సబ్బండ వర్గాల జీవన కథలు

Marginollu Book review

Update: 2024-09-29 18:45 GMT

కొన్ని కొన్ని కథలు చదువుతుంటే మనసు ఊహాప్రపంచలోకి తీసుకెళ్తాయి, మరికొన్ని కథలు చదువుతుంటే నిజజీవితం కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతుంది. కథకుడు చెప్పే విధానం బట్టే మనలోని ఆలోచనలదారులు తెరుచుకుని కథలోకి అడుగులు సాగుతాయి. కథను ఏకబిగిగా చదివించే కథలకు ఎప్పుడు పాఠకుడి నుండి అభినందనల వెల్లువ వస్తూనే ఉంటుంది. అలాంటి కథలు రాస్తున్న రచయిత పి. శ్రీనివాస్ గౌడ్ గారు. “మార్జినోళ్ళు” అనే కథల సంపుటితో మన ముందుకు వచ్చారు. మార్జినోళ్ళు అంటే మార్జిన్‌లో ఉన్నవాళ్ళు, నలుగురూ ఉండే చోట కాకుండా విసిరేయబడ్డట్టుగా బతికేవాళ్ళు. ఇందులోని కథలన్నీ మన చుట్టూతా జరిగినవిగా కనిపిస్తాయి. ఈ పుస్తకంలో మొత్తం 12 కథలు ఉన్నాయి. ఒక్కొక్క కథ ఒక్కొక్క ప్రత్యేకత కలదు. ఒక్కో కథలో ఒక్కో వైవిధ్యభరితమైన ఇతివృత్తం కనిపిస్తుంది.

“పీఠముడి” కథలో ఒక ఊరిలో ఒక తాగుబోతు భర్తతో ఒక భార్య పడే అవస్థల గురించి చెప్తుంది. మూగదైనా తన బిడ్డకు బాగు చేయడానికి ఒక సంస్థోళ్ళు ముందుకు వస్తారు. వారితో మాట్లాడి ఆపరేషన్ చేయించడం కోసం తాను పడే ఆవేదన గురించి తెలియజేస్తుంది. తాగుబోతు భర్తను భరిస్తూ తనలా కాకుండా తన బిడ్డ భవిష్యత్తును ఆలోచిస్తూ బిడ్డ బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడానికి ఒక నిర్ణయానికి వచ్చి ‘నా బిడ్డ నాలిక ముడి విప్పడానికి ఎన్ని పీఠముడులనైనా విప్పుతాను’ అని తన బిడ్డ భవిష్యత్తు గూర్చి నిర్ణయం తీసుకునే కథ. ఈ కథ చదువుతుంటే మనకు రోజూ మన కాలనీలోనో, ఊరిలోనో నిత్యకృత్యంగా కనిపించే జీవితాలు కనిపిస్తాయి. ‘గాలికి లేచిన ఆకులు’ కథలో గాలిలో ఎండుటాకులు ఎట్టబడితే అట్టా ఎటుపడితే అటు గాలికి చెల్లా చెదురైపోతాయో అలాగే కొన్ని జీవితాలు కూడా అంతే. వారి జీవితం వారి చేతిలో ఉండదు. ఇందులో భవాని పాత్ర మలిచిన తీరు బాగుంది. ఎలాంటి ఆధారం లేక జీవితంలో తన దారి ఎటో తెలియక, తన జీవితానికి ఎలాంటి ఆధారం లేకుండా ఉండడంతో, బతకడానికి తను వేశ్యగా మారిన తీరును చిత్రీకరించిన తీరు బాగుంది.

మరో కథ "నా కొడుకు లచ్చిమి" ఈ కథ సాగిన తీరు భలేగా ఉంటుంది. లచ్చిమి అంటే ఎవరో అనుకునేరు 'రావణమ్మ' సాదుకుంటున్న సూడిబర్రె. లచ్చిమి అంటే ఎంతో ప్రాణంగా కన్న కొడుకులా చూసుకుంటుంది . ఎంత దూరం ఉన్నా లచ్చిమి అనిపిలిస్తే వెంటనే తన దగ్గరికి వస్తుంది అంటూ ఎంతో మురిసిపోతుంది రావణమ్మ. దానికి ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. దారిన పోయేవాడు ఆగి.. తొలిసూరీ బర్రికి ఇది తినిపించాలంటే ఇక అది తినిపించేదాకా ఊరుకునేది కాదు. రావణమ్మ వ్యవహారం చూసినోళ్లు లచ్చిమికి సీమంతం చేసినా చేసిద్దని ఎకసెక్కాలాడేవారు . ఒకరోజు లచ్చిమి తప్పిపోతోంది, మళ్లీ దొరికేంతవరకు రావణమ్మకు ఊపిరాడదు. లచ్చిమిని చూడగానే సంతోషంలో ఎక్కడో లోకంలో ఉన్నట్టు మాట్లాడుతుంది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో దాదాపుగా పశువుల పెంపకం ఉంటుండే వాటిపైన ఇంట్లోవారిలాగా అందరూ ప్రేమను పంచేవారు. ఈ కథ చదువుతుంటే మనుషులకు మనుషుల పైనే కాదు, పశువులపైన వల్లమాలిన ప్రేమ ఉంటుందని కథకుడు చెప్పిన విధానం బాగుంది. ఈ కథల్లో రచయిత తీసుకున్న వస్తువు కంటే, ఆ వస్తువును కథగా మలచిన విధానం చాలా బాగుంటుంది.

