రాకెట్ కుర్రాళ్లు... అరుదైన సైన్స్ పుస్తకాలు
Rocket Boys... Rare Science Books
అందర్లానే చిన్నప్పుడు నాలో కూడా ఓ పిల్ల సైంటిస్టుండేవాడు. అన్నీ తెలుసుకోవాలనుకునేవాడు. కానీ ఏం చేస్తాం. కారణాలు మనకు తెలిసినవేగా. నా తొమ్మిదో తరగతిలో నాలో సైంటిస్టు తీవ్రస్థాయికి చేరుకున్నాడు... అప్పుడు నా లక్ష్యం నాకన్నా ఓ పదేళ్లు పెద్దున్న నా మిత్రశతృవు... ఆ ఎదురింటి నాగరాజు మీద ప్రతీకారం తీర్చుకోవడమే... బొబ్బాసి కాయలు, సపోటాకాయలు, ఉసిరికాయలు, మామిడికాయలు, నారింజకాయలు, సీమచింతకాయలూ కలిసి న్యాయంగా పంచుకుని తిన్న మా మిత్రత్వం దీపావళి పేక తారాజువ్వల మందు తయారీ, ఆ తారాజువ్వ తయారుజేయడానికి కావలసిన పుల్ల టెక్నాలజీని ఇచ్చిపుచ్చుకోవడం దగ్గర శతృత్వంగా మారింది. అతను ఆ మందు, ఆ పుల్ల ఇవ్వడానికి నిరాకరించాడు... సో నాకిక ఒకటే మార్గం... ఆ మందు నేనే సొంతంగా తయారుచేసి, ఆ పుల్లతయారు చేసి ఆ ఎదురింటి నాగరాజు సాయం లేకుండా చాలెంజ్ సినిమా చివర్లో రావుగోపాలరావు ముందు చిరంజీవిలా పేక తారాజువ్వెగరేసి నన్ను నేను నిరూపించుకోవాలి... ఆ తెలియని కొత్త సిటీలో ఆ తెలియని మందు సీక్రెట్ కనుగోవాలి...
సో... ఉన్న కొద్దిమంది గుంటబచ్చాగాళ్లతో కలిసి స్పీల్‌బర్గ్ సినిమాల్లో పిల్లల్లా ఆ అడ్వంచర్‌కి పూనుకున్నాం... స్కూలు ఎగ్గొట్టి మరీ ఆ మందు సీక్రేట్స్ కనుక్కుని మా పాకను ఒక ల్యాబ్ చేసేసాం... సూరేకారాలు ఉడకబెట్టి నూరడం, గంధకం, జిల్లెడుకర్రలు (ఏ కర్ర కాల్చాలి అనేదానిపై పెద్ద శోధన) కాల్చి బొగ్గు తయారీ, తరవాత ఏది ఎన్నెన్ని పాళ్లు కలపాలి అనేదానిపై తీవ్రాతి తీవ్ర చర్చలు, కొందరు పెద్దల సలహాలు లాంటి రకరకాల అడ్వంచర్స్ చేసి, చాలామందితో నానా తిట్లు తిని... ఒకటే జననం.. ఒకటే మరణం లెవల్లో ఒక బ్యాగ్రౌండ్ సాంగేసుకుని ఆఖరుకి దీపావళి తారాజువ్వెగరేసి ఆ నాగరాజు మీద విజయం సాధించాం... ఆ రాకెట్ ఎగిరిన క్షణంలో మేం కొట్టిన చప్పట్లు, గెంతిన గెంతులు..మా ఆనందం వెల కట్టలేనిది...అదో పెద్ద కథ... అది కేవలం ఆ నాగరాజన్న మీద విజయమే కాదు... ఇంకేదో తెలియని దేదో సాధించామనే ఆనందం... నా లైఫ్‌లో నాకు బాగా గుర్తుండిపోయే, బాగా నచ్చిన పార్ట్ అది...
అది జరిగిన కొన్నాళ్లకి స్టార్ మూవీస్‌లో రాత్రి ఏ సినిమా వచ్చినా చూసేసేవాన్ని... ఎక్కడో దగ్గర ఫైటింగులుండకపోతాయా అని... అలా ఒక రోజు వచ్చిన సినిమా October sky. అది Rocket తయారుచెయ్యాలనుకునే ఓ నలుగురి పిల్లల సినిమా... ఇంగ్లీషు అర్ధం కాకపోయినా ఆ సినిమా నన్ను తీవ్రంగా ఆకట్టుకుంది... ఒక రాకెట్ తయారు చెయ్యడానికి వాళ్లు పడ్డ తిప్పలు చిన్న పేకతారాజువ్వలు చేయడానికి మేం పడ్డ తిప్పల్ని గుర్తుకు తెచ్చాయి... సైన్స్ ఉత్సాహవంతులు ఈ October sky సినిమాను మిస్సవ్వద్దు... స్కూళ్లలోగాని కాలేజీలలోగాని ఫిజిక్స్ మేథ్స్ కెమిస్ట్రీలు చెప్పెప్పుడు వాటిని కేవలం పాఠాల్లా చెప్పారే గాని అవి ఎందుకు ఎక్కడ ఎలా పని చేస్తాయని ఎవరూ చెప్పేవారు కాదు... సో ఎవడికీ అవి అర్థమయ్యేవి కావు...
