యుద్ధమా ఓడిపో...

Poem

Update: 2024-10-13 20:30 GMT

మొదలు మర్చిన పోరాటం చిలవలు

పలవలై అంతానికి పంతం పాడుతుంటే

ప్రతీకారాలు, అహంకారాలు ఆజ్యాలు

పోస్తుంటే యుద్ధం మరింత జ్వలిస్తుంది!

ఆయుధాలు పండించటం మొదలైనప్పటి

నుండి యుద్ధమే పరిష్కార మనిపిస్తుంది!

బాలిస్టిక్ క్షిపణే భగవంతుడయ్యింది

మింగ మెతుకు లేకపోయినా మీసాలకు

మిస్సైల్స్ కావాల్సొస్తున్నాయ్

మారణహోమాలిప్పుడు మానవకళ్యాణాల్లా

రొమ్మువిర్చుకు తిరుగుతుంటే...

నింగి నల్లగా నేల ఎర్రగా ఉలిక్కిపడి

యుద్ధంలో శాంతిని కల కంటున్నాయి

తెల్లపావురం రెక్కలల్లార్చి శాంతి వచనాలు

విదిల్చినా ఆధిపత్యాల అధిపతులకు

రాబంధుల రెక్కల చప్పుడే కర్ణపేయంగా

వున్న యుద్ధకాలమిది

మతోన్మాదమో...జాత్యహంకారమో

బీజాలు గట్టిగా పడ్డాయి

ఆధిపత్యాలు, అవకాశవాదులు,

ఆయుధాలమ్ముకొనేవాళ్ళు

వెరసి మంటలు ఆరకుండా

యధాశక్తి మాటలు పేలుస్తున్నారు

ఏ కల్మషాలు లేని కిలకిలల పసినవ్వులు

రేపటికి మిగలాలంటే యుద్ధం బేషరతుగా

ఓడిపోక తప్పదు!

- భీమవరపు పురుషోత్తమ్

99498 00253

Tags:    

Similar News

అమరత్వంపై