న్యాయవ్యవస్థ అవస్థను చూపే కథలు..
దేవుడి పేరుతో, బాబాల పేరుతో అమాయక ప్రజలని ఆకట్టుకుని మోసం చేసే వారి నైజాన్ని గురజాడ తన కథల ద్వారా శతాబ్దం క్రితమే ఎండగట్టాడు.
దేవుడి పేరుతో, బాబాల పేరుతో అమాయక ప్రజలని ఆకట్టుకుని మోసం చేసే వారి నైజాన్ని గురజాడ తన కథల ద్వారా శతాబ్దం క్రితమే ఎండగట్టాడు. తన కథలో ఓ పాత్రను ప్రవేశపెట్టి మతం పేరుతో మనుషులను మరలుగా మార్చే మత పెద్దల మతలబుని తేటతెల్లం చేసిన తీరును చదివాం. అమోఘం అనుకున్నాం. సరిగ్గా అలాంటి కథలే రాశారు.. మంగారి రాజేందర్ జింబో.. తను వ్యక్తిగతంగా న్యాయవాది, న్యాయమూర్తి కావడంతో సమాజంలో తాను చూసిన అన్యాయాలపై, సమాజంలో జరుగుతున్న మార్పులపై కథ రాస్తూ అందులో ఓ పాత్ర ద్వారా వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టారు.
'విమర్శ లేనిదే పురోగతి లేదు..! విమర్శను సహించలేని వ్యవస్థలు విధ్వంసానికి పునాదులు. విమర్శని సహృదయంతో స్వీకరించి వ్యవస్థను బాగుపరచుకోవడమా? లేక జరగబోయే/ జరుగుతున్న విధ్వంసాన్ని మౌనంగా చూస్తూ చివరికి ఏమీ మిగల్లేదని ఏడవడమా? అనేది మన ఇష్టం. రాజేంద్ర తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు.' అన్న జస్టిస్ చలమేశ్వర్ ముందుమాట చాలు.. 'నేనూ నా నల్లకోటు' అనే ఈ పుస్తకంలో జింబో తన కథలూ, కవిత్వాలలో వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలపై ఎంత విమర్శనాస్త్రం సంధించారో తెలుసుకోవడానికి..
వాయిస్ లేని వాళ్ల తరఫున..
ఈ పుస్తకంలోని మొదటి కథ 'చెప్పుకోలేని వాళ్ల బాధ' వాయిస్ లేని వాళ్ల వాయిస్‌ని వినడం అందరి కర్తవ్యం అని బోధిస్తుంది. ‘ఎవరైతే మాట్లాడలేరో ఎవరైతే ఏమీ చెప్పుకోలేరో వాళ్ల మాటలు వినడమే పాలకులు చేయాల్సింది. అలాంటి వారే మంచి నాయకుడు అవుతాడు. పాలకుడు అవుతాడు. న్యాయమూర్తి అవుతాడు వాళ్లే ప్రజలకి విశ్వాసాన్ని కలిగిస్తారు. అయితే ఇందులోనే అలా వినేవారు ఎంతమంది ఉన్నారు?' అంటూ రచయిత సందేహం వెలిబుచ్చుతారు.
‘ప్రజాస్వామ్య రాజు’ ఎవరు?
ప్రజాస్వామ్యంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటూ మనమందరం గొప్పగా చెప్పుకుంటాం కానీ అలాంటి స్వతంత్ర న్యాయవ్యవస్థను కాపాడేది న్యాయమూర్తి రూపంలో ఉండే మనిషే! వారికేమి అతీత శక్తులు ఉండవు కదా..! వారికి కుటుంబాలు, ఆశలు ఉంటాయి. అలాంటి వారి ఆశలను కొనేస్తూ స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఎలా తనకు అనుకూలంగా మార్చుకున్నారో.. పాలకులు ఎలా భ్రష్టుపట్టించారో.. తెలియలాంటే ‘ప్రజాస్వామ్య రాజు’ కథ చదవాల్సిందే!