డిగ్రీలైపోయిన చాలా రోజులకి కొందరు కమ్యునిస్టు పెద్దల సావాసం వల్ల అసలు సైన్స్ అంటే ఏంటి అని తెలిసాక, ఐజాక్ అసిమోవ్ రాసిన 'రసాయనశాస్త్ర చరిత్ర', ఫెర్మిలావ్ రాసిన 'నిజజీవితంలో భౌతికశాస్త్రం' లాంటివి చదివాక జరిగిన అన్ని విషయాల్ని పునరాలోచన చేసుకున్నాక చాలా విషయాలు అర్ధమయ్యాయి... మేం తయారుచేసిన మందులోనే కెమిస్ట్రీ ఫార్ములాలు.., ఆ చుట్టిన పేకముక్క ఆకారం, దానికి కట్టిన చీపురుపుల్లలోనే ఫిజిక్సు సూత్రాలు ఉన్నాయని అర్ధమయింది... YouTubeలో Royal society, MIT వాళ్ల క్లాసులు కొన్ని చూశాను.. ఆ క్లాసుల్లో ప్రొఫెసర్లు మేం చిన్నప్పుడు చేసిన ప్రయోగాల్లాంటివే చేసి పిల్లలకి పెద్దలకి సైన్సు చెబుతున్నారు... వార్నీ అనుకున్నా...
'రాకెట్ కుర్రాళ్లు' అనే ప్రస్తుత పుస్తకంలో ఐఐటీ చెన్నయ్ ప్రొఫెసర్ డా. వి శ్రీనివాస చక్రవర్తిగారు 3 సైన్సు సినిమాల కథల గురించి వివరంగా రాశారు...
1) OCTOBER SKY సినిమా.
2) ప్రఖ్యాత కార్ల్ సెగన్ రచించిన CONTACT ఆధారంగా తీశారు.. SETI (Search for Extra Terrestrial Intelligence) కు వచ్చిన గ్రహాంతర జీవుల సిగ్నల్స్ కు సంబందించిన సినిమా.
3) AWAKENINGS అనేది వైద్యరంగానికి సంబందించిన సినిమా. ఈ కథల్ని తెలుగులో అందరికీ అర్ధమయ్యేలా రాశారు.
వీటిలో OCTOBER SKY, AWAKENINGS అనేవి నిజ జీవితాలకి సంబంధించిన సినిమాలు...
పుస్తకం కథ
అమెరికాలో, అర్ధ శతాబ్ద కాలం క్రితం ఒక మారుమూల గ్రామంలో, ఒక చిన్న పల్లె బడిలో ఒక పిల్లవాడు కనబరిచిన పట్టుదల వల్ల ఆ బడి మాత్రమే కాక ఆ గ్రామం అంతా ఎంతగానో ప్రభావితం అయ్యింది. 1957లో స్ఫుట్నిక్ అనే మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహాన్ని రష్యా లాంచే చేసిందన్న వార్తకి స్పందిస్తూ ఆ పల్లె బడికి చెందిన నలుగురు పిల్లలు తామే ఒక రాకెట్‌ని నిర్మించాలని బయలు దేరతారు. ఏ వనరులూ, వైజ్ఞానిక నేపధ్యమూ లేని ఆ పల్లెలో, ఆ పిల్లలు అష్టకష్టాలకు ఓర్చి, ఎన్నో విఫల ప్రయోగాలు చేస్తూ, అంచెలంచెలుగా తమ రాకెట్ డిజైన్‌కి మెరుగులు దిద్దుతూ, చివరికి ఒక చక్కని రాకెట్ నిర్మించగలుగుతారు. ఆ రాకెట్‌కి ఆ బృందానికి జాతీయ స్థాయిలో మొదటి బహుమతి లభిస్తుంది. వీరి కథ పుస్తకంగానే కాక సినిమాగా (October Sky) కూడా వచ్చి ఎంతో ఆదరణ పొందింది. నేతృత్వం గురించి, టీం బిల్డింగ్ గురించి ఈ వృత్తాంతం నేర్పే పాఠాలు బడి పిల్లలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. గణితం, విజ్ఞానంతోపాటు నేతృత్వ నైపుణ్యాలు కూడా బడి స్థాయిలోనే పిల్లలకి నేర్పించాలనే ఆలోచనతో బడి పిల్లలకు స్ఫూర్తిని ఇచ్చే కథను ఈ పుస్తకం చెపుతుంది.
బాక్స్ ఐటమ్
పుస్తకం : రాకెట్ కుర్రాళ్లు
రచయిత - డా. శ్రీనివాస చక్రవర్తి
వెల - రూ. 35.00
ప్రతులకు - manchipustakam.in
సమీక్షకులు
- సి. హెచ్ జగదీష్ నాని
Science for Better Society
93926 55855