బడుగు బలహీన వర్గాల జీవితాలలో తలదాచుకోవడానికి గూడు కోసం ఎంత పరితపిస్తారో, వారు వేసుకున్న పాకలను కూలగోడుతుంటే వారి మనో వేదనను ఈ కథలో చక్కగా చిత్రీకరించారు. ఈ కథ పేరే ‘మార్జినోళ్ళు’. ముప్పై నలభై ఏళ్లుగా రైల్వే స్థలాలలో పాకలు వేసుకుని నివసిస్తున్న వారికి ఉన్నఫలంగా ఆ స్థలం ఖాళీ చేయాలని రైల్వే వోల్లు నోటీసులు పంపించడం జరుగుతుంది. నోటీసులు చూసిన జనాలు అక్కడ మట్టిని వదిలే చోటికి పోవాలంటే మనసంతా చేతికి కాలు చేయి ఆడక గుండెలు గుబగుబలాడిపోతుంటాయి మార్జినోళ్ళకి. రైల్వే వోళ్ళు ప్రోక్లైన్లతో వారి గుడిసెలను ఒక్కొక్కటి పోగులేస్తుంది సామాన్లను అంతా చిందర వందర చేసేసరికి వారి కష్టార్జితమంతా నేలపాలవుతుంది. వాళ్లంతా తలదాచుకోవడానికి వేరొక స్థలం చూపించమని ఎమ్మార్వో చుట్టూ ఆఫీసులో చుట్టూ తిరుగుతూ ఉంటారు. అందరూ కలిసి పరం పోగు భూమి అయినా స్వామి నాయుడు ఆధీనంలో ఉన్న స్థలంలో గుడిసెలు కట్టుకుంటారు. ఆ స్థలం ప్రైవేటు వారి ఆధీనంలో ఉన్నందువలన వాళ్ళు వచ్చి ఆ గుడిసెల మీద దాడి చేయిస్తారు. ఈ విషయం ఈ నోట ఆనోట పాకి చివరికి మీడియా దృష్టికి వెళ్లి రచ్చ రచ్చ అవుతుంది. ఎట్లైన ఆ స్థలాన్ని దక్కించుకోవడానికి మార్జినోళ్లంతా ఏకమై వాళ్ల పిడికిళ్ళు బిగుసుకుంటాయి. స్వామి నాయుడు స్థలంలోని పాకల్లో కిరోసిన్ బుడ్లు ఇప్పుడు ధైర్యంగా వెలుగుతున్నాయి. ఇక్కడ రచయిత మనుషులు అందరూ కలిసి ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని, విడివిడిగా ఉన్నట్లయితే ఎవరైనా మనల్ని శాసించవచ్చు అని గొప్పగా చెప్పారు.'దిక్కు తెలీని పక్షులు' కథలో కరోనా కాలం నాటి పరిస్థితులకు ప్రజలు పడిన అవస్థలు కళ్ళకు కట్టినట్టు సాగుతుంది కథ .

పి. శ్రీనివాస్ గౌడ్ గారు మంచి కవి. ఎన్నో భాషల నుండి సాహిత్యాన్ని అనువాదం చేశారు. ఇప్పుడు తాజాగా రచయితగా కథల సంపుటి వెలువరించారు. ఈ కథలు వివిధ పత్రికల్లో, సాహిత్య మ్యాగజైన్‌లలో ప్రచురితమైనవి. ఈ కథల్లో ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతంలో మాట్లాడే భాషలో రచన సాగుతుంది. కథలు ఎక్కడ బోర్ కొట్టకుండా, ఆలోచింపజేసేవిగా, ఎప్పటికి గుర్తుండిపోయే విదంగా ఉన్నాయి. అందరు చదువుకునే విదంగా కథలు రాసిన రచయితకు అభినందనలు తెలియజేస్తూ, ఇంకా మరెన్నో సాహిత్య సంపుటాలు వెలువరించాలి కోరుకుంటూ..

పుస్తక వివరాలు..

పుస్తకం : మార్జినోళ్ళు - కథలు

పేజీలు : 144, వెల : రూ. 200/-

ప్రతులకు సంప్రదించండి

9949429449


సమీక్షకులు..

గాజోజి శ్రీనివాస్

99484 83560

Tags:    

Similar News

అమరత్వంపై