వేదిక 'ఆ 'వేదన

Poem

Update: 2024-09-01 18:30 GMT

అసత్యపు మాటల బరువు మోయలేక

అనర్హుల ప్రసంగాలు కూతలు

కోటరీల కొమ్ముకాస్తుంటే...

అంతులేని పొగడ్తలతో

అసహ్యమే కొత్త ఆనవాళ్ళు వెతుక్కొని

వినమ్రతతో తల దించుకొంటుంది.

వేదికపై పరిచిన తివాచి

నింగిని తలపించేట్టుగా

విన్న కుయుక్తుల ప్రశంసలను

ఊడ్చమని నిర్మొహమాటంగా

చీపురును వేడుకొంటుంది.

ఇంత కూడా తెలియని

వాడిపై ప్రాంగణాలలో

వత్తాసు పచ్చీసుల పన్నీరు చల్లినా...

ఆ తోక వంకరేగా మళ్లీ

కపటి మాటల కుల్లు విన్న మైకు సిగ్గుతో

మూగగా మళ్ళీ మళ్ళీ భానిసై

కొత్త గళం కోసం వేచి చూస్తుంది.

రోజు కలిసే సాటి వాడైనా వేదికపైకెక్కగానే

విషపు చూపు చూస్తాడు.

ముందు వారెవరో అసలు

తెలియనే తెలియదన్నట్టు.

తన మనసు ఇనబింబం

చైతన్యం ఎక్కడని ప్రశ్నిస్తున్నా...

జ్యోతి ప్రజ్వలనకై తానే ముందంటూ

బారులు తీస్తూ మనస్సాక్షిని చంపుతూ

ప్రమిదను వెలిగిస్తాడు.

ఒకరికి ఒకరు భాజా భజనలు చేస్తూ

అదే వైభవం అనుకుంటారు.

అక్కసువాదనలతో అన్నీ వదులుకొని

మరన్నీ తనవే అనుకుంటాడు

'చక్కని చుక్క'గా...

అందుకే సభావేదికలు

అచ్చమైన, స్వచ్ఛమైన

సహృదయులు ఆశీనులవ్వాలని

నిత్యం సభా సరస్వతిని

నమస్సులతో వేడుకొంటున్నాయి.

-డా. చిటికెన కిరణ్ కుమార్

94908 41284

Tags:    

Similar News

అమరత్వంపై