నశీర్ అంటేనే ఓ చరిత్ర

Indian Freedom Movement: Telangana Muslim Warriors Book Review

Update: 2024-06-30 18:45 GMT

'సయ్యద్ నశీర్ అహ్మద్ 'ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. అంతేకాదు, వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారందరికీ సుపరిచితమైన పేరు. గత రెండు దశాబ్దాలకు పైగా అలుపెరుగని అక్షర సేద్యం చేస్తూ 'చరిత్ర'ను పండిస్తున్న కలం కర్షకుడు. నిజాల కొలిమిలో కలాన్ని కాల్చి నిఖార్సయిన చరిత్రను తవ్వి తీస్తున్న నిత్య శ్రామికుడు. కావాలని కనుమరుగు చేసిన చారిత్రక సత్యాలను కలం దుర్భిణీతో శోధించి ఉన్నదున్నట్లు తేటతెల్లం చేస్తున్న సత్య శోధకుడు.

చారిత్రక వాస్తవాలను ఒడిసిపట్టి…

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ముస్లింల అనుపమాన త్యాగాలను జనబాహుళ్యానికి పరిచయం చేయడం కోసం కలం పట్టిన నశీర్, అనేక కోణాల్లో స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్రను అక్షరబద్ధం చేశారు. మరుగున పడిన నిజాలను వెలికి తీయడం కోసం ఆయన తిరుగని ప్రాంతం లేదు. స్పృశించని పార్శ్వం లేదు. కాలికి బలపం కట్టుకొని అనేక రాష్ట్రాలు పర్యటించారు. సమరయోధుల కుటుంబాలను కలుసుకున్నారు. అమరుల సమాధులను సందర్శించారు. ప్రఖ్యాత గ్రంథాలయాలను పలకరించారు. ఎక్కడ సమాచారం ఉందంటే అక్కడ రెక్కలు కట్టుకొని వాలారు. సమరయోధుల వారసులు, వారి స్నేహితులను ప్రత్యక్షంగా కలుసుకొని ఖచ్చితమైన సమాచారంతో చారిత్రక వాస్తవాలను ప్రజల ముందుంచుతున్నారు. అధ్యయనం, పర్యటన, సేకరణ, రచన లాంటి చతుర్ముఖ రూపాలను ఏక కాలంలో ప్రదర్శిస్తున్న ఏకైక తెలుగు రచయిత బహుశా నశీరే కావచ్చు.

ప్రభుత్వోద్యోగం నుంచి జర్నలిజం దాకా

ఈయన పుట్టింది నెల్లూరు జిల్లా పురిణిలో.. పెరిగింది గుంటూరు జిల్లా కావలిలో.. ఎంకామ్ ,ఎల్ ఎల్ బీ చదువుకున్నారు. కొంతకాలం గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. ఆ తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి, న్యాయవాద వృత్తిని చేపట్టారు. అదే సమయంలో జర్నలిజం పట్ల మక్కువ పెంచుకొని పాత్రికేయునిగా పద్ధెనిమిది సంవత్సరాల పాటు ఏకబిగిన కొనసాగారు. అప్పటి ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో గుంటూరు బ్యూరోలో పనిచేస్తూ 2005లో రాజీనామా చేశారు.

వివిధ భాషల్లో అనువాదమైన గ్రంథాలు

నిజానికి ఈయన 1998 లోనే 'భారత స్వాతంత్రోద్యమం - ముస్లిం మహిళలు'అన్న మొదటి చరిత్ర గ్రంథాన్ని వెలువరించారు. నాటినుండి నేటివరకు మొత్తం 23 గ్రంథాలను రచించి ప్రచురించారు. ఇప్పుడు తాజాగా 'భారత స్వాతంత్ర్యోద్యమం - తెలంగాణ ముస్లిం యోధులు' అన్న 348 పేజీల పుస్తకాన్ని తన ఇరవై నాల్గవ గ్రంథంగా మన ముందుకు తెచ్చారు. తెలుగు భాషలోనే విరచితమైన ఈ గ్రంథాల్లో అనేకం వివిధ భారతీయ భాషల్లో అనువాదం కావడం విశేషం.

