విప్లవ్ అండ్ విప్లవ్

poem

Update: 2023-10-29 18:30 GMT

ప్రకృతి కిరణం తగిలింది

అలిసిన నేత్రానికి

విప్పారింది మనిషి కొమ్మపై

తాత్కాలిక సున్నితత్వం

వదిలేసిపోకు ఈ ఒంటరీకరణ సూత్రంలో

అసలే నిజం జారిపోతా ఉంది

పాకర పట్టిన నాలుకల్లోంచి

ఈ నోర్లు సత్యం విప్పవు

కప్పెట్టిన పొగ మాదిరి

మేము తప్పో మా విధానం తప్పో

చిక్కుముడిల జీవితాల్లోంచి

అంతుచిక్కని సమీకరణల పరంపర

ఎన్నిమార్లు ఒద్దనుకున్నా

ఇదొక అధికారపు కంచె

ఢంకా బజాయిద్దమా

నెత్తిన బరువుల మూటలు

ఏ శాంతియుత మౌన మార్గమో, ఆశ్రయిద్దమా

పొసిగేవి అనుకూలమైనవి చూసుకుందమా

నప్పదు లోపల పేగులు తంతయి

నరాలు ఎర్రబడతయి

గొంతుల ఆక్రోశ ధ్వనులు

భయం దుప్పటిల కుతకుతలాడుతయి

అటూ ఇటూ కాకుండా పోతామేమో

బ్రతుకు నిర్వచనం మారుస్తామేమో

మళ్ళీ మనిషిగా ఎప్పుడు పుడతామేమో

పుట్టుకే ఒక విప్లవం కదా

రెండూ ఒకే కడుపుల నుంచి ప్రభవించినవి

శిశువు అరుపులాగా

దాన్ని మాత్రం నులిపెయ్యకు

మిత్రమా గుండెను సానపెట్టు

గొంతును రాటుదేల్చు!!

- వగ్గు రఘువీర్

79782 45215

Tags:    

Similar News

తొడుగు