చరిత్ర, సాహిత్యాల నడుమ నేను తిరిగిన దారులు

Nenu tirigina darulu Book ReviewNenu tirigina darulu Book Review

Update: 2024-07-29 06:20 GMT

“ నువ్వు నీ ఇంటిని వదిలిపెట్టిన వెంటనే ప్రపంచం వెయ్యి చేతులతో దగ్గరకు తీసుకోవడం ఎంత ధైర్యాన్నిస్తుంది. అప్పుడు నువ్వు మళ్లా గృహోన్ముఖుడివైనప్పుడు ఒట్టి మనిషిగా కాక మహా మానవుడిగా తిరిగి వస్తావు”

తెలుగులో యాత్రా చరిత్రలు ఎన్నో వచ్చాయి. అవెన్నో ప్రాంతాల గురించి చెప్పాయి. ఈ కోవలో మరో మెట్టుపై నుంచి నడిపించే రచన వాడ్రేవు చినవీరభద్రుడు ‘నేను తిరిగిన దారులు’. కుదించిన అక్షరాల ఆంక్షల నడుమ ఈ పుస్తకంలోని మధురానుభూతులను అక్షర శైలి నైపుణ్యాలను వాటి వెనుకనున్న సాహిత్య, చరిత్ర ఆధ్యాత్మిక భావనలను ‘బయట’ పెట్టడం కొంచెం కష్టమే. ప్రారంభిస్తే ముగింపు సంగతి పుస్తకం చూసుకుంటుంది. పై వాక్యం ఒక్కటే చాలు చదువరి మెదడును మెలిపెట్టి ముందుకు తీసుకు వెళ్లేందుకు. ప్రతీ ఒక్కరూ తమ జీవితకాలంలో ఎన్నెన్నో ప్రాంతాలను చూస్తారు. కానీ.. ఎంతమంది ‘మహా మానవు’లుగా తిరిగి వచ్చారో విశ్లేషణల కందని అక్షర సత్యం. వెళ్లామా.. వచ్చామా.. అనేటట్టుగా ఉంటుంది వారి ప్రయాణం. ఒక్కసారి ‘నేను నడిచిన దారులు’ చదివితే ఓ ‘కొత్త దారి’ ‘కొత్త చూపు’ ప్రయాణికుల మదిలో తటిల్లున మెరుస్తుంది.

ఈ పుస్తకంలో శరత్ రచన శ్రీకాంత్’లో కథానాయకుడు చెప్పినట్టుగా ‘నా జీవితమంతా ప్రయాణాల్లోనే గడిచిపోయిందని’ రచయిత తన స్వగతం కూడా చెప్పుకున్నారు. ‘ఋతుపవనాలు మలుపు తిరిగి తొలి వానజల్లులు వేసవి నేలలను తడుపుతున్నప్పుడు ఏ రైల్లోనో లేదా చిన్నకారులోనో ఆగని ప్రయాణమేదో కొనసాగిస్తూ పోవాలని రచయిత తన అనుభవాల్లోని భావుకతను వివరిస్తారు. ఈ రచనా శైలి, మనోరమణీయ భావనలు పుస్తకమంతా పరుచుకొని ఉండటం వైష్ణవాలయాల్లో ధనుర్మాసపు రోజుల మరువం దవళాల సువాసనలను గుర్తుకు తెస్తుంది. ‘ఆముక్త మాల్యద లో తెల్లవారుజామున గోదాదేవి స్తుతిలీలగా వినిపిస్తుంది. ఈ పుస్తక రచయిత రాసిన ‘అరకులోయ దారులు’ చదివిన ఆచార్య చేకూరి రామారావు ‘ఆ రచనలో అడవులతో పాటు మనుషులున్నారు. మనుషుల్ని కొత్తగా చూడటముంది. అది నాకు బాగా నచ్చిందంటారు.” ఇక్కడ ఒక్క విషయం ప్రస్తావించుకోవాలి. రచయిత తను చూసిన ప్రతీ ప్రాంతం యొక్క సంగీతం, సాహిత్యం, పల్లె జీవనం, సంస్కృతి సంప్రదాయాలతోపాటుగా భౌగోళిక స్వరూపంలో అంతర్లీనంగా ఉన్న భారతీయ ఆత్మను ఆవిష్కరించడం ఆయనలో సత్యాన్వేషి, నిత్యాన్వేషి యొక్క అంతర్మథన ఔన్నత్యం దృశ్యమానమవుతుంది.

