సినీ గీతమైనా.. అరణమిచ్చిన జాతి గొంతుక

komuram bheemudo komuram bheemudo song book

Update: 2023-11-19 19:15 GMT

సినిమాలంటే అందరికీ ఇష్టమే. సినిమా సంగతుల పట్ల కూడా ఎవరికైనా ఎంతో కొంత ఆసక్తి ఉంటుంది. అందుకే పత్రికల్లో సినిమా పేజీలకే పాఠకులు ఎక్కువ. తెలుగు సినిమాలు ప్రధానంగా ఎన్నో పుస్తకాలు కూడా వచ్చాయి. సినిమాల కథలు, సంభాషణలు, అందమైన బొమ్మలతో వచ్చిన పుస్తకాలు ఆదరణ పొందాయి. అలా తెలుగు సాహిత్యంలో సినిమా రచనలు తమ స్థానాన్ని పదిలపరచుకున్నాయి. ఇప్పుడు ఒక తెలుగు సినిమాలోని ఒక పాట పైనే ఒక పుస్తకం వచ్చింది. ఒకే పాటను విశ్లేషిస్తూ 25 మంది వ్యాసాలు రాయడం ఒక అరుదైన సాహితీ సందర్భంగానే భావించాలి. ఆ పాటలో అంత విస్తృతి, దృశ్య ప్రాధాన్యత, భాషాపాటవం, చారిత్రక ప్రాసంగికత ఇలా ఎన్నో మెరుపులుంటే తప్ప వ్యాస భిన్నత సాధ్యపడదు. గీత రచయితకు కూడా ఇది సవాలే.

అయితే ఆ పాట ఏమిటో తెలిసాక ఆ గీతానికి అంత సత్తా ఉందనిపిస్తుంది. అది ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని 'కొమురం భీముడో..' పాట. డా. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాట సినిమా అంతర్భాగమై ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. సినిమాని హై రేంజ్ క్లైమాక్స్‌కి తీసుకుపోయే మూలమలుపులో ప్రేక్షకుల మూడ్‌ని పూర్తిగా సినిమాలోకి లాగేసే పనిని ఈ పాట చేపట్టింది. అందులో ఈ పాట పరిపూర్ణంగా విజయం సాధించింది.అందుకే ఈ పాట విశేష ప్రేక్షకాదరణతో పాటు విశ్లేషణాత్మక పుస్తకమైంది.

భీం గుణానికి శిల్పం ఈ పాట!

కొమురం భీం నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించిన తెలంగాణ ఆదివాసీ బిడ్డ. సినిమాలో ఒక ప్రధాన పాత్ర అయిన భీంలో కల్పన పాలు ఎక్కువైనా అశోక్ తేజ మాత్రం ఆదివాసీలకు దైవ సమానులైన కొమురం భీం ధీరత్వాన్ని, జాతి ప్రేమని, త్యాగనిరతిని తన అక్షరాలతో చెక్కారు. రూపానికి ఆయన బొమ్మలాగే భీం గుణానికి శిల్పం ఈ పాట. ఈ పుస్తకానికి ముఖ ద్వారాలుగా సీ. హెచ్ విద్యాసాగర్ రావు, జూనియర్ ఎన్టీఆర్, ఎస్ ఎస్ రాజమౌళి, ఎం.ఎం కీరవాణి, విజయేంద్ర ప్రసాద్‌ల అభినందన వచనాలున్నాయి. వీరంతా పరిచయం అక్కరలేని ప్రముఖులే. ఒక్కరు మినహా అందరూ ఆర్‌ఆర్‌ఆర్ మూలస్తంభాలే. 'తెగుతున్న భీం నరనరాన్ని తన పాటకు స్వరంగా మార్చుకున్నాడేమో అనిపించే విధంగా ఈ గీతాన్ని చెక్కాడు సుద్దాల అశోక్ తేజ' అని విద్యాసాగర్ రావు ఒక్క వాక్యంలో పాట రాతలోని ఘనతని వివరించారు. 'ఈ పాట నా నోట పలకగలగడం నా జీవితంలో ఒక మహోత్కృష్ట ఘట్టం, ఈ పాటలో 'సెర్మామొలిసే దెబ్బకు అబ్బంటోగాలా, సిలికే రక్తము సూసి సెదిరితోగాల, బుగులేసి కన్నీరు వలికి తోగాల భూతల్లీ సనుబాలు తాగనట్టేరో' అనేవి తనకు నచ్చిన వాక్యాలు' అని జూ.ఎన్టీఆర్ పేర్కొన్నారు. 'ఈ పాట నా సినిమాలో ఉండటం నా అదృష్టం' అని 'కాలువై పారే నీ గుండె నెత్తురు .. అమ్మ కాళ్ళ పారణైతుంది సూడు' అన్న వాక్యం నాకు తెలిసినంత వరకు తెలుగు పాటల్లోనే అత్యంత అద్భుతంగా రాసిన వాక్యాలలో ఒకటి' అని దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యానించారు. ఈ పాటను తమ కోణంలోంచి విశ్లేషించిన వారిలో ప్రొ. కాశీం, ఓల్గా, ప్రొ. కాత్యాయని విద్మహే, డా. బెల్లి యాదయ్య, డా. కోయి కోటేశ్వరరావు, స్వాతి శ్రీపాద, శ్రీరామోజు హరగోపాల్, అయినంపూడి శ్రీలక్ష్మి, తగుళ్ల గోపాల్ తదితరులున్నారు.

