మార్పును సమర్థించిన కథలు

manushi book review

Update: 2023-11-19 19:00 GMT

స్త్రీగా తన అనుభవం, చదువుకున్న వ్యక్తిగా సమాజంలో స్త్రీ స్థానం పట్ల పరిశీలన, ఆలోచనాత్మకంగా రెండో స్థానంలో నిలిచిన స్త్రీ పరిస్థితి పట్ల ఆవేదన, స్త్రీ ఉన్నతి కోసం ఏదో చేయాలనే తపన, స్త్రీ సమస్యల పట్ల పరిష్కారం చూపగల సామర్థ్యం, స్త్రీ అభ్యున్నతికి దారులు వేయగల తెలివి గల రచయిత్రి శాంతిశ్రీ బెనర్జీ. ఆమెకు కాళీపట్నం రామారావు గారి మాటలు దృక్పథాన్ని అందించాయి. ఈ విషయం ఆమె అందించిన 'మానుషి' కథల సంపుటి ద్వారా తేటతెల్లమవుతుంది. చిన్ననాటి నుంచి వాలంటరీ రిటైర్మెంట్ వరకు తను చూసిన సమాజం అనూహ్యమైన మార్పులకు లోనైంది. బాల్యం, యవ్వన దశల్లో తను ఎదుర్కొని, అనుభవించిన స్థితుల పట్ల ఎరుకతో కూడిన అభిప్రాయాలు ఉంటవి. వాటిని ఖండిస్తూ, నిరసిస్తూ, కొత్త దారుల్లో వెళుతున్న యువత మార్గాన్ని అక్కున చేర్చుకోవడం కథల్లో కనపడుతుంది. ఆ విధానాన్ని పాటించడానికి కథల్లోకి నాటకీయతను తెచ్చింది. 'అనివార్యం' కథ అందుకొక ఉదాహరణ. సహజీవనం అనే జీవనరీతికి తన ఒప్పుదలలో కనబడింది.

మెట్టినింటి వారి స్త్రీ మూర్తి జీవితం ఆధారంగా రాసిన కథ 'వంచిత'. నాటి సమాజంలో స్త్రీ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపెట్టింది. అగ్రవర్ణ స్త్రీ జీవితం ఎదుర్కొన్న ఆటుపోటులను, హృదయ విదారకమైన స్థితిని, మగపెత్తనం చెలాయించిన జులుంను ఈ కథ చక్కగా చిత్రించింది.నాటి ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల నుంచి సులువుగా వెళ్లగలిగే మార్గం పురుషుడికి బందీగా పడి ఉండే బాధ్యత స్త్రీకి ఉండటం వివక్షకు తార్కికంగా కనబడుతుంది. ఆ ఉక్కపోతలో రాసుకున్న ఉత్తరాలు, కవితలు ఆమెకు కాస్తంత ఊరట. అవి చేరవలసిన చోటికి చేరవనే విషయం తెలిసి విషాదం. సనాతన బ్రాహ్మణీయ కుటుంబంలోని హింసను, అసంబద్ధతను, ఒత్తిడిని కథ విపులంగా చర్చించింది. స్త్రీలపై జరిగే అణచివేతను వారి నిస్సహాయతను, ప్రదర్శనకు పెట్టింది. వికసించి, పరిమళిస్తున్న పుష్పాన్ని రేకులు విరిచి నిలబెట్టిన తీరు హృదయ విదారకం. హృదయం చచ్చిన ఆమెపై ఆర్థిక లేమి దాడి చేయడంతో శారీరకంగా లోకం విడవక తప్పని పరిస్థితి కలగడం, వ్యవస్థ లోపం అని కథ నిర్ధారించింది. దీనికి భిన్నంగా ద్వంద్వ విలువలను అంతస్తు తెచ్చిన అమానవీయతను ప్రదర్శించిన కథ 'మారిన విలువలు'. ఒకే ఆశయాలు కలిగి ఒకే చోట చదువుకున్న ఇద్దరు స్త్రీలలో కలిగిన మార్పును ఈ కథ చెప్పింది. హిపోక్రసీతో తప్పుడు విలువల్ని ఒంటపట్టించుకున్న స్త్రీ ఒకవైపు, మొదటినుంచి నమ్మిన ఆశయాలపై నిలబడిన స్త్రీ మరోవైపున నిలబెట్టి వారి మధ్య గల వైవిధ్యం ఆధారంగా కథ నడిచింది. కథలోని ఘర్షణ కథను నడిపించింది.

సీతమ్మోరి కష్టాలు అని ఒక పలుకుబడి. దానికి సమర్థింపుగా 'సీత' కథ ఉంది. ప్రామాణిక ఆంక్షలు పురుషుని కంటే స్త్రీ పట్ల మరింత కఠినంగా ఉంటాయి. అందుకేనేమో కథ మొదలు తుది వరకు సీతకు ఆపన్న హస్తం అందించే పాత్ర ఒకటుంది. పేదింటి స్త్రీ జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో కథ చూపింది. కథ చివర్లో కథ ఎందుకు రాశానో రచయిత్రి చెప్పింది. అలా చెప్పడం అవసరం లేదు. చాలా కథల్లో మధ్య, మధ్య రచయిత్రి తన అభిప్రాయాల్ని చెప్పింది. కొన్ని కథల్లో అది కుదిరింది.

