నేను ఇటీవల హాజరైన సాహిత్య సమావేశాల్లోనూ, పుస్తక ఆవిష్కరణలు, పుస్తక పరిచయ సభల్లోనూ అతి పొగడ్తలను, జ్ఞాన వమనాలను గమనించాను. సభల్లోనే కాదు పుస్తకాల ముందు మాటల్లోనూ ఇవి ఎక్కువయ్యాయని చెప్పక తప్పదు. వక్తలు, సమీక్షకులు, ముందుమాటల రచయితలు తమను పిలిచిందే లేదా రాయమన్నదే అతిగా పొగడడానికన్నట్లు తయారయ్యారనిపిస్తోంది వారి ధోరణి చూస్తే, సదరు కవి లేదా రచయితలో విషయమున్నా లేకున్నా తెగ పొగిడేస్తున్నారు. ఈ పొగడ్తలకు కూడా అనేక ప్రాతిపదికలు ఉన్నాయనిపిస్తోంది.
రేంజ్ బట్టి పొగడ్తలు..
సదరు కవి లేదా రచయిత ఏ సమూహానికి చెందిన వాడో ఆ సమూహానికే చెందిన పెద్దలనో, పీఠాధిపతులనో వక్తలుగా, సమీక్షకులుగా ఎంచుకోవడం సహజ ఆనవాయితీ. దాంతో తమ సమూహం వాళ్లైతే ఒక విధంగా, పర సమూహం వాళ్ళైతే మరో రకంగా వక్తల ఉపన్యాసాలు, సమీక్షలు ఉంటున్నాయి. ఎంచుకున్న పెద్దలు పీఠాధిపతులకు సదరు కవి లేదా రచయిత ఎంత గౌరవం ఇస్తాడు. ఎంతో వినమ్రంగా ఉంటాడు. అనే కొలతల్ని బట్టి పొగడ్తలు ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో సదరు సాహిత్య సభకు ముందు రోజు రాత్రి లేదా సభ జరిగిన రోజు రాత్రి ప్రవహించే ద్రవ పదార్థాలను బట్టి కూడా పొగడ్తల రేంజ్ ఉంటోందని ఒక ఉవాచ. ఇక జెండర్‌ను బట్టి కూడా మరో స్థాయిలో పొగడ్తలు అందుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏతా వాతా తేలేదేమంటే చేసే వంధిమాగధత్వాన్ని బట్టి, పెట్టే ఖర్చును బట్టి పొగడ్తలు దక్కుతున్నాయి. మరి కొంతమంది విస్తృతమైన లాబీని మెయింటైన్ చేస్తారు. వారి సాహిత్యంలో సరుకున్నా లేకపోయినా లబ్ద ప్రతిష్టులైన వారందరూ హాజరై ఆకాశానికి ఎత్తుతారు. అలా ఎత్తిన వారికి దక్కే రాచమర్యాదలు తీరే వేరు. ఇవన్నీ వెగటుగా ఉన్నాయని గ్రహించినా హాజరైన సభికులు సైతం ఆ కవి లేదా రచయిత ఆ అతిపొగడ్తలకు అర్హుడేనన్నట్లు నటించడం సాహితీ లోకపు అతి పెద్ద విషాదం. వీటితో బాటు వివిధ పత్రికల్లో వచ్చే రచనలు, సమీక్షలు, వ్యాసాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆయా పత్రికల్లో సాహిత్య పేజీలను చూసే వారితో ఉన్న పరిచయాలు, అనుబంధాలు, వారిని ప్రసన్నం చేసుకునే తీరును బట్టి, పరస్పర ఉపయోగాన్ని బట్టి కూడా ప్రచురణలు, పొగడ్తలు ఉంటున్నాయి.
కవికే అర్థం కానీ అర్థాలు చెప్పి..
