అప్పుడే...దీపావళి

poem on diwali

Update: 2023-11-12 23:30 GMT

స్వార్థమే పరమావధైన పాలకులు

తమ మోసపూరిత రాజ్యకాంక్షలను

నీతులుగా వల్లిస్తూ,

సమానత్వపు కథలుగా బోధిస్తూ,

ప్రాంత,వర్గ,వర్ణ విభేదాలు సృష్టిస్తూ

రేపుతోన్న చిచ్చుతో

రాజ్యం రావణకాష్టంలా మండుతోంది.

అరాచక నియంతృత్వ విధానాలతో

పాషండ హృదయులై,

అడ్డూ,అదుపూ లేని ఆగడాలతో

జనులను చిత్రవధలకు గురిచేస్తూ

తమ ఒంటెత్తు పోకడలతో

సంక్షేమ ముసుగులో

అభివృద్ధిని చంపుకుతింటోన్న

నాయకుల పాలనలో,

అభివృద్ధి ఇసుమంతైనా కానరాక

తమ భవితకు దిక్కులేక

యువత బిక్కుబిక్కుమంటోన్న

ఈ సమయంలో

మనకేమీ పట్టనట్టు,

జాతిప్రయోజనాలు మాకక్కర్లేదంటూ

దీపావళి జరుపుకుందామా

యోచించు ఓ పౌరుడా!

దీపాల వరుస పేర్చిననాడే

దీపావళి కాదని,

జాతి శ్రేయస్సుకై పాలకుల

మలిన ఆత్మలు

నైతిక దీపశిఖల్లో దగ్ధమై,

వారి మదిలో

చైతన్య జ్యోతులు వెలిగి

రాజ్యంలో అభివృద్ధి దీపం దీపించి,

జనుల బతుకుల్లో

ఆనందాలు నిండిన రోజే

అసలైన దీపావళని.

వేమూరి శ్రీనివాస్

9912128967

Tags:    

Similar News

తొడుగు