బడిగంట మోగినపుడు

Poem

Update: 2024-06-23 18:30 GMT

బడిగంట‌ మోగినపుడు

గుండెగంట‌ లబ్ డబ్ అని మోగుతూ

పాదాల్ని‌ వడివడిగా మెలిపెడుతుంది

బడిగంట మోగినపుడు

చదువులగంట తుమ్మెద నాదమై

వినబడుతూ జ్ఞానం‌ విరిసే పూలతోటకు

పదపదమని తొందరపెడుతుంది

బడిగంట మోగినపుడు

పిల్లల నవ్వులగంట కిలకిలనాదమై

నాలో చైతన్యాన్ని రగిలించి నాతో

నాలుగడుగులెక్కువేయిస్తుంది

పొద్దున పూట మోగిన బడిగంట

బడిబాటలో‌ కాళ్లకు సంకెళ్లేసి లాక్కెళితే

సాయంత్రం మోగే బడిగంట

అవే కాళ్లకు సంకెళ్లు విప్పి

స్వేచ్ఛలోకి పరుగుపెట్టిస్తుంది

ఉదయ సాయంత్రాల్లో

బడిగంట మోగినపుడల్లా

పిల్లలకైనా, నాకైనా

బతుకుగంట చెవుల్లో

మార్మోగుతున్నట్టే వుంటుంది

- చిత్తలూరి

91338 32246

Tags:    

Similar News

అమరత్వంపై