గాలి గలగలలు

poem

Update: 2023-10-22 22:45 GMT

ఎవరి పిలుపూ అక్కర్లేదు

ఆ స్వచ్ఛ స్పర్శే నిమురుతది

సకల రంగుల పూలను

ఎవరూ రమ్మనే అవసరం లేదు

ఒళ్ళంతా పాకుతుంది అమ్మవొడిలా

గుండెలోంచి శరీరంలోకి జారే ప్రాణాధారం

ప్రకృతి అణువణువూ అటూఇటూ నడిచే

ప్రవాహ స్వేచ్ఛలో అది సర్వాంతర్యామి

కొమ్మలూ రెమ్మల కదిలికలో ఆకులు

ఊపిరి గొట్టాలు గాలి గుమ్మటాలు నిండును

సరి జీవుల పెద్ద సహచరి ఊపిరి నావ

ఉనికే కరువైనదా దోబూచులాటల ఉక్కపోత

ఉక్కిరిబిక్కిరి ఊపిరాడక

మూసిన తలపుల గదిలో ఒంటరి నిశ్చలి

బతుకుల చిరునామా

నిత్య నిర్మల మారుత గలగలలే

నవ జీవన తాత్వికతలో

పూల పరాగాలూదే స్వప్న సుందరి గాలి

మౌన ముంగురులూగే ఆత్మీయ నెచ్చెలి

గీత సంగీతాల తీపి మోసుకొచ్చేటి కవ్వాలి

ఏ పరిధి హద్దుల్లేని

స్వాతంత్ర్య నేస్తం గలగలల గాలి

డా.టి.రాధాకృష్ణమాచార్యులు

98403 05871


Similar News

తొడుగు