నీ కోసం కవితయ్యాను నేను..
నా మనసు భావాలను - మాటలలో
వ్యక్తీకరించడం చేతగాక..
అది చూసి కవినంటున్నారు నన్ను
అక్షరాలకెంత విలువుందో కదా !
మాటలలో చెబితే విన్నంత సేపే-
అక్షరమైతే - ఆర్తి కలిగినప్పుడల్లా
కనులతో తడిమి చూసుకోవచ్చు..
అనుభూతులను నెమరు వేసుకోవచ్చు..
మధుర భావనలను భద్రపరచుకుని -
మనసైనప్పుడల్లా చదువుకోవచ్చు..
ఒంటరి తనం నన్నెప్పుడూ బాధించదేమో
నీ జ్ఞాపకాల పరంపరలు నను వీడని తోడై
నాతో ఉన్నంత వరకూ....
కానీ - బాహ్యంగా నీవు నా చెంత లేవని
చింతించకుండా - నీకై రాసుకున్న నా
కవితల భాండాగారాన్ని అప్పుడప్పుడు
చదువుకుంటూ - తన్మయత్వమవుతుంటా!
బాహ్యంగా ఉన్న దూరాన్ని చెరిపేస్తూ
త్వరగా నువు నన్ను చేరాలని
ప్రతి రోజొక కవితనై నిన్ను చేరుకుంటున్నా
నీ వల్లే కదా! నాలో ఈ కవితావేశం
నీ కొరకే కదా! ఈ అక్షర సుమార్చన!
కందాళ పద్మావతి
90108 87566