ, విమర్శ, నాటక, పీఠిక, యాత్రాచరిత్ర, లేఖ, నవల, లలితగీత, కథ మొదలైన ప్రక్రియాపరమైన సాహిత్య పరిశోధనలు కనిపిస్తాయి. కావ్యాలు, ప్రబంధాలు, ఇతిహాసాలపై గల భక్తి శ్రద్ధలు వాటిపై పరిశోధనలకు పురికొల్పాయి. అవి అనేక రీతులుగా సాగాయి. ఆ తర్వాత ఆధునిక సాహిత్యంపైకి దృష్టి మరలింది. ఇందులో కవిత్వంపై పరిశోధన సింహభాగం ఆక్రమించింది. వస్తు దృష్టిలో కొన్ని నిర్మాణ దృష్టిలో కొన్ని, పరిణామ దృష్టిలో కొన్ని పరిశోధనలు వచ్చాయి. ఈ కోవలోని గ్రంథాలు భావి తరాలకు దిశా నిర్దేశం చేశాయి. నన్నయ నుంచి నేటివరకు తమ సృజనతో ప్రగాఢ ప్రభావం వేసిన రచయితలు ఎందరో ఉన్నారు. ప్రభావశీలురుగా, యుగకర్తలుగా, ప్రయోగశీలురుగా, భావజాల ప్రతినిధులుగా ఆయా రచనా ధోరణికి ఆద్యులుగా, వాటిని సంపద్వంతం చేసిన సృజనశీలురుగా, సాహిత్యోద్యమం జీవులుగా తమ తమ వ్యక్తిత్వ ప్రాభవాలచే ముద్రలు వేసినవారున్నారు. వారిపై తదనంతర పరిశోధనలు జరిగాయి. కాలక్రమంలో అస్తిత్వ కాంక్షలు సమాజాన్ని ఊపిరి సలపనివ్వకుండా ప్రభావితం చేశాయి. విప్లవ, స్త్రీ, దళిత, బహుజన, మైనారిటీ, బహుజన కాంక్షలు సృజన సాహిత్యాన్ని కొత్తపుంతలు తొక్కించాయి. వీటిపై పరిశోధనలు జరిగాయి. వీటన్నింటి సారాంశం ఈ గ్రంథాల్లో కనపడుతుంది. విశ్వవిద్యాలయాలు ఆయా జిల్లాల్లో వచ్చిన సాహిత్యాన్ని ప్రత్యేక దృష్టితో పరిశోధనకు పెట్టింది. ఆ విశిష్టతలు కూడా 'సారాంశం'లో చోటుచేసుకున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలు, పునరుజ్జీవనోద్యమాలు, భాషా వికాసాలు, సాయుధ పోరాటాలు, శాసనాలు, జ్యోతిష్యం, మనో వైజ్ఞానికత, తొలి మలి తరం సాహిత్యం, రచనలపై ప్రభుత్వ ఆంక్షలు, ప్రపంచీకరణ మొదలైన అభిరుచులలో సాహిత్యాన్ని పరిశోధించి అంచనా కట్టడం కూడా జరిగింది. ఇదంతా 'సారాంశం'లో నమోదయింది.
పరిశోధనా వ్యాసాలకు టార్చి లైట్
'సారాంశం' సంపుటాల్ని చదువుతున్నప్పుడు గ్రంథరూపంలోని ఈ సిద్ధాంత వ్యాసాల గురించి మనసు కొట్టుకుంది. గ్రంథ రూపంలో ఉండి సారాంశంకు అందని పరిశోధనలు గుర్తుకొచ్చి బాధకలిగింది. రాస్తాను అని రాయకపోవడం, రాసి సమయానికి ఇవ్వకపోవడం వల్ల కూడా 'సారాంశం' సమగ్రం కాలేకపోయింది. అసంపూర్ణం అనేది పరిశోధన లక్యం,. దానికెప్పుడు కొనసాగింపే ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన పరిశోధనాంశాల్ని క్లుప్తంగా పరిచయం చేస్తూనో, ఒక టార్చిలైట్‌ను ఇచ్చినట్లవుతుంది. గతంలో తెలుగు అకాడమీ వారు, సీపీ బ్రౌన్ అకాడెమీ వారు, వెల్దండి నిత్యానందరావు గారు ఈ పని చేశారు. దాని కొనసాగింపుగా మరొక ప్రయత్నం జరగాల్సి ఉంది. ఆచార్య జీఎస్ మోహన్ అందించిన 'పరిశోధన స్వరూప స్వభావాలు' అనే వ్యాసం ఈ సంపుటాలకు వెన్నెముకగా నిలిచింది. పరిచయకర్తలు విమర్శ చాటున నడిచినవారు. సమీక్ష మార్గం చూపినవారు. ఏకరూపకత కోసం సంపాదకుడు పరిచిన దానిని మరింత విశాలం చేసిన వారు కొందరైతే ఆ దారిని విడవని వారు మరికొందరు. మొత్తానికి పరిచయ కర్తలు అభినందనీయులు. దత్తయ్య దక్షుడు కనుక 'సారాంశం' అవసరమైంది. ప్రచురణకర్తలకు కృతజ్ఞతలు.
- డా. బీవీఎన్ స్వామి
92478 17732