ఒక లెస్బియన్ కథను అందంగా చెప్పిన కథ 'అసహజమనిపించే సమాజం' కథ. విడాకులు పొందిన స్త్రీకి పెళ్లి చూపులతో కథ మొదలవడం ఆకట్టుకుంది. భర్త కలయికను సమ్మతించని భార్య చేష్టలు, అతడి చర్యలు, పాఠకుడిని ఉత్కంఠకు గురి చేశాయి. కథ మూడొంతులయ్యాక కూతురు లెస్బియన్ అని తల్లితోపాటు పాఠకునికి తెలుస్తుంది. అక్కడ కల్పించిన సన్నివేశం కథను మలుపు తిప్పుతుంది. కథలో అసలు విషయం తెలిపే సందర్భంలో అభ్యంతరకరమైన మాటలు లేవు. ఇరువురి కలయికలో జుగుప్సకు తావివ్వలేదు. నిరలంకారంగా సాగిన కథ, దగ్గరగా చూసిన జీవితాన్ని చెప్పినట్లుగా ఉంది. తల్లి మరి స్వలింగ సంపర్కురాలైన కూతురు మేలు కోరడం అభ్యుదయకరం.

కట్టుకున్న భర్తలోని నచ్చని గుణాలతో రాజీపడి జీవితం గడిపిన తల్లి, మొదట్లోనే భర్తలోని అవగుణాలన్ని భరించలేక వదిలేసిన కూతురును సమర్థించిన తీరు 'నిర్ణయం' కథలో కనబడుతుంది. తనదాకా వస్తే.. కాని అర్థం కాదు అంటారు. ఈ మాట 'ఆత్మగోచరం' అనే కథకు సరిపోతుంది. వస్త్రాల్ని మార్చినట్లు మగ స్నేహితులను మార్చుతూ లైఫ్ ఎంజాయ్‌ చేయడమే పనిగా పెట్టుకున్న ప్రవళిక కట్టుబాటు లేకుండా జీవించింది. ఆ క్రమంలో అనేకులను ఇబ్బంది పెట్టింది. మనిషికి కట్టుబాటు అవసరం అని ఆమె ప్రేమలో పడ్డాక తెలిసింది. తను ప్రేమించిన వాడు కాదన్నాక బాధను అనుభవించింది. దీన్నే రచయిత్రి వాట్ యాన్ ఐరనీ ఆఫ్ లైఫ్ అని ఒక పాత్రలో అనిపించింది. సాధారణ కథనం ద్వారా ఆసాధారణ విషయం అందివ్వడం ఈ కథల్లో కనబడుతుంది దానికి 'తరాల మధ్య అంతరాలు' కథ నిదర్శనం. పిల్లలు వద్దనుకోవడం, అవసరమైతే దత్తత తీసుకోవడం, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని సమాజ సేవ చేయడం, రెగ్యులర్‌గా మగవాడు వంట చేయడం, ఇష్టమైనది తినడం కథలో కనిపిస్తాయి. ఇవన్నీ సమాజంలో ఒక కొత్త కల్చర్ నెలకొనడానికి పాదువేసేవిగా కనిపిస్తాయి.

ప్రేమాస్పదురాలైన స్త్రీ తిరుగుబాటుదారుగా 'ఆత్మాభిమానం', కథలో కనపడుతుంది. ముగింపు ఈ కథకు సార్ధకతను చేకూర్చింది. అదే లేకుంటే మామూలు కథగా మిగిలిపోయేది. కుటుంబంలోని ఒత్తిడి, సామాజిక కట్టుబాట్లు పురుషుని కంటే స్త్రీని ఎక్కువగా కట్టడి చేస్తాయి. ఒదిగి జీవితం వెళ్ళదీసేవాళ్ళు కొందరైతే, ఒదగలేక సతమతమయ్యే వాళ్ళు మానసిక రోగులుగా మారతారు. ‘గ్రహణవిముక్తం’ అనే కథలో ‘స్కిజోఫ్రేనియా’ అనే మానసిక రోగానికి చెందిన లక్షణాలను పూసగుచ్చినట్టుగా రాసింది. రోగి పట్ల బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు, కోలీగ్స్, ఇతరులు చూపే స్పందనలను ముఖ్యంగా సూటిపోటి మాటలు, గుసగుసలు పోవడాల గురించి, వాటి ప్రభావాలు రోగిపై ఉండే విధానాన్ని విపులీకరించింది. మానసిక రోగులను ఆత్మనూన్యతకు గురిచేసే పరిస్థితులు పోవాలి అని రచయిత్రి అభిప్రాయపడింది. స్త్రీని శారీరకంగానే కాక మానసికంగా కూడా రోగిగా ఈ వ్యవస్థ తయారు చేస్తుంది. కథలోని పాత్ర ఆ మచ్చ మోసుకుంటూ జీవితాంతం బతకవలసిందేనా! అని సూటిగా ప్రశ్నిస్తుంది. స్త్రీల పట్ల వివక్ష ఉందనేది సత్యం. అదే సమయంలో వారి పట్ల ఉదారంగా ఉండే పురుషులున్నారనేది నిజం. అలాంటి పురుష పాత్రలను ప్రధానం చేస్తూ సమానత్వ భావనను అందించే కథలు రావాలి. ‘తిత్రి', 'నెహ్రూ గారి భార్య’ లాంటి కథల్లో స్త్రీలు భరించిన కష్టాల పట్ల కనిపించిన కరుణ ఉన్నతమైనది. స్త్రీ పురుష సంబాధాల్లో ఉదార వైఖరులు, ప్రజాస్వామిక భావనలు నెలకొల్పగల కథలు భవిష్యత్తులో వీరి కలం నుండి రావాలి.

-డా. బి.వి.ఎన్ స్వామి

92478 17732

Tags:    

Similar News

తొడుగు