అరకు, శ్రీశైలం, పాపికొండలు, ఇంగ్లాండ్, మధుర, త్రయంబకం, అరుణగిరి, హళేబీడు, కాశీ, ఢిల్లీ వంటి ప్రాంతాలను గురించి వివరిస్తూనే వరుసగా అక్కడున్న ఆనాటి సామాజిక స్థితిగతులను చరిత్రలో గత వర్తమానాలకు ముడివేస్తూ భవిష్యత్తును సహితం సచిత్రంగా చిత్రించగల అద్భుత అక్షర శిల్పి వాడ్రేవు చినవీరభద్రుడు అనడంలో అతిశయోక్తి లేదు. బొర్ర గుహలను వర్ణించే క్రమంలో ‘చీకట్లో, అంధకార భరితమైన గుహల్లో, అర్థంలేని అరుపుల్లో ఏదో తెలియని వివశత్వాన్ని పొందుతున్న ఆ మనుషుల్ని చూస్తుంటే, నా అవ్యక్త మానస పాతాళంలో అణిగి ఉన్న ఆదిమానవుడి ప్రాచీన స్మృతులేవో కదిలా”యంటారు. ఇది ఆయనకు మాత్రమే సాధ్యమైన రచనా విన్యాసం. ఇంకో సందర్భంలో “అవునవును. ఒకవైపు గాఢ రహస్య లోకాలు, దానిమీద అచ్ఛాదనగా రంగులు, పువ్వులు, నవ్వులు. లోపల డీప్ సబ్ కాన్షియస్ మైండ్, పైనంతా సబ్లైం య్యాటి. బొర్రా గుహల్లో కనిపించేది మన అంతరంగమే’నని చదివాక పాతిక సార్లు చూసిన వారైనా మరోసారి బొర్రాను దర్శించి తన అంతరంగ ఆవిష్కరణకు ప్రయత్నం చేస్తారనేది వాస్తవం.

‘నేను తిరిగిన దారులు’ చదివిన వారికి కనీసం వందకు పైగా ప్రాచీన, ఆధునిక కవులు, వారి రచనలు వాటి మధ్యనున్న ‘తులనాత్మక భావనా పరంపర సాదృశ్యాలు’ క(వి)నిపిస్తాయి. రోజంతా పనిచేస్తూనే (ఉద్యోగం అటువంటిది) ఇన్ని పుస్తకాలు ఎలా చదివారనే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంగ్లాండు పర్యటనలో రచయిత వివరించిన అంశాల మీద ఓ పరిశోధనా గ్రంథమే రాయవచ్చు. ఈ రచనలో ప్రతీ అక్షరం వెనుక ఓ అదృశ్య రూపంలో అద్భుతమైన భావుకత, మేధోపరమైన ఆవిష్కరణలున్నాయి. చదువుతుంటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి.

యాత్ర రచనలకు ఓ కొత్త రూపునిచ్చిన రచన ‘నేను తిరిగిన దారులు’. ప్రతీ కథనానికి ముందు రాసిన వ్యాఖ్యానాలు ‘నిండుగా’ స్వాగతమిచ్చినట్లుగా ఉంటాయి. “చారిత్రక ప్రాధాన్యత కలిగిన యాత్రా సాహిత్యంలో కొంత వచనం, కొంత కవిత్వం కలగలసి ఉంటాయనీ, కొంత నిర్దిష్ట సమాచారంతో శాస్త్రీయంగాను కొంత ఉత్తేజపరిచేదిగాను ఉండక తప్పదని’ ప్రముఖ యాంత్రోపాలజిస్టు బ్రియాన్ ఫాగన్ తన “ఫ్రం స్టోన్ హెజెంటు సామర్ఖండ్” రచనలో తెలియపరిచిన అంశం ‘నేను తిరిగిన దారులు’ నిండా వాడ్రేవు చినవీరభద్రుడు గారు మెత్తని తివాచీలా పరిచి ఉంచారు. చదివి తీరవలసిన గొప్ప పుస్తకం.

పుస్తకం : నేను తిరిగిన దారులు

ఎమ్మెస్కో.. పబ్లిషర్స్

పేజీలు : 290

వెల: 150 రూపాయలు


సమీక్షకులు

- భమిడిపాటి గౌరీ శంకర్

94928 58395

Tags:    

Similar News

అమరత్వంపై