ఊరు సెరువులన్నీ నిండుకుండలైనై.
వాగువంకలన్నీ పుడమితల్లి తనువును...
ముద్దాడుతున్నయి.
జలపాతాలు జాలువారుతూ..
కొండకోనల నుండి దుకుతున్నయి.
ఆకుపచ్చని సీరె ఆరేసినట్లు..
తెలంగాణ మాగాణి అంతా..
పసిడి పంటల పండుగ.
కనులారా కాంచడానికి బయలెళ్లినది...
మాకు బతుకునిచ్చే బతుకమ్మ.
ఆడబిడ్డల ప్రేమలు.
ప్రతి ఇంటికి ప్రమిధలు.
తంగేడు పూలై పూస్తారు అక్కాచెల్లెళ్ళు
బంతిపూలై బంధాలను పెనవేస్తారు తోబుట్టువులు.
ఇల్లంతా ఆనందాల జాతరలు.
పిల్లలంతా కేరింతల ఆటలు.
ఊరంతా పూల పండుగలు.
పూలసెట్టుకు పూసిన పువ్వులోలే..
అందమైన అనుబంధాల నెలవులు.
నిండుగా నిండిన సెరువుల్లో..
పాలపిట్ట తానమాడుతుంది.
ఆకాశం సెరువును ముద్దాడుతుంది.
సుక్కలు ముగ్గులై ఇంటిముంగట
అందమైన రంగవల్లికలైతున్నయి.
ప్రకృతి చల్లని సందమామ వెన్నెలై..
ప్రేమ వర్షం కురిపిస్తుంది.
పూలన్నీ బతుకమ్మ సిగలోదూరి
పూలదేవతలై పోవాలని పరితపిస్తున్నయి.
పుట్టబొమ్మలోలే పడుసుపిల్లలు.
అప్పుడే పూసిన పువ్వులోలే ఆడపడుచులు.
పూల బతుకమ్మను పూజిస్తున్నారు.
బతుకునిచ్చే బతుకమ్మ తల్లిని
బంగారు బతుకమ్మ రావే..
సిరుల పంటలు కురిపించవే..
అందాల బతుకమ్మ రావే..
అందరికి విజయాలను అందించవే..అని
తెలంగాణ నేలంతా పూలవనమైనది.
అశోక్ గోనె
9441317361