అమ్మా నాన్నా అన్నయ్యా!
క్షమించండి !క్షమించండి !!
మీ ఆశలను సఫలం చేయలేక
అడియాసలు చేసినందుకు
మన్నించండి! మన్నించండి!!
ఇక మీద
మీకు భారం కాలేను
బాధ నన్ను వేధిస్తుంది
ఇదీ అని చెప్పుకోలేని నొప్పి
లో లోన దుఖం సుళ్ళు తిరుగుతుంది
నన్ను మన్నించండి
నేను వెళ్ళిపోతున్నాను
నిరుద్యోగి మెడ తాడుకు వేలాడుతుంది
చేతిలో భార్యాపిల్లలకు
రాసిన చివరి లేఖ
సుగుణా !సుగుణా !
నిన్నూ పిల్లలని విడిచిపెట్టి పోతున్న
పెద్ద బుజ్జీ చిన్నోడు జాగ్రత్త
నువ్వు రంది పడకు పిల్లలు బెంగటీలుతరు
ఏం చేయాలి చెప్పు
కాలం కాక ఒకసారి
కాలమై మరోసారి
భూదేవిది తప్పు లేదు
చేతికి రాకుండా
బతుకు తెర్లు అయిపోయింది
వర్షానికి నోట్లెకు వచ్చిన పంట
నీట కొట్టుకుపోతుంది
మదనపడి మదనపడి
ఏ దారి కనిపించని రాత్రి
పురుగు మందు రైతును కాజేసింది
నిరుద్యోగులు విద్యార్థులు రైతులు స్రీలు
సెల్ఫ్ సూసైడ్ సెల్ఫీ వీడియో కాల్స్
దయా కరుణ క్షమ ధర్మం లేని
దేశంలో ఆత్మహత్యల క్రతువు
ఏడో రుతువుగా వచ్చి చేరింది
-జూకంటి జగన్నాథం
94410 78095