న్యాయవ్యవస్థ పైనే సంధించిన కథలు
అలాగే న్యాయవ్యవస్థలో పాలకులకు నచ్చిన విధంగా జరిగే బదిలీలపై, కొలిజీయం వ్యవస్థపై, న్యాయాధీశులు రాజకీయ నాయకులు ఇచ్చే విందుకు హాజరవ్వడం లాంటి, కోర్టులోని పెండింగ్ కేసుల పేరుతో రిమాండ్‌లో ఉన్న వారి బాధలపై, లాకప్ డెత్ కేసులపై, కేసుల విచారణకు వచ్చిన పోలీసులను, న్యాయమూర్తులు వారి ఈగో కోసం వేధించడం వంటివి, చట్టం ముందూ అందరూ సమానమంటూ సెలవు రోజుల్లో కొందరికి బెయిల్ ఇచ్చి కొందరికి ఇవ్వక పోవడం... ఇలా న్యాయ వ్యవస్థలో జరిగే ప్రతి అన్యాయాలపై తన కోణంలో సున్నితంగా విమర్శ చేశారు..
శవాలనే పీక్కుతింటాం. మరి మీరో...
నా చిన్నప్పుడు చిరంజీవి ఠాగూర్ సినిమా చూసి 'ఏంది..? ఆసుపత్రులు మనుషులను ఇలా పీడిస్తాయా? చనిపోయిన వ్యక్తికి కూడా ట్రీట్‌మెంట్ చేస్తాయా' అని ఆశ్చర్యపోయాను.. ఆ సినిమా తర్వాత కూడా కార్పొరేట్ ఆసుపత్రుల చీకటి బాగోతాల గురించిన ఇలాంటి కథనాలెన్నో మీడియాలో వచ్చాయి. అలాంటి కథే ఈ పుస్తకంలోనూ ఉంది. పేరు 'ఓ గద్ద ఆత్మకథ' మేం చనిపోయిన వాటినే పొడుచుకుని తింటాం కానీ ప్రస్తుతం ఆసుపత్రి వాళ్లు మా మాదిరిగా కాదు.. వారు బతికున్న వారినే పొడుచుకుని తింటారు. అని ఈ కథలో ఒక రాబందు చెప్పిన మాట నిజమే అనిపించక మానదు.
కలెక్టర్లే కాళ్లు మొక్కడంపై..
ఇక చదువుకున్న కలెక్టర్లు ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడం ఎందుకు? వారికి అంతకన్నా పెద్ద పదవి ఏమైనా ఉంటుందా? అని తన అటెండర్ రామయ్య అడిగితే సమాధానం చెప్పలేకపోవడం.. ఇంకా నయం న్యాయ వ్యవస్థలో ఇలా కాళ్లు మొక్కే సంప్రదాయం లేదని రామయ్య అంటుంటే ఆ వ్యవస్థ ఇక్కడా ఉంది కానీ దినపత్రికలో రావని.. ఇలాంటి పనులు చేయనందుకు తన కళ్లకి అటెండర్ రామయ్య ఎత్తయిన ఆంజనేయుడిలా కనిపించాడన్న కథ 'ఆంజనేయుడు- రామయ్య'. పదవుల కోసం వ్యక్తిగత గౌరవాన్ని కూడా పోగొట్టుకోవాలనుకునే కొందరికైనా ఈ కథ కనువిప్పు కలిగిస్తుందేమో..?
రూల్ ఆఫ్ లాకి కొత్త అర్ధం..
మనకి తెలిసి ‘చట్టం ముందు అందరూ సమానులే..అయితే, ‘కోర్టుల్లో కొందరికి ఒకటి రెండు రోజుల్లోనే బెయిల్ వస్తుంది. మరికొంతమందికి ఆ విధంగా రాదు. ఇక పోలీసులేమో ప్రతిపక్షాన్ని ఒక విధంగా అధికార పక్షాన్ని ఒక విధంగా చూస్తున్నారు..' అని 'రూల్ ఆఫ్ లా' కథలోని మన గాడిదకు డౌట్ వస్తుంది. ఇందుకు ఈ కథలోని పోలీస్ పాత్ర 'రూల్ ఆఫ్ లా అంటే ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోవడమే ఎందుకంటే ప్రభుత్వం అంటే ఎవరు? మంత్రులు, ప్రజాప్రతినిధులు..వాళ్లను ఎవరు ఎన్నుకుంటారు.. ప్రజలు ఎన్నుకుంటారు.. వాళ్లు ఎవరి తరఫున మాట్లాడతారు అంటే ప్రజల తరఫున... అంటే మేం ప్రజల మాట వింటున్నామన్నా మాట. ఇదే రూల్ ఆఫ్ లా' అని గాడిదకు వివరిస్తుంది. గాడిదకు అప్పుడు అర్థం అయింది మనం చదువుకున్న ‘రూల్ ఆఫ్ లా’ మనం చూస్తున్న ‘రూల్ ఆఫ్ లా’ వేరని..
