బోల్షివిక్ విప్లవంలో లెనిన్, స్టాలిన్‌ల నాయకత్వంలో స్వయంగా పాల్గొన్న ఐసెన్ స్టీన్ తీసిన ‘స్ట్రైక్’, ‘బ్యాటిల్ షిప్ పొటేమ్కిన్’, చైనాలో 1930లో జరిగిన వాస్తవగాథ ఆధారంగా మహిళలు కథానాయికలుగా చిత్రించిన The Red Detachment of Women, మొదలుకొని కోవిడ్-19 నేపథ్యంగల ‘ది లాక్ డౌన్’, అట్టడుగు వర్గాల కోసం అంబేద్కర్ చేసిన కృషిని తెలిపే “ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్: ది అన్ టోల్డ్ ట్రూత్’ కశ్మీర్ ప్రజల పోరాటానికి అద్దం పట్టే ‘జప్న్ -ఎ-అజాది’ వరకూ ‘23 సినిమాలు, 6 డాక్యుమెంటరీలు కలిపి మొత్తం 29 చిత్రాల సమీక్ష ఈ పుస్తకం. చలం చెప్పినట్టు All is well with the world అనుకుంటూ నిద్రపోయేవారికి ఇవి నచ్చకపోవచ్చు. అన్యాయాలను ప్రజలు ఐక్యంగా ఎదుర్కోవడం కాకుండా దుష్ట శిక్షణ కోసం దిగివచ్చిన అవతార పురుషుడిలా హీరో వచ్చి దుష్టసంహారం చేయడం, హీరో హీరోయిన్ల కుప్పిగంతులూ, లేకి చేష్టలూ ద్వంద్వార్ధాల సంభాషణలూ, చవకబారు హాస్యం, ఉన్న సినిమాలకు అలవాటు పడిన మనకు ‘ఇంత గొప్ప సినిమాలున్నాయా! అని ఆశ్చర్యం కలుగుతుంది ఈ ‘రియలిస్టిక్ సినిమా’ పుస్తకం చదివితే. మన సినిమాల డొల్లతనం వెల్లడవుతుంది. పుస్తకం పూర్తయేసరికి ఇందులోని సినిమాల గురించి తహతహ మొదలై ఇంటర్నెట్ లో అన్వేషణ మొదలు పెడతాం.
శివలక్ష్మి గారు ‘ప్రపంచాన్ని కదిలించిన వివిధ దేశాల సినిమాల గురించి’ వివిధ పత్రికలలో రాసిన సమీక్షలను ఈ పుస్తకంగా ప్రచురించారు. వీటిలో 35 నిమిషాలనిడివి గల ‘From Fear to Freedom ending violence against women’ మొదలుకుని రెండుగంటలకి పైగా నిడివిగల ‘The Dawns here are Quiet’ సినిమాలున్నాయి. అన్నీ ప్రతిభావంతులైన దర్శకులు తీసిన సినిమాలే. సమీక్షలకు ముందు ఆయా సినిమాలకు సంబంధించిన ఛాయా చిత్రాలను ముద్రించారు. రష్యా, చైనా, ఇటాలియన్, జర్మనీ వంటి వివిధ భాషలలో, ఏయే సంవత్సరాలలో వచ్చాయో, ఆ ఇతివృత్తాల చారిత్రిక నేపథ్యం, వాటికి ఏయే అవార్దులు వచ్చాయో వివరంగా చెప్పారు. వీటిలో నవలలు, వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన ‘Two Women’ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. అన్నింటికీ సబ్ టైటిల్స్ ఉన్నాయి. అన్నీ ఆణిముత్యాలే, అపురూపమైన కళాఖండాలే. అవార్డు చిత్రాలే. మానవతా విలువలను స్థాపించే సినిమాలే. తాను ఈ సినిమాలను ఎప్పుడు, ఏ సందర్భంలో చూసారో కూడా చెప్పారు. ఇన్ని సినిమా సమీక్షలను ఏక బిగిన చదివే కంటే ఆ సినిమాలను సంపాదించి వాటిని చూసేముందు చదివితే సినిమా గొప్పతనం తెలుస్తుంది.
