పుస్తక పరిచయం: యుద్ధనారి విజయభేరి

introduction of Yuddarnari Vijayaberi Book

Update: 2023-10-01 18:45 GMT

అంబేద్కర్ ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్ నుండి నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన నారీశక్తి వందన్ ఆమోదం వరకు నారీమణులకు ఏ మేరకు రక్షణ కలిగిస్తున్నాయి అనేది ఆలోచించవలసిన విషయం. ఇదే విషయంపై సుమారు 50 మంది కవయిత్రులు రచయితలు స్పందిస్తూ కవితలు రాసి తమదైన శైలిలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వ్యతిరేకిస్తూ యుద్ధనారి అనే కవితా సంకలనాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఈ సంకలనానికి మూల కర్త ప్రముఖ కవి నీలం సర్వేశ్వరరావు. లింగపరమైన వివక్షత నుండి స్త్రీల బయటపడాలంటే ఒక మహిళగా తనకు ఏమి కావాలి తను ఎలాంటి వివక్షతను ఎదుర్కొంటుంది అనేది స్త్రీకి మాత్రమే తెలుస్తుందనే ఉద్దేశంతో ఆయన మహిళలపై అత్యాచారాలు అనే విషయంపై మహిళా కవయిత్రులచే కవిత్వం రాయించి వారి మనోభావాలను యుద్దనారీ రూపంలో నేటి సమాజం ముందు ఉంచారు.

ఈ సంకలనంలో, తప్పిదారి మరిచిపోయి/ మనిషిగా పుడతావని జన్మనిచ్చాను మగాడిగా పుట్టినందుకు/ బాధపడుతున్నాను అంటూ ఓ కవయిత్రి మృగంలా మారిన మగాడిని ప్రశ్నిస్తుంది. అలాగే నారిని కాదు వీరనారినని నేనని ఓ కవయిత్రి నినదిస్తుంది. మనిషిని మనిషిలాగా చూడమని ఇంకో కవయిత్రి కోరుతుంది. వావి లేదు వరుస లేదు చిన్న లేదు పెద్ద లేదు/ ముసలీ లేదు ముతకలేదు/ ఉన్నది ఒకటే అరాచకం/ ఈ గడ్డన జన్మించానని గర్వపడే దాన్ని ఒకప్పుడు/ సిగ్గుతో తలదించుకుంటున్నాను/ కాస్త తలెత్తుకునేలా ప్రవర్తించమని ఓ కవయిత్రీ ప్రార్థిస్తుంది. మగవాడు వాడుకునే బ్లేడుకు/ శరీరానికి కొట్టుకునే డీయోడరెంట్‌కు/ మోటరు వాహనాల ఎత్తుపల్లాలకు/ ఆడదాని శరీరానికి సాపత్యం ఏమిటని ఓ కవయిత్రి ప్రశ్నిస్తుంది. స్త్రీని వ్యాపార వస్తువుగా చూడవద్దని కోరుతుంది.

నిన్నటి చైత్రకు/ మొన్నటి దిశకు/ గతాన కలిసిన నిర్భయకు/ బొట్లు బొట్లుగా కన్నీరు కార్చేసి/ ఎండిన కనుకొలనుల ఎడారి గొంతుకను రాసిన రాతల నిండా మనసు మలినాలని ప్రసవించి/ నీకై రక్షణ చూపుల నొప్పుల్ని పడుతున్న బేలను అంటూ ఓ కవయిత్రి తన ఆవేదనను వ్యక్తపరుస్తుంది. వజ్రోత్సవ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న భారతదేశంలో దేవతగా పూజించే స్త్రీకి భద్రత లేదని తెలిసి భరతమాత చేతిలో మువ్వెన్నెల జెండా సిగ్గుతో తలదించుకుంటుందని ఓ కవయిత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది.

చంద్రమండలం చుట్టి/ హిమాలయాల ఎత్తులను/ తాకిన ధీరవనిత ఆమె/ ఆమె మానం అభిమానం/ గాయపడుతూనే ఉంటాయి/స్త్రీ గౌరవం నిలబెట్టబడితేనే సమాజానికి పరువు దక్కింది! అని ఓ కవయిత్రి గుర్తు చేస్తుంది. పసిబిడ్డలను వయసుమీరిన/ వృద్ధ స్త్రీలను సైతం/ చెరిచే దుష్ట మృగాలను సంహరించాలంటే మార్పు రావాల్సింది చట్టంలోనే కాదు మనుషుల్లో అంటుంది ఇంకో కవయిత్రి ఇలా 50 మంది కవయిత్రులు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల పట్ల తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

పితృస్వామ్య జననం అత్యాచారం అంటూ పుస్తక సంకలనకర్త నీలం సర్వేశ్వరరావు చేసిన సాహసాన్ని స్త్రీలు గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 21వ శతాబ్దంలో స్త్రీవాద ఉద్యమం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది ఈ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ తనదైన శైలిలో కవిత్వం వ్యాసాలు రాస్తూ స్త్రీలను వారి సమస్యలను గుర్తించి వారి పట్ల గౌరవ భావంతో ఈ పుస్తకాన్ని సంకలనం చేసిన నీలం సర్వేశ్వరావుకి హృదయపూర్వక అభినందనలు.

సమీక్షకులు

పూసపాటి వేదాద్రి

99121 97694

Tags:    

Similar News

తొడుగు