గాడిదే ప్రధాన పాత్రధారి..!
జింబో రాసిన ఎక్కువ కథల్లో గాడిదే ప్రధాన పాత్రధారిగా ఉంది. అందుకు కారణం... గాడిద దేనికీ పనికిరాదని మనం అనుకుంటాం పైగా మనుషులు తప్పుచేస్తే గాడిదలుగా వర్ణిస్తారు. తిడతారు.. అలాంటి గాడిదతో మనం చేసే తప్పులపై జ్ఞాన బోధ చేయించాలనే కారణంతోనే అనుకుంటాను... ఆయన తన కథల్లో గాడిదను ఎక్కువగా ప్రధాన పాత్రధారిని చేశాడు. అలాగే హితబోధ చేసే సమయంలో బేతాళ విక్రమార్క పాత్రల ద్వారా చెప్పిస్తారు.
ధైర్యంతో రాసిన తెగింపు కథలు..
మనిషి జీవితంలో ఎన్నో కోణాల అనుభవాలు ఉంటాయి. 'నేనూ నా నల్లకోటు' కథల పుస్తకం రచయిత జింబో ఇందుకు మినహాయింపు కాదు. ఆయన ముందు న్యాయవాది, ఆ తర్వాత న్యాయమూర్తి, వీటన్నింటితో పాటు ఈ సమాజంలోని వ్యక్తి. అందుకే ఈ సమాజం పట్ల తన బాధ్యతని నెరవేర్చారు.. ఇంత నిర్భయంగా, నిక్కచ్చిగా, కథలూ సాహిత్యం రాసిన న్యాయమూర్తి లేరు.. ఇవి రాయడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఆయన చేసి ఈ పుస్తకాన్ని అందించారు.. రచయిత స్వయంగా చెప్పినట్లు మనకి దీన్ని చదవడానికి ప్రత్యేకంగా పెద్దగా ధైర్యం అవసరం లేదు కాబట్టి చదివేద్దాం.. చదివి అవునా ఇలా ఉంటుందా? ఇలా జరుగుతుందా? అని ఆలోచిద్దాం... చదివాక ఈ కథలను మర్చిపోలేం... రోజూలాగానే బతికేయలేం...!
కొసమెరుపు
ఈ పుస్తకంలో వచ్చినా నాలుగైదు కథలు తప్ప ఈ పుస్తకంలోని అన్ని కథలూ ప్రచురించే అవకాశం దిశ పత్రికకే దక్కింది. ఈ మధ్య ఆవిష్కరించిన రచయిత 'మా వేముల వాడ కథలు-2' పుస్తకంలోని చాలా కథలను కూడా దిశ ప్రచురించడం మా అందరికీ సంతోషదాయకం. రావిశాస్త్రి గారి న్యాయవాద జీవితానుభవాల తర్వాత, పతంజలి మెరుపు కథలు, నవలల తర్వాత... న్యాయమూర్తి కోణంలో న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థలోని లోపాలను ఇంత సునిశితంగా రాసినవారు మరొకరు లేరనుకుంటాను. ఈ కథల్లో ఎక్కువ భాగం దిశ పత్రికే ప్రచురించడానికి అవకాశం ఇచ్చిన రచయిత కమ్ న్యాయమూర్తి గారికి కృతజ్ఞతలూ, ధన్యవాదాలూ..
పుస్తకం: నేనూ నా నల్లకోటు
రచయిత: మంగారి రాజేందర్ (జింబో)
94404 83001
ప్రచురణ : ప్రోజ్ పోయెట్రీ
పేజీలు- 151
వెల - 150 రూపాయలు
ప్రతులకు: తెలంగాణ పబ్లికేషన్స్
86399 72160
సమీక్షకులు
-రవి
81212 47221