టాకీ అంటే తెలియని నిశ్శబ్దయుగంలో సోవియట్ యూనియన్ నుంచి 1925లో వచ్చిన అద్భుతమైన మూకీ చిత్రం ‘Battleship Potemkin’. 1905 నాటి రష్యన్ చరిత్రకి సంబంధించిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా ఇది. అక్టోబర్ విప్లవానికి నాంది పలికిన సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చిత్రించిన చిత్రమిది. దీని డైరెక్టర్ ప్రపంచ ప్రఖ్యాత సోవియట్ చలన చిత్ర నిర్మాత సెర్గీ మిఖాయ్లోవిచ్ ఐసెన్ స్టీన్ గొప్పతనం తెలిపే విషయాలు చాలా ఉన్నాయిందులో. ఐసెన్ స్టీన్ సినిమా ప్రభావంలో ఉన్న లెనిన్ “హాలీవుడ్ ను ఒక సంవత్సరం మా చేతుల్లో ఉంచండి. ఆ సమయంలో ప్రపంచమంతా సోషలిజం మయం చేస్తాం” (పే.74) అని అన్నాడట. రచయిత్రి ఈ సినిమా డైరెక్టర్ గురించి చెబుతూ “మాములుగా ఒక కథానాయకుడు, ప్రతినాయకుల మధ్య భీకర పోరాటాలు, నాయికా నాయకుల శృంగారసన్నివేశాలు ఇత్యాది వండిన వంటలతో కాకుండా వాస్తవికమైన నిత్య జీవిత విశేషాలతో చిత్రీకరించవచ్చని భావి తరాలకు మంచి హెచ్చరిక చేశాడు” అంటారు.
లెనిన్ నాయకత్వంలో ప్రజలు జార్ చక్రవర్తిపై తిరుగుబాటు చేసి కార్మిక కర్షక రాజ్యాంగ యంత్రాంగాన్ని స్థాపించిన సినిమా ‘October’ (Ten days that shook the world). అసలు, దొంగలేకాని ప్రజల్ని దొంగల్ని చేస్తున్న ఫాసిజాన్ని తెరకెక్కించి, ప్రత్యక్షంగా కనిపించని సమాజ పరోక్ష శత్రువుని చూపించే సినిమా ‘Bicycle Thieves’. పనికి మాలిన యుద్ధాలతో, ఆయుధ కొనుగోళ్ళతో ప్రజలకు కూడూ గుడ్డా లేకుండా పేదరికంలోకి నెట్టిన నిజమైన శత్రువు ‘ఫాసిజం’ అని ఈ సినిమాలో రుజువు చేస్తాడు డైరెక్టర్. “మెరుగైన సమాజం రావాలంటే దేశంలో సృష్టించబడుతున్న సంపదని ప్రజలందరికీ సమానంగా పంపిణీ చెయ్యాలనే సందేశం ఇచ్చిన దాని కంటే గొప్ప సినిమా ఏముంటుంది?”
2000సం.లో 120 కిలోల మెర్క్యురీని కొరొపాంపా అనే గ్రామంలో ఒలకబోస్తే ఆ గ్రామ ప్రజలు గుడ్డివాళ్లైపోయిన, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్మార్గాన్ని వెలుగులోకి తెచ్చిన పెరూ దేశం సినిమాయే‘అల్టిప్లానో’. ప్రపంచ వ్యాప్తంగా బాలికలూ మహిళలూ ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని కళ్ళముందుంచే ‘‘From Fear to Freedom ending violence against women’ వంటి సినిమాలు రావడం అభినందనీయమే కానీ పుట్టమీద కొడితే పాము చావనట్టు ‘మూల కారణమైన పెట్టుబడి గురించి మాట్లాడకపోతే ఈ ఎన్ జీ వో సంస్థల కృషి సఫలం కాదు. ఇంకో అద్భుతమైన సినిమా సత్యజిత్ రే నిర్మించిన ‘పథేర్ పాంచాలి’. ఇందులో ప్రముఖ పాత్ర ఇందిర్ ఠాక్రూన్. 80 ఏళ్ల చుని బాలాదేవి అనే నటి ఈ పాత్రను పోషించి “సత్యజిత్ రే ని ఎంతగానో మెప్పించి, జాతీయ అంతర్జాతీయ ప్రేక్షకులందరి ప్రశంసలతో ప్రసిద్ధి పొందింది”. ‘భారతదేశంలో ప్రతి ఇంటా ఒక ఇందిర్ ఉంటుంది’ అంటారు. ఇక్కడ రచయిత్రి విశ్లేషణ అమోఘం. 1943లో నాజీ హిట్లర్ ప్రభుత్వం ముగ్గురు విద్యార్ధుల్ని అమానుషంగా గిలెటిన్ తో శిరచ్చేదం చేసింది. ఈ రాక్షసకృత్యం ఆధారంగా Mark Rothemund నిర్మించిన సినిమా ‘Sophie Scholl;the final days’. శిక్ష అమలుకి 99 రోజుల వ్యవధి ఉండగా అన్యాయంగా అదే రోజు మధ్యాహ్నం వారిని గిలెటిన్ తో వధించడం, ఆ విద్యార్ధులు తాము కూడా విప్లవాగ్నికి సమిధలవుతున్నామనే ఆత్మవిశ్వాసంతో గిలెటిన్ కి బలవుతూ, తాము కలలుగన్న సమాజం భావితరాలు సాధిస్తాయనే విశ్వాసాన్ని మాటల్లో వ్యక్తం చేయడం వంటివి చదివి తీరాల్సిందే. రచయిత్రి ఈ సందర్భంలో చేసిన వ్యాఖ్య అన్ని దేశాలకూ అన్వయిస్తుంది. “మీ దేశానికి మద్దతు ఇవ్వడం మాత్రమే దేశభక్తి కాదు, దేశాధి నేతలు ప్రజలకు హాని చేసే నిర్ణయాలు తీసుకున్నప్పుడు యువత తమ దేశప్రజల క్షేమంకోసం ‘ఇది చాలా తప్పుడు నిర్ణయమని ప్రతిఘటించడం’ కూడా దేశ భక్తే” అని నిరూపిస్తుందీ సినిమా”.
