వృద్ధాశ్రమం

Poem

Update: 2024-06-23 18:30 GMT

కాలం అంచున కూర్చుని

అభివృద్ధిని ఆస్వాదిస్తున్న

ఆధునికానికి ఏమని బదులివ్వాలి?

తన ప్రేమనంతా గోరుముద్దలో

లాలించి పాలించే అమ్మ

ఏ పంచన చేరాలో

ఎక్కడ ప్రేమ దొరుకుతుందో

వెదికే దారెక్కడ

గుండెల మీద ఎగిరి గంతేసినా

పసి నవ్వుల్లో ఆనందాలను వెతికిన

నాన్న గుదిబండగా మారి

గుడిమెట్ల పాలయ్యాడా

వృద్ధాప్యమొక శాపమని

రెండుకాళ్ళు మూడవుతాయని

తెలియజెప్పని జీవితాన్ని

నిందిస్తూ నిట్టూర్పుతో

బతికే బతుకే భారమయ్యింది

ఎక్కడో ఊరవతల

పాకలో నలుగురు

ముసలోళ్ళుంటే చూసి

ఆశ్చర్యానికి గురైనా

నేడదే వారికి ఆధారమని

తలవంచాను

ఊరికొక్క వృద్ధాశ్రమముండే

గత కాలం గొప్పదా

వీధికొక్కటున్న ఈనాటి

పురోభివృద్ధి గొప్పదా?

బంధాలను బరువనుకుని

బాధ్యతలను భారంగా

మోసే నేటి కాలానికి

ఒంటరి తనమే స్వేచ్చ

ఎం. లక్ష్మి

లెక్చరర్

Tags:    

Similar News

అమరత్వంపై