ఎన్నో ప్రశంసలు..

సుద్దాల అశోక్ తేజ తన పాటలకు తానే పోటీ పెట్టుకోవడం వైచిత్రి అని ప్రొ. కాశీం అన్నారు. సినిమా పేరులో ఉన్న రౌద్రం, రణం, రుధిరం ఈ పాటలో ఉన్నాయని కాత్యాయని విశదపరచారు. ఈ పాట 'నెత్తురొలికే పిల్లన గ్రోవి ఆత్మగౌరవ గీతం' అని కోటేశ్వరరావు మూడు ముక్కల్లో చెప్పారు. 'సాహితీ సామ్రాజ్యంలో పదికాలాలు నిలిచే పాటల్లో ఇది ఒకటి' అని స్వాతి శ్రీపాద తీర్మానించారు. కవి శివసాగర్ 'నరుడో భాస్కరుడో..'పాటతో దీన్ని పోల్చారు తగుళ్ల గోపాల్. 'ఈ పాటను నేను 45 నిమిషాల్లో రాయడానికి నా శ్రమతో పాటు దర్శకులు రాజమౌళి కథన వివరణ కూడా తోడ్పడింది' అని పేర్కొంటూ ఈ పుస్తకం రాకకు తోడ్పడిన వారందరికీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ తన 'నమస్సులు' తెలిపారు.

ఆస్కార్ తదితర ప్రపంచ స్థాయి అవార్డులు, దేశదేశాల గుర్తింపు పొందిన పాన్ ఇండియా సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌లో భాగమవ్వడం అరుదైన అవకాశం, గొప్ప గౌరవం. ఈ సందర్భ గీత రచనకు తప్పకుండా తనకే అవకాశం వస్తుందని ఎన్నో రోజులు దర్శకుడి ఫోన్ కాల్ కోసం ఎదురుచూశానని, చివరకు నా నమ్మకం నిలబడిందని ఓ ఇంటర్వ్యూలో అశోక్ తేజ అన్నారు. పాట దక్కడంతో పాటు ప్రజల నీరాజనాలందుకోవడం రచయితకు గొప్ప విజయ సూచకం. ఒక సినిమా పాటకు సాహితీవేత్తల నుంచి, సినీ ప్రేక్షకుల నుంచి ఏకకాలంలో ప్రశంసలు అందుకునే సందర్భం అప్పుడప్పుడు గెలిచే వరల్డ్ కప్ లాంటిదే!

‘డా. సుద్దాల అశోక్ తేజ కొమురం భీముడో ..కొమురం భీముడో పాట - కొన్ని మాటలు';

సంపాదకుడు ఎం. విప్లవకుమార్

ఈ పుస్తకం పేజీలు 130, వెల రూ. 165/- అన్వీక్షికి ప్రచురణలు

97059 72222 సంప్రదించండి! ఆమెజాన్‌లోనూ లభ్యం!

-బి.నర్సన్

94401 28169

Tags:    

Similar News

తొడుగు