ఈ పుస్తక రచనలో రచయిత్రి చక్కని ప్రణాళిక వేసుకున్నారు. సినిమా ఏ భాషలో ఉంది?, దర్శకుడెవరు?, నిడివి, ఇతివృత్తం, ప్రథాన ఉద్దేశం వంటివి మూడు ముక్కల్లో చెప్పారు. తరువాత కథ, దాని విశ్లేషణ, పాత్రల విశ్లేషణ ఉన్నాయి. సినిమాలలో ముఖ్యమైన సన్నివేశాలను వర్ణించారు. విశ్లేషించారు. సినీ పరిశ్రమలో దిగ్గజాల వ్యాఖ్యలను కోట్ చేశారు. సినిమా కథ చెప్పడంలో సస్పెన్స్ ఉండదు. మొత్తం చెప్పేస్తారు. ఆషామాషీగా చెప్పడం కాదు. పాఠకులు వాటిని తదేక ధ్యానంతో తన్మయత్వంతో చదివేలా చేశారు. కాబట్టి ఇది కొంతమందికి మనకు కథలపై రాసిన పరిశోధనా వ్యాసంలా కనిపించినా ఆశ్చర్యపోనవసరంలేదు. ఏ సినిమాలో ఏ దృశ్యం ఎందుకు చూడాలో, మర్రి విత్తనంలో మహా వృక్షం దాగున్నట్టు ఏ దృశ్యం వెనుక ఏ నిగూఢ భావం ఉందో కూడా చెప్పారు.‘Two Women’ వంటి సినిమాల దగ్గర ‘కుటుంబ సమేతంగా చూడొచ్చు. చాలా డీసెంట్ గా ఉంటుంది’ అన్నారు. స్ట్రైక్ సినిమాను విశ్లేషిస్తూ రచయిత్రి ‘ఇంకో వెయ్యి సంవత్సరాలకైనా మనదేశంలో ఇటువంటి సినిమాని ఆశించలేము’ (పే.65) అన్నారు ఇది ముమ్మాటికీ నిజం.
“మంచి సినిమాకి మాటలు తక్కువ, దృశ్యం ఎక్కువా ఉండాలంటారు సినీ విజ్ఞానులు”. డైరెక్టర్ స్టానిస్లవ్ తెరకెక్కించిన ‘The Dawns here are Quiet’ అటువంటి చిత్రమే. అత్యంత ఆధునిక ఆయుధాలు కలిగిన 16 మంది నాజీ సైనికులతో ఆరుగురు రెడ్ ఆర్మీ మహిళా సైనికులు జరిపిన వీరోచిత పోరాటాన్ని ఇందులో అపూర్వంగా చిత్రించాడాయన. ఇందులోని నటుల గొప్పతనాన్ని విశ్లేషిస్తూ “దృశ్య కావ్యాల్ని మాటల్లో వర్ణించి చెప్పడం సాధ్యం కాదు” అని రచయిత్రి అన్న మాట వాస్తవం.
