వర్తమాన తెలంగాణ... చిరు పరామర్శ
సమకాలీన రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై విశ్లేషణాత్మకంగా రాసిన వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలపై ప్రజలకు
సమకాలీన రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై విశ్లేషణాత్మకంగా రాసిన వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలపై ప్రజలకు కావలసిన సమాచారాన్ని అందించి, జరుగుతున్న పరిణామాల సామాజిక మూలాలను చూపించడం విద్యావంతుల బాధ్యత అని ప్రొఫెసర్ జయశంకర్ వంటి పెద్దలు మనకు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మన కళ్ల ముందు జరిగే ఘటనలను విశ్లేషించడం కష్టమైన పనే. వ్యక్తిగతమైన ప్రయోజనాలను పక్కన పెట్టి, భావోద్వేగాలకు లోను కాకుండా సమిష్టి అవసరాల కోసం రాయాలంటే ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి, రాజ్యాంగ నీతికి బద్ధులమై మన చుట్టూ జరిగే పరిణామాలను వీక్షించాలి. జూకంటి ఈ పద్ధతినే పాటించారు.
గాంధీ గారి మూడు బొమ్మలు చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు, చెడు చూడకూడదు అని చెప్తుంటే వర్తమానంలో బాధ్యతను మరిచిన కొంతమంది విద్యావంతులు దీన్ని మరొక విధంగా అన్వయించుకున్నారు. కళ్ల ముందు జరుగుతున్న చెడును, అన్యాయాన్ని వీరు చూడదల్చుకోలేదు, ఆ ఘటనలపైన వ్యాఖ్యానించ దలుచుకోలేదు. చుట్టూ సమాజంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నా మౌనంగా ఉన్నారు. జూకంటి రాసిన 'గాంధీ గారి మూడు కోతులు' పుస్తకంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తలెత్తిన తరువాత తెలంగాణా రాజకీయ, సామాజిక జీవితానికి సంబంధించిన అనేక అంశాల మీద, ఎన్నో ఘటనల పైన లోతైన విశ్లేషణతో కూడిన వ్యాసాలున్నాయి. చివరికి కొన్ని కవితలు కూడా జోడించారు.
తెలంగాణ ఆకాంక్షలు.. చేయాల్సిన పనులు
జూకంటి జగన్నాధం గారు తెలంగాణ ఉద్యమ కాలం నుండి అనేక అంశాలపైన ప్రజాస్వామిక తెలంగాణా లక్ష్యంగా తెలంగాణలో జరిగిన అనేక సంఘటనలపైన స్పందించారు. రెండు అంశాలు ఈ పుస్తకంలోని అన్నీ వ్యాసాలలో ఉమ్మడిగా కనబడుతాయి. ఒకటి, ప్రజల ఆకాంక్షల వ్యక్తీకరణ. ఇక రెండవది, ప్రజాస్వామిక సమాజ నిర్మాణం కోసం మనం చేయవలసిన పనులు. ఈ రెండు అంశాలే దండలో దారం వలె అన్నీ వ్యాసాలను కలుపుతున్నాయి. అందుకే చదువరులకు విడివిడిగా రాసిన వ్యాసాలను కాకుండా తెలంగాణా మీద రాసిన ఒక పుస్తకాన్ని చదువుతున్నట్టు అనిపిస్తుంది.
తెలంగాణకు ముందు, ఆ తర్వాతా...
ఈ వ్యాసాలలో రచయిత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే ప్రజలకు అధికారం దక్కదని తేల్చి చెప్పినాడు. కేసీఆర్ పదేళ్ల పాలన పైన కూడా చాలా విషయాలే చెప్పిండు. తమది ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించుకున్న తెరాస ఉద్యమ ఆకాంక్షలకు తిలోదకాలిచ్చి, ప్రజలకు దూరం జరిగి పూర్తిగా పాలకుల స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యవస్థగా మారింది. ఈ పుస్తకంలో తెలంగాణకు ముందు, తర్వాత తెరాస స్వభావాన్ని వివరిస్తూ వ్యాసాలున్నాయి. రైతుల ఆత్మహత్యలు ఆపడానికి కానీ, చేనేత కార్మికుల అసహజ మరణాలు నిలువరించడానికి కానీ వీసమెత్తు ప్రయత్నం చేయలేదు. సిరిసిల్లా నేత పరిశ్రమ విషయంలో ప్రభుత్వం తెచ్చిన విధానాలు అప్పటికి ఆ పరిశ్రమకున్న మార్కెటును సమూలంగా దెబ్బతీసిందని రచయిత ఈ పుస్తకంలో వివరించాడు.
పౌరసమాజం మౌనం వహిస్తే...
ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి, పునరుద్ధరించడానికి పౌర సమాజం నిర్వర్తించవలసిన విషయాలపైన కూడా పుస్తకంలో వ్యాసాలున్నాయి. సమాజ హితం కోరి పౌరసమాజం మౌనంగా ఉండకూడదు. పౌరసమాజం అనే పదాన్ని ప్రధానంగా కవులు, కళాకారులు, మధ్య తరగతి విద్యావంతులు అనే అర్థంతోనే ఈ పుస్తకంలో ఉపయోగించారు. అది ఎంత క్రియాశీలకంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత ఆరోగ్యంగా ఎదుగుతుంది. అయితే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఈ కర్తవ్యాన్ని పౌర సమాజం ఎట్లా నిర్వర్తించిందో తెలంగాణ ఉద్యమం చూస్తే అర్థం అవుతుంది. గ్రామ గ్రామం తిరిగి తెలంగాణ అవసరాన్నీ ప్రజలకు వివరించి, వారిని చైతన్య పరిచి ఉద్యమంలో ప్రజలను సమీకరించే పని పౌరసమాజం నిర్వర్తించింది. ఈ పని వర్తమానంలోనూ నెత్తిన వేసుకుంటే ప్రభుత్వాలు బాధ్యతగా పనిచేస్తాయని రచయిత తన వ్యాసాలలో వివరించాడు.
మళ్లీ ఐక్యతపై ఆశ
అయితే ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించ లేకపోతున్నాం. కారణాలు కొన్ని పుస్తకంలో ఉన్నాయి. సరళీకరణ ప్రభావం ఉందన్న అభిప్రాయం రచయితకు ఉన్నది. తెలంగాణా ఉద్యమం నాటికే సరళీకరణ బాగా విస్తరించింది. అయినప్పటికీ విద్యావంతులు కదిలి, సంఘటితమై తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కూడా సందర్భం వచ్చినప్పుడు స్పందిస్తున్నారు. ఉమ్మడి లక్ష్యం కనబడితే, ఆ లక్ష్య సాధనతో జీవితం మారుతుందన్న నమ్మకం కలిగితే, అందులో తమకు ఒక పాత్ర ఉందన్న అంచనా స్పష్టమైతే ఇప్పటికీ మళ్లీ ఐక్యంగా కదులుతారు. ఆ విషయాన్ని మరింతగా విశ్లేషించుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. గతాన్ని నెమరు వేసుకొని, వర్తమానాన్ని ఆ అనుభవం ఆధారంగా పరిశీలించడానికి, భవిష్యత్తుకు దారులు వేసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడగలదు.
పుస్తకం : గాంధీ గారి మూడు కోతులు
ప్రచురణ : నయనం ప్రచురణలు, సిరిసిల్ల
రచయిత : జూకంటి జగన్నాథం
94410 78095
పేజీలు :
వెల : రూ. 100
సమీక్షకులు
యం. కోదండరామ్