తెలంగాణ మట్టిలో మాణిక్యాలు

ఇప్పుడు మనముందున్న 'భారత స్వాతంత్రోద్యమం తెలంగాణ ముస్లిం యోధులు' అన్న నశీర్ అహ్మద్ తాజా రచన అనేక రకాలుగా ప్రాముఖ్యం కలిగి ఉంది. పోరాటాల పురిటిగడ్డ అయిన తెలంగాణలో పుట్టిన అనేకమంది మట్టిలో మాణిక్యాలను వెలికితీసి పరిచయం చేసింది. మూడు భాగాల్లో విభజితమై ఉన్న ఈ గ్రంథంలో తెలంగాణ ముస్లిం వీరుల పరిచయం ఒక ప్రత్యేకం. విస్తృత పరిశీలన, అపారమైన పరిశోధనా శక్తితో, ఉన్నదున్నట్లు సూటిగా, స్పష్టంగా విషయాన్ని విడమరచి చెప్పడంలో ఆరితేరిన నశీర్ అహ్మద్ తెలంగాణ ముస్లిం పోరాట యోధుల్ని పరిచయం చేసిన తీరు అద్భుతం. మౌల్వీ అల్లావుద్దీన్ , షోయబుల్లా ఖాన్ , తుర్రెబాజ్ ఖాన్ , ఆబిద్ హసన్ సఫ్రానీ, షేక్ బందగీ, రజబలీ మొదలు ఖుద్దూస్ జైమీ, ఫరీద్ మీర్జా, మాసూమా బేగం, ఆయెషా బేగం, అబ్దుల్ బాసిత్ , జైనాబీ, నన్నే బచ్చా, జహందర్ అఫ్సర్ ... ఇలా సుమారు ముఫ్ఫై మంది వరకూ తెలంగాణ యోధుల్ని పరిచయం చేస్తుందీ పుస్తకం.

చరిత్ర విస్మరణలో ముస్లిం యోధులు

బందగీ, మఖ్దూం మొయినుద్దీన్ , షోయబుల్లా ఖాన్ , మరో రెండుమూడు పేర్లు తప్ప మిగతా పేర్లు బహుశా ఎవరికీ తెలియదంటే అతిశయోక్తి కాబోదు. ఎక్కువ మంది ముస్లిం యోధుల్ని మన సోకాల్డ్ చరిత్రకారులు విస్మరించారు. నశీర్ అహ్మద్ కృషితో ఇప్పటివరకు వెలుగులోకొచ్చిన వీరు మాత్రమే కాక ఇంకా వెలుగులోకి రాని విస్మృత యోధులు ఇంకెందరున్నారో నిశితంగా సమగ్ర పరిశీలన చేసి వెలికి తీయవలసి ఉంది. ఆ పనిని కూడా నశీర్ భాయ్ నిబద్దతతో నెరవేర్చగలడన్న నమ్మకం, విశ్వాసం నాకుంది.

ప్రముఖ రచయిత, 'వీక్షణం' సంపాదకులు ఎన్. వేణుగోపాల్ రాసిన పరిచయ వాక్యం, ప్రముఖ కవి, 'చమన్' సంపాదకులు స్కైబాబా రాసిన ఆప్తవాక్యం నశీర్ అహ్మద్ ప్రతిభను చాటడంతో పాటు, పుస్తకం విలువను మరింతగా పెంచాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. చివరిగా ఒక్కమాట. నశీర్ అంటేనే చరిత్ర.. చరిత్ర అంటేనే నశీర్ ! నశీర్ భాయ్ ముందుకే అడుగెయ్! పదార్ధాలను వెలికితియ్! చరిత్రను తిరగరాయ్!! బెస్టాఫ్ లక్ నశీర్ భాయ్!!!

ప్రతులకు

భారత స్వాతంత్ర్యోద్యమం : తెలంగాణ ముస్లిం యోధులు

సయ్యద్ నశీర్ అహ్మద్ - 94402 41727

ప్రచురణ: అజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్, ఉండవల్లి

పేజీలు: 350

వెల : రూ. 500


సమీక్షకులు

యండి. ఉస్మాన్ ఖాన్,

సీనియర్ జర్నలిస్టు

99125 80645

Tags:    

Similar News

అమరత్వంపై