స్ట్రైక్ సినిమాను విశ్లేషిస్తూ, శ్రమదోపిడీ గురించి రచయిత్రి చేసిన వ్యాఖ్య నేటి కార్పొరేట్ ఉద్యోగులు ఆలోచించ దగినది. “మన ముందు తరాలవారి ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పని దినం ఇవాళ కార్పొరేట్ శక్తుల చేతుల్లో హరించుకుపోయి, మన తరాలు, మన భావితరాలు మళ్ళీ గంటల తరబడి పని చేసే స్థితిలోకి నెట్టబడ్డారు. ఇంకా విచిత్రమేమిటంటే ఇంటినుంచి పని చెయ్యడాన్ని ఒక సౌకర్యంగా చిత్రిస్తున్నారు. దానివల్ల కార్మికులకు సమకూర్చవలసిన సౌకర్యాల గురించి, కార్మికులు హక్కులుగా పొందవలసిన వాటినుంచి యాజమాన్యం ఏ మాత్రం బాధ్యత వహించకుండా హాయిగా తప్పించుకుంటుందని కార్మికులు గమనించడం లేదు. మార్క్స్ చాలా లోతుగా విశ్లేషించి చెప్పిన శ్రమ దోపిడీకి ఇదొక పరాకాష్ట!” (పే.66)
ఈ సినిమాలు చూస్తే చాలుకదా! ఈ పుస్తకం చదవడం ఎందుకు? అనుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలు మిస్సవుతాం. ఆఘ్రాణిస్తే ఆస్వాదించిన అనుభూతి వస్తుందా! ఉదాహరణకు ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు అకిరా కురోసావా 1950 లో నిర్మించిన ‘రషోమోన్’ సినిమా. రచయిత్రి దీన్ని విశ్లేషిస్తూ ఈ సినిమాను బట్టే ‘రషోమోన్ ఎఫెక్ట్’ అనే పధ్ధతి ప్రపంచవ్యాప్తంగా సినీలోకంలో మొదలైంది అంటారు. ఒకే సంఘటనను వేర్వేరు వ్యక్తులు ఒక దానితో ఒకటి పొంతనలేని వేర్వేరు విరుద్ధమైన వివరణలు ఇవ్వడాన్ని ‘రషోమోన్ ఎఫెక్ట్’ అంటారు. దీన్ని దర్శకుడు అకిరా కురోసావా మొదటి సారి ప్రవేశపెట్టాడు. మరో ప్రముఖ దర్శకుడు ఐసెన్ స్టీన్ నిర్మించిన మరోగొప్ప చిత్రం ‘స్ట్రైక్’ సినిమా ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలనే సమైక్యవాదం గురించి బలమైన ప్రకటనలు చేసిన రాజకీయ చిత్రం. ఇందులో దర్శకుడు ప్రయోగించిన ‘మాంటేజ్ ఆవిష్కరణ’ను రచయిత్రి వివరిస్తారు. ‘‘మాంటేజ్ అంటే ఫ్రెంచ్ లో ఆకర్షణ. రెండు విరుద్ధ సంఘటనల మధ్య ఘర్షణ సృష్టించి తాను ప్రతిపాదించ దలచుకున్న మూడో విషయాన్ని ప్రేక్షకులకు స్ఫురింపజేయడాన్ని మాంటేజ్ ఘర్షణ అంటారు’’(పే. 64). “తెలుగులో మన మహాకవి శ్రీశ్రీ కూడా తన రచనల్లోని చరమరాత్రి కథల్లోనూ ‘ గుమస్తా కల’ మొదలైన రేడియో నాటికల్లోనూ మాంటేజ్ ని శక్తిమంతంగా వాడి విజయం సాధించాడు” అన్నారు. అలాగే ‘ఫ్రెంచ్ భాషలో వచ్చిన ‘నీలం రంగు’ అనే సినిమా సాహిత్యంలోని సంగీతాన్ని బైబిల్ నుంచి తీసుకున్నాడు పాట్రిస్’ అంటారు రచయిత్రి. ఇలాంటి విశేషాలు ఈ పుస్తకం చదివితేనే తెలుస్తాయి.
ముందు మాటలో వి. వి. గారు రష్యన్ విప్లవంలో సినిమాల పాత్ర గురించి అరుదైన వివరాలందించారు. రచయిత్రి ఈ పుస్తకం చివరలో ప్రపంచ సినిమా చరిత్రను వివరించిన నందగోపాల్ గారి పుస్తకంలోని విలువైన సమాచారం ఇచ్చారు. మనం అంతర్జాలంలో ఈ సినిమాలు సంపాదించి చూడటం కష్టం కాకపోవచ్చు. కానీ ఈ పుస్తకం చదవకపోతే దర్శకుడి గొప్పతనాన్నీ అతని ప్రణాళికనూ పరిశీలించి చూడటం మన తరం కాదు.
‘రియలిస్టిక్ సినిమా’,
రచయిత శివలక్ష్మి,
94418 83949,
కుహు, విరసం ప్రచురణలు,
పేజీలు 258, ధర 300/-
డా. పి. యస్. ప్రకాశరావు.
99637 43021