ఒక చేత్తో పార పట్టుకొని,
మరో చేత్తో పలుగు పట్టుకొని,
మదినిండా ఆశ పెట్టుకొని
ఆ పూటకు అన్నం పెట్టే అయ్యెవరా అని
ఒళ్ళంతా కళ్ళతో ఆర్తిగా ఎదురుచూసే
అడ్డా మీద కూలీలు
డప్పులు కొట్టే దండు వెనుక
దండాలు పెట్టే నాయకుడి వెనుక
జండాలు పట్టి జై కొడుతున్న
వీళ్ళే వాళ్ళా
ఒక చేత్తో ఎత్తిన జండా
జై కొడుతూ ఎత్తిన పిడికిలి
నాయకులెవరైతే మాకెందుకు
మాపుకు మా కూలీ చాలు
బీరూ బిర్యానీ బోనస్
జెండాపై మమకారం బోగస్
ఇవ్వాళోక జెండా, రేపు మరొక జెండా
ఏ జెండా అయితేనేం కడుపు నిండడమే ఎజెండా
కడుపు నిండిన అయ్య, పండుగ పండుగకూ
కండువా మారిస్తే లేని తప్పు
కడుపు ఎండినోడు పూట గడవక
పూట పూట కొక జెండా పడితే తప్పా
ఒళ్ళు వంచి పనిచేసే వాడికి
ఓట్ల పండుగను మించిన పండుగ లేదు
దరువేసే డప్పు చేత పట్టినా
జెండాలను పురుకోసకు చుట్టినా
లైట్లను, మైకును దారెంట మోసినా
ఫ్లెక్సీలను, బేనర్లను పోలెక్కి వేలాడ దీసినా
పదిరోజులూ పండుగే పండుగ
పాటలు రాసేటోళ్ళు, వాటిని పాడేటోళ్ళు
జంత్ర వాద్యాలు జోడించి రికార్డింగు చేసేటోళ్ళు
చాయిలందించెటోళ్లు, టిఫినీలు పెట్టెటోళ్ళు
జెండాలు కుట్టెటోళ్లు, కండువా లమ్మేటోళ్లు
చివరి గుడిసె ఇంటిదాకా చీటీలను చేర్చెటోళ్లు
బ్యాడ్జీలు, లేబుళ్లు, కరపత్రాలు,
ప్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు,
వాహనాల సమూల మార్పులు
మార్చి తీర్చి దిద్దిన రంగులు
చేసుకున్నోడికి చేసుకున్నంత పని
అయ్యా! మీ కాల్మొక్తాం
చచ్చి మీ కడుపున పుడ్తాం
అయిదేళ్ళ కోసారొచ్చే ఈ పండుగ
యాడాది కోసారి వచ్చేలా చూడండి!
-డా. దాసరి వెంకటరమణ
90005 72573