నిశ్శబ్ద నిష్క్రమణం

Ramya Geetamalika Book Review

Update: 2024-06-03 05:48 GMT

మా చిన్నక్క రమణి, డి.వి. రమణి, రమణి దర్భా గా సాహితీ లోకానికి సుపరిచితురాలు. మా చిన్న బావ శర్మ గారికి మాత్రం రాధ. ఉద్ధత ప్రవృత్తి. పనిరాక్షసి, మా అమ్మ తనని 'ఝంఝా మారుతం' అనేది. మా చిన్నన్నయ్య 'గలగల మణి' అని ఆట పట్టించేవారు. గోదారిని తలదన్నే గలగల. రమణి ఒక త్రిభాషా కవయిత్రి. గొప్ప భావుకురాలు. ఎంతగా అంటే పాకీజా సినిమా చూసి దానిలోని కవిత్వపు లోతులను అందుకోలేక పోతున్నానే అని దిగులుపడి ఒక ట్యూషన్ పెట్టించుకుని మరీ ఉర్దూ బాష నేర్చుకునేటంత.

ముత్యాల్లాంటి అక్షరాలు

ఆమె మంచి స్టోరీ టెల్లర్. మా బాల్యంలో రోజూ సాయంత్రం రోటి చుట్టూ మూగే మాకు నవరసభరితమైన వినోదం అందించేది. ఏ కంది పచ్చడో రుబ్బుతూ కథ చెప్తే గంటలు గడిచేవి. వక్త్, గైడ్ లాంటి సినిమాలన్నీ అలా విన్నవే. ముత్యాల కోవల్లాంటి అద్భుతమైన చేతిరాతతో ఒక్క కొట్టివేత అయినా రాకుండా డైరెక్టుగా ఫేర్ రాసేసే అలవాటు. కొన్ని వందల కథలు చేతిరాతతో రాశాక తనే లాప్ టాప్‌లో టైప్ చేసేది.

ఆంధ్రజ్యోతి, విపుల వంటి వార, మాస పత్రికల్లో, నెచ్చెలి లాంటి ఆన్ లైన్ పత్రికలలో చాలా కథలు వచ్చాయి. చాలా నవలలు, గొలుసు నవలతోపాటు ఫేస్ బుక్‌లో ఓ నవల రోజూ ఒక భాగం రాసి అప్ లోడ్ చేస్తూండేది. 'నెచ్చెలి'లో ప్రతి నెలా ఒక కథ వచ్చింది. లేఖిని గ్రూప్ రచయిత్రులతోపాటు పొత్తూరి విజయలక్ష్మి, జ్యోతి వల్లభోజు, అత్తలూరి విజయలక్ష్మి లాంటి కవయిత్రులందరితో చక్కటి స్నేహం, నెలనెలా కలవడం తనకి తాను ఉత్సాహంగా ఉంచుకుంటూ తన చుట్టూ ఆ ఉత్సాహ తరంగాలు వెదజల్లడం తన నైజం.

కథరాస్తే బహుమతి గ్యారెంటీ

రమణి బహుమతులు పొందిన కథలే 50 పైగా ఉన్నాయి. రంజనీ కుందుర్తి పోటీల్లో కథలకి, కవితలకి కూడా బహుమతులు పొందింది. రమణి కథా సంకలనం జీవనవేణువు. తమ కథా వస్తువులన్నీ మధ్యతరగతి కుటుంబ జీవనం నుంచే తీసుకున్నవి. వారితో ముడిపడిన కింది వర్గ శ్రామిక జీవనాన్ని చాలా మానవీయంగా స్పర్శిస్తారు. మధ్యతరగతి మహిళల జీవితాలలోని సంఘర్షణలని చాలా నిశితంగా విశ్లేషిస్తూ మనో విశ్లేషణాత్మక వివరణని అందించడం కథకురాలిగా రమణికొక ప్రత్యేక స్థానాన్ని అందించింది. వెండి పట్టీలు కథ కుటుంబ హింస తీవ్రతని ఆర్ద్రంగా చెబుతుంది. అలాంటి కథలలోని కథన శైలి చాలా విలక్షణమైనది. 'బంగారు గాజులు' కథ కుటుంబ సంబంధాలలోని బలాన్ని, బలహీనతలనీ చెప్పే కథ. 'పూర్ణమిదం', 'మరుభూమిలో మల్లెపూలు', 'నర్తకి', 'ఈ రేయి తీయనిది' లాంటి కథలు మరపురాని మాణిక్యాలు. రమణి కథలు, నవలలు వినికిడి పుస్తకాలలా యూట్యూబ్‌లో లభిస్తాయి. 'పలుకే బంగారమా', 'చేజారెను నీ మనసే' నవలలు ఇటీవల రాధిక వినిపించగా యూట్యూబ్‌లో వెలువడినాయి.

