వానపిల్ల

Poem

Update: 2024-09-01 18:30 GMT

నీలాకాశంకి చిల్లులు పడినట్లు

ఊరు వాడంతా జోరువాన..!

శూన్యతా జల్లెడ లోంచి

ధారగా జారుతున్న సన్న బియ్యంలా

జడివాన చినుకులు..!

వర్షం సుందరి అల్లరి పిల్లలా గెంతుతూ

ఊరంతా కలియ తిరుగుతోంది.!

రోడ్లమీద బడి పిల్లల్లా చిందులేసి

జారుడు బల్లనుంచి జారినట్టు

కాలువలోకి ఉరుకుతుంది వానపిల్ల..!

నేల తల్లి పగుళ్లు కళ్లలోకి

వాన చినుకులు చిటపట పడగానే

ప్రకృతి చేసిన పెను గాయాలు

భూదేవిలో మటుమాయమవుతాయి..!

వర్షానికి పచ్చని చెట్లు

ప్రకృతి స్నానాలు తలార చేసి

ఆకుల శిరోజాలను విరబోసుకుంటాయి..!

జోరు వర్షానికి పేదోడి పూరి గుడిసెలు

ముసలి అవ్వలా ముడుచుకుంటాయి

జడివానకు కలవారి వసతి గృహాలు

పరదాలను సరదాగా కప్పుకుంటాయి..!

వానకు నానిన నేల నుంచి మట్టి పరిమళాలు

నాలుగు దిక్కుల నుండి గుప్పుమంటాయి..!

జి.సూర్యనారాయణ,

62817 25659

Tags:    

Similar News

అమరత్వంపై