నువ్వూ నేనూ

Poem

Update: 2024-06-30 18:45 GMT

నది అంటే ఏమిటి

వొక నువ్వూ వొక నేనూ

నది ఎక్కడ పుడుతుంది

ఘనీభవించిన శిలలు

కాలపు వెచ్చదనంతో చలికాచుకున్నప్పుడు

కురిసిన మేఘాల లేత నవ్వుల జల్లు కదూ నది

కరుగుతున్న హృదయాల ఆనంద పరవశం జడి కదా నది

కణకణం క్షణక్షణం ఉప్పొంగుతున్న ఉద్వేగం కదా నది

పరుగులు తీసే ఝరి పయనం ఎక్కడికైనా

బండరాళ్ల చెలియలికట్టల బాహువులే కదా నది విలాసం

నదంటే ఏమిటి ఒక నువ్వూ ఒక నేనూ

నువ్వెలా వచ్చావో నేనడగగలనా

నేనెలా వచ్చానో తరచి చూసుకోవాలి

నదుల్ని ప్రవహించిన గండశిలలనడగాలి

గండశిలలను కరిగించిన కాలాన్ని అడగాలి

రాళ్లేమి చెబుతాయి

నది గమనంలోని కంటకాలతో ఘనీభవించాయి

రాళ్లేమి చెబుతాయి

కాలపు పునాదుల కింద పూడిపోయాయి

కాలం ఒక అద్భుత శూన్యం... ఒక వికృత రహస్యం

కాలం సమస్తాన్ని హరించే ఒక గుప్త మార్గం

నదంటే ఏమిటి ఒక నువ్వూ ఒక నేనూ

నేనెవరిని ఎవరు చెప్పగలరు నువ్వెవరో నాకు తెలుసు

కాలపు చివరి అంచులపై

నాట్యం చేస్తున్న గాలిపటం నేను

అంకురం నది పేరు అడగదు

నీకూ నాకూ భేదం అడగదు

ఇక్కడ గండ శిలలు

మనల్ని వేరు చేసే మహా మునులు

ఇక్కడ గండ శిలలు

మనల్ని అంకురాలకు చేర్చే వారధులు

ఇక్కడ సమానం మహాప్రస్థానంలోనే

మన ప్రయాణమంటేనే పతనోద్ధానాలు

కాలం మన ఉనికినీ

మన సంగమాన్నీ ప్రకటించే ఒక ప్రవాహం

నదంటే ఏమిటి ఒక నువ్వూ ఒక నేనూ

కాలం వేరుచేస్తే ప్రవహించి సంగమించగల ప్రవాహం

ఒక నువ్వూ ఒక నేనూ విడదీయలేని త్వమేవాహం.

- కర్నూలు చంద్రశేఖర్

98666 08190

Tags:    

Similar News

అమరత్వంపై