తెలంగాణ భాషలో ‘జోర్దార్ కతలు’
Introduction to Zordar book with children's stories
తెలంగాణ భాషపై ఎక్కువగా ఉర్దూ ప్రభావం ఉన్నది. ప్రత్యేకించి హైదరబాదీ ఉర్దూ ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతుంది. తెలంగాణ యాసకు ఉన్న ఈ ప్రత్యేక శైలి వలన ఈ యాస ఎంతో ప్రాచుర్యం పొందినది. అందుకే సాహితీవేత్తలు ఈ యాసకే మొగ్గు చూపుతారు. ఇలా తెలంగాణకు చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త పైడిమర్రి రామకృష్ణ తెలంగాణ భాషలో వెలువరించిన తాజా కథల సంపుటి ‘జోర్దార్ కతలు’.
భాష గొప్పతనం తెలుసుకోవాలంటే..
కేవలం తెలంగాణ ప్రాంత పిల్లలకే కాకుండా తెలుగు తెలిసిన అన్ని ప్రాంతాల బాలలు చదువుకునేలా సరళ శైలిలో కథలు నడిచాయి. ప్రధాన భాషలో చదివినంత వేగంగా మట్టుకు ఈ యాసలో ఉన్న కథలు చదవలేరు. ఐతే కొత్త పదాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారికి గమ్మత్తు గమ్మత్తు గా అనిపిస్తాయి. తెలంగాణ భాషా సొగసులను, సౌందర్యాన్ని, మాధుర్యాన్ని తెలిజేస్తాయి. ఈ 'జోర్దార్ కతలు' సంపుటిలో మొత్తం 12 కథలున్నాయి. మొదటి కథ ‘ఉల్టా - పల్టా’ చివరి కథ ‘మారిన కోతి’. ఈ సంపుటిలోని కథల్ని పరిశీలిస్తే ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రాణహిత, కిన్నెరసాని, భద్రాచలం, పాకాల వంటివి బాలలకు పరిచయం చేస్తారు. జంతువులు, పక్షులే ప్రధాన పాత్రలుగా రాసిన కథలు తాంబేలు, గుడ్డెలుగు, శిల్క, లొట్టిపిట్ట వంటి తెలంగాణ భాషా పదాలు, ఇగురం, జప్పున, సాల్పుల, యవ్వారం, మాలెస్క ఇలాంటి తెలంగాణ సొగసైన పదాలు సంపుటి నిండా ఉంటాయి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత చొక్కాపు వెంకటరమణ ముందుమాటలో పేర్కొన్నట్టు .. కొలతలకందని ఆప్యాయతల కలబోత. మొలకెత్తిన స్వచ్ఛమైన అనుభూతుల జిలుగు నేత. తెలంగాణ భాషా మాత. ఆ భాష సొగసు, గొప్పదనం తెలుసు కోవాలంటే ఈ ’జోర్దార్ కతలు’ చదవాల్సిందే! ఈ సంపుటికి అందమైన ముఖ చిత్రంతో పాటు, లోపలి కథలకు తెలంగాణకు చెందిన ప్రముఖ చిత్రకారులు వడ్డేపల్లి వెంకటేశ్ అందించారు. ఈ ‘జోర్దార్ కతలు’ సంపుటి కోసం రచయితను 92475 64699కు సంప్రదించవచ్చు. ఈ పుస్తకంలో మొత్తం 44 పేజీలు ఉన్నాయి. వెల రూ. 80 /-.
సమీక్షకులు
- మహంకాళి స్వాతి
89197 73272