బత్కేయుద్దం

poem

Update: 2024-01-23 05:00 GMT

బతుకంటే ఆట కాదు ఓ యుద్దం

పొద్దుతో పోటీపడి

పోరాడటమే దాని సిద్దాంతం.

బతకడమంటే కడుపునిండగా తిని

రచ్చకట్టమీద కాళ్ళు ఊపుతూ

గొర్కపెట్టి నిద్రపోవడం కాదు

ఒల్లును విల్లుల ఒంచి భూతల్లి ఎదపై

సెమట బొట్టులై రాలడం.

ఒకడికి వంగి వంగి బానిస కుక్కల

సాగిలబడటం జీవితమవ్వదు

జీవితం కడదాకా బరిగీసి

సింహంల గర్జించడం అలవర్చుకోవాలె.

దోమల మోతకు ఉరేసుకొని సావడం కాదు

దునియా మొత్తం నిన్ను వెలివేసిన

ఒంటరిగానైన కొత్త చరిత్రను

లిఖించడమెట్లనో చదువాలె.

ఊపిరితో ఉండడమంటే

వాడెవడికో నచ్చినట్లు

నీ ఆలోచనలు నీ నడక

మార్చుకోవడం కాదు

ఓ పదిమంది నీవు దున్నిన

నాగటి సాల్ల వెంట నడవడం.

ఐనదానికి కానిదానికి

బట్టపెట్టుకొని ఏడ్వడం కాదు

బత్కినన్ని రోజులు

నీ చిటికెన వేలు చివరన

ఈ భూగోళాన్ని పెట్టుకొని

ఆడించాలనే కసి రావాలె.

బత్కంటే ఒకరిమీద ఆధారపడి

కాల్లమెల్లదీస్తూ పిట్ట కథలు సెప్పడం కాదు.

నీ కథ కనీసం ఒక్కడికన్న

జవసత్వాలనందిచాలె.

అవనిశ్రీ

99854 19424

Tags:    

Similar News

తొడుగు