అతి పొగడ్తలు ఒక తరహా అయితే సాహిత్య విమర్శకులుగా పేరొందిన వారు, సమీక్షకులు చేసే అతి జ్ఞాన వమనం మరొక ఎత్తు. సదరు కవి లేదా రచయిత సాహిత్యంలోని మూలాంశాలని, శక్తిని, బలాలను, బలహీనతలను, సమాజంపై లేదా చదువరిపై చూపగల ప్రభావాల్ని వివరించడానికి బదులు తమకు ఏ స్థాయి నాలెడ్జ్ ఉందో సభికుల ముందు ప్రదర్శించడానికి ఉత్సాహపడుతుంటారు. తమకు ప్రపంచ సాహిత్యం ఎంత లోతుగా తెలుసో పలు ఉదాహరణలతో వివరిస్తారు. ఏ ఆఫ్రికా, అమెరికా, స్వీడన్, ఇరానియన్, మరాఠీ, మలయాళీ కవినో, రచయితనో కోట్ చేసి ఆయన ఇలా రాశాడని, ఈ కవి కూడా అలానే రాశాడని పోలికలు పెట్టేస్తారు. సభికులు సదరు కవి కాపీ చేశాడా అనే సందిగ్ధంలో పడతారు. విమర్శకుడు మాత్రం అన్ని కవితలకు వివిధ భాషల్లోని కవుల కవితల్ని వినిపించి సదరు కవి కూడా అచ్చు ఇలానే రాశాడని ముక్తాయిస్తాడు. ఆ కవులెవరో, వాళ్లేం రాశారో ఈ కవికి అస్సలు తెలిసి ఉండదు. ఆ కవికి తెలుగు భాష తప్ప మరో భాష కూడా వచ్చి ఉండదు. వెర్రి ముఖం వేసుకుని బిత్తర చూపులు చూడడం తప్ప మరేం చెయ్యలేడు. ఆ విమర్శకుడు అంతటితో ఊరుకోడు. ఈ కవి అంతర్లీనంగా ఫలానా సిద్ధాంతం ప్రతిపాదించాడు అంటాడు. కొన్ని కవితలకు రాసిన కవికే అర్థం కాని కొత్త అర్ధాల్ని చెబుతాడు. విమర్శకుల వారి మేధస్సుకు, జ్ఞాన ప్రదర్శనకు అబ్బుర పోవడం సభికుల వంతు అవుతుంది. సదరు కవి మాత్రం నాకు తెలియకుండానే ఇన్ని సిద్ధాంతాల్ని, అర్థాల్ని నేను పలికించానా అని మల్లగుల్లాలు పడుతుంటాడు. ఇదో అంతు చిక్కని విషాదం.
ఇలాంటి విషాదాలు సాహిత్య ప్రేమికులైన వారు తరచూ ఎదుర్కొంటూనే ఉన్నారు. అయినా నోరు విప్పరు. ఎందుకో తెలియదు. పొగడ్త అవసరమే కానీ అది హద్దుల్లో ఉంటేనే ముద్దు. సరుకు లేని సాహిత్యాన్ని కూడా ఆకాశానికి ఎత్తి, అదే అసలు సిసలు సాహిత్యమని భ్రమింపచేసి, నిజమైన సాహిత్యాన్ని తొక్కి పెట్టడం సాహిత్య ద్రోహమే కాదు హత్యా నేరంతో సమానం కూడా. అలాగే అతి జ్ఞాన వమనం కూడా సహించరానిది. అది సదరు కవి లేదా రచయితను ఒక రకంగా ఇన్సల్ట్ చేయడమో లేదా లేని శక్తులను, ప్రాధాన్యతను ఆపాదించడమో అవుతుంది. ఇది కూడా సాహిత్య ద్రోహమే. ఈ ద్రోహాలకు చరమగీతం పాడినప్పుడే నిజమైన సాహిత్యం వర్ధిల్లుతుంది.
- వి.ఆర్. తూములూరి
97052 07945