ఒకే నేల ఒకే ఆకాశం
ఒకే గాలి ఒకే నీరు
ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు
మనసు పొరల్లో పేలడానికి
సిద్ధంగా ఉన్న భూకంపాలు వేరు
తుకతుక ఉడుకుతున్న అగ్నిపర్వతాలు భిన్నం
ఒక చోట నీరు జీవధార అయితే
మరోచోట ఉప్పెనై
బతుకు తీర సారాన్ని ముంచెత్తుతుంది
ఓకే మనిషి ఓకే మనసు
ఒకే ప్రపంచం ఒకే జీవజాలం
ఒకే కాంతి ఒకే వెన్నెల
పక్కా రహదారి అడుగులో కనిపించని
కాలిబాట అడుగుజాడలు వైవిధ్యం
కలగని దూర భారాన్ని చింతిస్తుంది
ఒక్క దగ్గర అనుభవం పాఠం అయితే
మరొక దగ్గర గుణపాఠమై
లోకాన్ని గొప్ప మలుపు తిప్పుతుంది
ఒకే వాంఛ ఒకే ఐక్యం
ఒకే ఇంట ఒకే జంట
ఒకే ప్రాణం ఒకే గానం
ఒక్క చోట నిలువని కాలం
మరో చోట నీడను కోల్పోయిన ఆకారం
మన్నూ మిన్నులా నిన్నూ నన్ను కలిపింది
ఒకే ఆకాశం కింద ఉదయంలా
కన్ను తెరిచిన స్వప్నం
నిజం ఉద్వేగంగా మొగ్గ తొడిగి
ఉసూరుమని ఉడిగిపోయిన
కలవర జీవన ప్రయాణం
-జూకంటి జగన్నాథం
94410 78095