కథకురాలు చిత్రకారిణి

రచయిత్రుల ప్రతి కథా సంకలనాలలో తన కథలు చోటు చేసుకున్నాయి. తన కవితలు రమణీయం పేర ఆంగ్ల, తెలుగు భాషలలో ఒకే సారి ప్రచురించి నారాయణ రెడ్డి గారి చేతులమీదుగా ఆవిష్కరిపజేశారు. భగవద్గీతను అనువదించి తెలుగు, ఆంగ్ల భాషలలో ప్రచురించారు. సాహిత్యంతోపాటు ఇతర లలిత కళలు అన్నింటా ప్రావీణ్యం ఉంది. గొప్ప తైల వర్ణ చిత్రకారిణి. ఎన్నో ప్రదర్శనలు నిర్వహించారు. మా పెద్దక్క శ్రీపాద అన్నపూర్ణ ప్రభావం మా ఇద్దరిమీదా బలంగా ఉంది. ఆ ప్రభావమే మమ్మల్ని చిత్రకారిణులను చేసింది. రాజస్థానీ మహిళ, సమూహాల చిత్రాలు, తొలి నాళ్లలో వేసినా తరువాత జైపూర్‌లో ఆర్ట్ క్లాసులకు వెళ్లి మరింత నైపుణ్యం సాధించారు. తర్వాత ఎక్కువగా లాండ్ స్కేప్స్, ప్రకృతి చిత్రాలు పెద్ద పెద్ద కాన్వాసులపై చిత్రించారు.

బాల్యంలో తను మంచి శాస్త్రీయ నృత్యకారిణి. గుంటూరు బండ్లమూడి హనుమాయమ్మ హైస్కూలులో ఎలెవెంత్ క్లాస్ దాకా చదివారు. ప్రతీ స్కూలు డే లోను రమణి పౌరాణిక పురుష పాత్రల అభినయ నృత్యం ప్రధాన ఆకర్షణగా ఉండేది. 10వ తరగతి మిత్రులు గత 50 ఏళ్లుగా తరచూ కలుసుకుంటూ ఉండడం గొప్ప విశేషం. గానం తనకు ఆరో ప్రాణం. ఏ పని చేస్తున్నా పై శ్రుతిలో పాడుకునేది. అలా పాడుకోవడం మా అమ్మనుంచి మా ఇద్దరక్కలకీ నాకూ అలవాటైంది. నడిచే మృదంగం రమణి. వీటన్నింటితోపాటు ప్రేమించే తత్వం - మా బావ చనిపోయాక 25 ఏళ్లపాటు పిల్లలతో కష్టసుఖాలలో భాగమై తన చిత్రాలు, రచనే ప్రధాన జీవితంగా జీవించిన రమణి ఇక లేదు కానీ తన కథలు, రచనలు, మాటలు, రంగులు, చిత్రాలు, పాటలు, జ్ఞాపకాలు - మన అందరి గుండెల్లో నిలిచి ఉన్నాయి.

రాలిపోయిన క్షణాలు

తీవ్రమైన గుండెపోటుతో క్షణంలో కొడుకు చేతుల్లోనే ఒరిగిపోయి పక్కన 5 నిమిషాల దూరంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లేలోగా రమణి గుండె నిలిచిపోయింది. చాలా సంవత్సరాలుగా షుగర్‌తో పోరాడుతూ ఉండటం. చాలా తరచుగా ఎదురవుతూ వస్తున్న ఆరోగ్య సమస్యలు, వొదిలించుకోలేకపోయిన మానసిక ఒత్తిడిల ప్రభావం వలన గుండె, ఇతర శరీరం మొత్తంగా చాలా బలహీనంగా ఉండటంతో అక్క కోలుకోలేకపోయింది. భారతీయ కాలమానం ప్రకారం మే 25 మధ్యాహ్నం 3.40 గంటలకు చనిపోయింది. ఆత్మీయులందరినీ వదిలి, వందలాది మిత్రులనీ, అభిమానులనీ వదిలి చివరిచూపైనా అందనంత దూరంలో ఉండి ఒంటరిగా నిష్క్రమించింది నిరాడంబరంగా. చివరివరకు సందేశాలు పంపుతూ సందడించిన రమణి కేవలం 10 నిముషాల్లో ఒరిగిపోవడం బాధపెడుతోంది.

మిత్రులకు విజ్ఞప్తి: డి.వి రమణితో కలిసి నడిచిన అందరూ, మీమీ జ్ఞాపకాలతో మా అక్కని అక్షరాలలోకి మార్చండి. మన జ్ఞాపకాల పూలు గుచ్చి మా అక్కకి సమర్పిద్దాం. రమణిని 'రాగమణి'ని చేద్దాం.

లక్ష్మీ సుహాసిని

విశ్రాంత అధ్యాపకురాలు

98852 88443

Tags:    

Similar News

అమరత్వంపై